పెగాసస్‌ వివాదంపై జస్టిస్ రమణ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-08-05T18:09:09+05:30 IST

గూఢచర్యం ఆరోపణల్లో వాస్తవం ఉంటే, అటువంటి చర్యకు పాల్పడటం

పెగాసస్‌ వివాదంపై జస్టిస్ రమణ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : గూఢచర్యం ఆరోపణల్లో వాస్తవం ఉంటే, అటువంటి చర్యకు పాల్పడటం చాలా తీవ్రమైన విషయం అనడంలో ఎటువంటి సందేహం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ చెప్పారు. ఎన్ రామ్, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ రమణ గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. 


పెగాసస్ నిఘా వివాదంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ఇజ్రాయెల్‌లోని ఎన్ఎస్ఓ గ్రూప్ తయారు చేసిన ఈ స్పైవేర్‌తో కొందరు రాజకీయ నేతలు, ఉద్యమకారులు, పాత్రికేయులపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టినట్లు పిటిషనర్లు ఆరోపించారు. 


పిటిషనర్లు ఎన్ రామ్, తదితరుల తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ, పెగాసస్ ఓ రోగ్ టెక్నాలజీ అని ఆరోపించారు. ఇది మనకు తెలియకుండానే మన జీవితాల్లోకి ప్రవేశిస్తోందన్నారు. ఇది మన గణతంత్ర దేశ విలువలు, వ్యక్తిగత గోప్యత, గౌరవ, మర్యాదలపై దాడి అని తెలిపారు. దీనిపై జస్టిస్ రమణ స్పందిస్తూ, గూఢచర్యం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే, నిస్సందేహంగా ఇది తీవ్రమైన విషయమేనని తెలిపారు. గూఢచర్యం, నిఘా జరుగుతున్నట్లు 2019లో ఆరోపణలు వచ్చాయన్నారు. మరింత సమాచారం తెలుసుకోవడానికి ఏమైనా కృషి జరుగుతోందో, లేదో తనకు తెలియదన్నారు. 


సిబల్ స్పందిస్తూ, ఈ స్పైవేర్‌ను కేవలం ప్రభుత్వ వ్యవస్థలకు మాత్రమే అమ్ముతున్నారని తెలిపారు. ప్రైవేటు సంస్థలు దీనిని సంపాదించడం సాధ్యం కాదని చెప్పారు. పాత్రికేయులు, కోర్టు ఆఫీసర్స్, విద్యావేత్తలు, రాజ్యాంగ అధికారులపై ఈ స్పైవేర్‌తో నిఘా పెడుతున్నారని చెప్పారు. దీనిని ఎవరు కొన్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. దీనికి సంబంధించిన హార్డ్‌వేర్‌ను ఎక్కడ పెట్టారో చెప్పాలన్నారు. ప్రభుత్వం దీనిపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేయాలని కోరారు. పెగాసస్ స్పైవేర్ అంశం కేవలం మన దేశానికి మాత్రమే పరిమితం కాలేదన్నారు. పెగాసస్ సాప్ట్‌వేర్ ను ఆసంస్థ కేవలం ప్రభుత్వ ఏజెన్సీలకు అమ్మినప్పుడు, ఫోన్ హ్యాకింగ్ అంశం కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఉండదన్నారు. 


ఈ పిటిషన్లపై తదుపరి విచారణ మంగళవారం జరుగుతుంది.


Updated Date - 2021-08-05T18:09:09+05:30 IST