అర్ధరాత్రి టవర్‌ ఎక్కి హల్‌చల్‌

ABN , First Publish Date - 2022-05-20T05:11:27+05:30 IST

స్థానిక ఎమ్మెల్యే సీనియర్‌ నాయకులను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ

అర్ధరాత్రి టవర్‌ ఎక్కి హల్‌చల్‌
ఎమ్మెల్యేతో యాదగిరి, చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌ సిగ్నల్‌ టవర్‌ ఎక్కిన యాదగిరి

  • సీనియర్‌ నాయకులను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని టీఆర్‌ఎస్‌ నాయకుడి ఆరోపణ 
  • 5గంటలపాటు టవర్‌పైనే.. 
  • ఎమ్మెల్యే వచ్చి హామీ ఇవ్వడంతో టవర్‌ దిగిన వైనం 


చేవెళ్ల, మే 19 : స్థానిక ఎమ్మెల్యే సీనియర్‌ నాయకులను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఓ టీఆర్‌ఎస్‌ నాయకుడు టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. ఈ ఘటన చేవెళ్ల పోలీ్‌సస్టేషన్‌ వద్ద బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చేవెళ్ల మాజీ ఎంపీపీ ఎం.బాల్‌రాజ్‌ కుమారుడు గుడిమల్కాపూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ ఎం.యాదగిరి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బుధవారం రాత్రి 11.30గంటలకు చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో నిరుపయోగంగా ఉన్న 120మీటర్ల ఎత్తుగల కమ్యూనికేషన్‌ సిగ్నల్‌ టవర్‌ ఎక్కాడు. ఈ విషయాన్ని వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టు చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న వారు టవర్‌ వద్దకు చేరుకుని యాదగిరికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. పోలీసులు మైక్‌లో కిందకు దిగిరావాలని యాదగిరిని కోరినా వినిపించుకోలేదు. ఎమ్మెల్యే వచ్చేవరకూ దిగేదిలేదని యాదగిరి భీష్మించుకుని టవర్‌పైనే కూర్చున్నాడు. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు పి.కార్తీక్‌రెడ్డి ఫోన్‌చేసి చెప్పినా యాదగిరి వినిపించుకోకుండా టవర్‌ పైనే కూర్చుండిపోయాడు. విషయం తెలుసుకున్న చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం హైదరాబాద్‌ నుంచి హుటాహుటిన చేవెళ్ల పోలీ్‌సస్టేషన్‌కు వచ్చి కిందకు దిగాలని కోరినా యాదరిగి వినలేదు. దీంతో సీఐ విజయ్‌భాస్కర్‌రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీపీ బాల్‌రాజ్‌తో కలిసి కారులో వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట్‌ మండలంలోని చించల్‌పేట్‌ గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే కాలె యాదయ్య వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించారు. ఎమ్మెల్యే వెంటనే బయల్దేరి గురువారం తెల్లవారుజామున 3గంటలకు చేవెళ్ల పోలీ్‌సస్టేషన్‌కు వచ్చారు. మైక్‌తీసుకుని ‘ఎమ్మెల్యేను వచ్చాను.. యాదగిరి కిందకు దిగిరావాలి..’ అని చెప్పారు. దీంతో స్పందించిన యాదగిరి టవర్‌పై నుంచే ఫోన్‌ద్వారా ఎమ్మెల్యేతో మాట్లాడాడు. ‘మీరు సీనియర్‌ నాయకులను పట్టించుకోవడం లేదు.. మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంతో కిందిస్థాయి కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కార్యకర్తలను పట్టించుకోకపోతే వారి పరిస్థితి ఏంటి?’ అని ప్రశ్నించాడు. డబ్బులు ఉన్నవారి వెంట వెళ్లడం సరికాదని అందరితో కలిసి పోవాలని ఎమ్మెల్యేతో యాదగిరి గట్టిగా వాదించాడు. తమ వర్గం నాయకులకు సరైన న్యాయం చేస్తానంటేనే టవర్‌ దిగి వస్తానని చెప్పాడు. లేదంటే కిందకు దూకుతానని హెచ్చరించాడు. దీంతో ఎమ్మెల్యే యాదయ్య సరే అని చెప్పడంతో యాదగిరి టవర్‌పై నుంచి కిందకు దిగాడు. దీంతో యాదగిరి కుంటుంబసభ్యులు, పోలీసులు, స్థానికులు, వివిధ పార్టీల నాయకులు ఊపిరిపీల్చుకున్నారు. కిందకు వచ్చిన తర్వాత యాదగిరితో ఎమ్మెల్యే కొంతసేపు మంతనాలు జరిపారు. యాదగిరి చెప్పిన వారికి నామినేటెడ్‌ పదవుల్లో అవకాశం కల్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. స్వయంగా యాదగిరిని ఎమ్మెల్యే తన కారులో ఎక్కించుకుని అతడి ఇంట్లో వదిలిపెట్టి వెళ్లారు. కాగా సైబరాబాద్‌ క్రైమ్‌ అడిషనల్‌ డీసీపీ నర్సింహారెడ్డి, చేవెళ్ల ఏసీపీ రవీందర్‌రెడ్డి, ఫైర్‌అధికారులు బిక్షపతి, చేవెళ్ల మండల సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణారెడ్డి, వివిధపార్టీల నాయకులు, పోలీసులు ఉన్నారు. 



Updated Date - 2022-05-20T05:11:27+05:30 IST