రాష్ట్రానికి భారీ పెట్టుబడులు

ABN , First Publish Date - 2022-05-28T16:49:53+05:30 IST

రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా రానున్నాయని, దావోస్‌ పర్యటన విజయవంతమైందని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై వెల్లడించారు. దావోస్‌ పర్యటన

రాష్ట్రానికి భారీ పెట్టుబడులు

                  - దావోస్‌ పర్యటన విజయవంతం: మీడియాతో సీఎం


బెంగళూరు: రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా రానున్నాయని, దావోస్‌ పర్యటన విజయవంతమైందని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై వెల్లడించారు. దావోస్‌ పర్యటన ముగించుకుని బెంగళూరుకు తిరిగొచ్చిన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రూ.59,350 కోట్లు పెట్టుబడులు సాధ్యమయ్యాయన్నారు. దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో కర్ణాటక పట్ల పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపారన్నారు. నాలుగు రోజులపాటు జరిగిన సదస్సులో నిరంతరం పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యామన్నారు. 52వేల కోట్ల పెట్టుబడులకు రెండు కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ఇటీవలి కాలంలో రాష్ట్రానికి వచ్చిన భారీ పెట్టుబడులు ఇవేనన్నారు. రెన్యూపవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ రూ. 50వేల కోట్లకు ఒప్పందం చేసుకుందన్నారు. రానున్న ఏడేళ్లలో ఆధునికీకరమైన ఇంధనం, బ్యాటరీ స్టోరేజ్‌, హైడ్రోజన్‌ బ్యాటరీల స్థాపనకు ఒప్పంద కుదిరిందని తెలిపారు. తద్వారా 30వేలకు పైగా ఉద్యోగాలు సాధ్యమవుతాయన్నారు. రెండు విడతలలో ఈ ప్రాజెక్టు అమలు కానుందని, రెండేళ్లలో ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమవు తుందన్నారు. లులు గ్రూప్‌ రాష్ట్రంలో రూ. 2వేల కోట్ల పెట్టుబడికి ఒప్పందం చేసుకుందని, 4 షాపింగ్‌మాల్స్‌, హైపర్‌ మార్కెట్‌, ఎగుమతి ఆధారిత ఫుడ్‌ప్రాజెక్టు ప్రారంభిస్తుందన్నారు. వీటి ద్వారా 10వేల ఉద్యోగాలు సాధ్యమవుతాయన్నారు. టిబిలియంట్‌ గ్రూప్‌ హిటాచి ఎనర్జీ, సీమెన్స్‌, ఆర్చాలర్‌ మిథల్‌, భారతి ఎంటర్‌ప్రైజెస్‌, నెస్లె, డసాల్ట్‌ సిస్టమ్‌ సంస్థలు పెట్టుబడులకు అంగీకరించాయన్నారు. టిబిలియంట్‌ గ్రూప్‌ దేవనహళ్లిలో పది ఎకరాల్లో కేంద్రీకృత పాకశాల, టిబిలియంట్‌ బయోసిస్‌ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించనుందన్నారు. ప్రస్తుతం 9వేల మంది కంపెనీలో పనిచేస్తున్నారన్నారు. హిటాచి ఎనర్జీ సంస్థ ఇ-చార్జింగ్‌ మౌలిక సదుపాయాల విభాగాన్ని ప్రారంభిస్తుందన్నారు. సీమెన్స్‌ మ్యాగ్నెటిక్‌ ఇమేజింగ్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ ప్రారంభిస్తుందన్నారు. మరిన్ని కంపెనీలు పెట్టుబడులకు సిద్ధమయ్యాయని, రానున్న రోజుల్లో సాధ్యం కానున్నాయన్నారు. మంత్రులు మురుగేశ్‌ నిరాణి, సోమణ్ణ, సీసీ పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T16:49:53+05:30 IST