Bengaluruలోనే విమానాల తయారీ

ABN , First Publish Date - 2022-07-09T16:50:52+05:30 IST

ప్రపంచ ఐటీబీటీ, స్టార్టప్‌ రాజధానిగా ఉన్న బెంగళూరు నగరంలో రానున్న రోజుల్లో విమానాల తయారీ కూడా సాధ్యమేనని ముఖ్యమంత్రి బసవరాజ్‌

Bengaluruలోనే విమానాల తయారీ

                       - త్వరలోనే సాధ్యం చేస్తాం: Cm


బెంగళూరు, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఐటీబీటీ, స్టార్టప్‌ రాజధానిగా ఉన్న బెంగళూరు నగరంలో రానున్న రోజుల్లో విమానాల తయారీ కూడా సాధ్యమేనని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పేర్కొన్నారు. దేవనహళ్లిలో హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, సఫ్రాన్‌ గ్రూప్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజన్ల తయారీ విభాగాన్ని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఏరోస్పేస్‌ సాంకేతిక రంగంలో బెంగళూరు శరవేగంగా దూసుకెళుతూ ప్రపంచదృష్టిని ఆకర్షిస్తోందన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజన్ల తయారీ ప్రక్రియ 65 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సాకారమైందని, ఇదే దిశలో మొత్తం విమానాల ఉత్పత్తి బెంగళూరుతోపాటు కర్ణాటకలో రానున్న రోజుల్లో మరింత ఊపందుకునే అవకాశాలు లేకపోలేదన్నారు. ఈ దిశలో హెచ్‌ఏఎల్‌, ఎన్‌ఏఎల్‌, డీఆర్‌డీఓ వంటి సంస్థలు నిరంతర ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయన్నారు. 


ఇథనాల్‌ ఉత్పాదనా కేంద్రంగా కర్ణాటకకు చోటు

కర్ణాటకలో ఇథనాల్‌ ఉత్పాదన అనే అంశంపై నగరంలో ఏర్పాటైన మరో సదస్సులో సీఎం బొమ్మై ప్రసంగించారు. రానున్న రోజుల్లో అత్యధిక ఇథనాల్‌ ఉత్పాదనా కేంద్రంగా కర్ణాటకకు చోటు దక్కడం ఖాయమన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 32 చక్కెర కర్మాగారాలు ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నాయని, మరో 60 చక్కెర కర్మాగారాలు ఇథనాల్‌ ఉత్పత్తి కోసం ఎదురు చూస్తున్నాయన్నారు. ఏడాదిన్నర అవధిలో ఇథనాల్‌ ఉత్పత్తి మరో 20 శాతం పెరగడం ఖాయమన్నారు. చెరుకుతోపాటు వరి, జొన్న, గోధుమల పొట్టుతో కూడా ఇథనాల్‌ తయారీకి సంబంధించి పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఇంధన ఉత్పాదన రంగంలో స్వయం సమృద్ధికి ఇలాంటి పరిశోధనలు బాగా దోహదపడతాయన్నారు. 

Updated Date - 2022-07-09T16:50:52+05:30 IST