‘సుప్రీంకోర్టు పనితీరుపై మూడు రోజులకోసారి సీజేఐ సమీక్ష’

ABN , First Publish Date - 2020-04-11T02:49:26+05:30 IST

మహమ్మారి వేధింపుల నేపథ్యంలో సుప్రీంకోర్టు కార్యకలాపాల తీరును

‘సుప్రీంకోర్టు పనితీరుపై మూడు రోజులకోసారి సీజేఐ సమీక్ష’

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి వేధింపుల నేపథ్యంలో సుప్రీంకోర్టు కార్యకలాపాల తీరును భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే ప్రతి మూడు లేదా నాలుగు రోజులకోసారి సమీక్షిస్తారు. అనంతరం సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ఇచ్చే తేదీలపై నిర్ణయం తీసుకుంటారు.


సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శి, న్యాయవాది అశోక్ అరోరా మాట్లాడుతూ న్యాయస్థానాలకు వేసవి సెలవులను సాధారణం కన్నా కొద్ది రోజులు ముందుగానే ఇవ్వాలని డిమాండ్‌ వస్తోందన్నారు. ఈ డిమాండ్‌ చేస్తున్న బార్ నాయకులు, ఇతర సంస్థల సభ్యులు కొద్ది కాలం వేచి చూడాలన్నారు. ఈ డిమాండ్‌పై నిర్ణయం తీసుకునే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలన్నారు. 


తాను శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సీజేఐ జస్టిస్ బాబ్డేతో మాట్లాడానని తెలిపారు. సీజేఐ ప్రతి మూడు లేదా నాలుగు రోజులకోసారి పరిస్థితిని సమీక్షిస్తానని చెప్పారన్నారు. ఇతర న్యాయమూర్తులతోనూ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతోనూ సంప్రదించి, తాను పరిస్థితిని సమీక్షిస్తానని సీజేఐ చెప్పారన్నారు. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగుతుందని చెప్పినట్లు తెలిపారు. ‘‘కాబట్టి మనం కొంత కాలం వేచి చూడటం మంచిది’’ అని అశోక్ అరోరా తెలిపారు. 


Updated Date - 2020-04-11T02:49:26+05:30 IST