అనుకున్నది సాధించారు!

ABN , First Publish Date - 2022-05-31T06:27:17+05:30 IST

కృషి, పట్టుదలతో ఎంతటి ఉన్నతమైన లక్ష్యాన్ని అయినా అధిగమించవచ్చునని నిరూపించారు ఓ వివాహిత..

అనుకున్నది సాధించారు!
కుటుంబంతో కిరణ్మయి

సివిల్స్‌లో కిరణ్మయికి 56వ ర్యాంకు
సర్పవరం జంక్షన్‌ (కాకినాడ), మే 30: కృషి, పట్టుదలతో ఎంతటి ఉన్నతమైన లక్ష్యాన్ని అయినా అధిగమించవచ్చునని నిరూపించారు ఓ వివాహిత.. సివిల్స్‌లో 56వ ర్యాంకు సాధించి సత్తా చాటారు.  కాకినాడ జిల్లా కాకినాడ రూరల్‌ మండలానికి చెందిన కొప్పిశెట్టి కిరణ్మయి డాక్టర్‌గా రెండేళ్ల పాటు రోగులకు వైద్యసేవలందించారు. సమాజానికి మరింత మెరుగైన సేవలు అందించాలంటే ఐఏఎస్‌ ఒక్కటే మార్గమని నిర్ణయించుకున్నారు. తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌ రాసి 573వ ర్యాంకు సాధించారు. ఐఏఎస్‌ హోదా దక్కకపోవడంతో తన కల సాకారం చేసుకునేందుకు మూడుసార్లు ప్రయత్నించి నాలుగోసారి అనుకున్న లక్ష్యాన్ని సాధించి సివిల్స్‌లో 56వ ర్యాంకుతో మెరిశారు.  కాకినాడ రూరల్‌ మండలం వలసపాకలకు చెందిన కొప్పిశెట్టి లక్ష్మణరావు, వెంకటలక్ష్మి దంపతులకు కుమారుడు నందకిషోర్‌, కుమార్తె కిరణ్మయి ఉన్నారు. తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో డీఆర్‌డీవోలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. భార్య వెంకటలక్ష్మి తెలంగాణలో ఎయిడెడ్‌ స్కూల్‌ ఉపాధ్యాయురాలిగా పనిచేసి రిటైరయ్యారు. కిరణ్మయి చిన్ననాటి నుంచి చదువుపై ఆసక్తి కనబరిచేవారు.  ఎల్‌కేజీ నుంచి  యూపీపీఎస్సీ సివిల్స్‌ పరీక్షల్లో అన్నింటా ప్రతిభ చూపి మంచి ర్యాంకులు సాధించారు. తండ్రి ఉద్యోగ రీత్యా కిరణ్మయి విద్యాభ్యాసం అంతా తెలంగాణలో కొనసాగింది.  ఎంసెట్‌లో మెడిసిన్‌ విభాగంలో 24వ ర్యాంకు సాధించి 2010లో ఉస్మానియా మెడికల్‌ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. 2015లో జనరల్‌ మెడిసిన్‌లో పీజీ పూర్తి చేశారు. అనంతరం రెండేళ్లపాటు ఈఎ్‌సఐ ఆస్పత్రిలో వైద్య సేవలందించారు. 2016 నుంచి సివిల్స్‌కు ప్రిపేర్‌ అవ్వడం ప్రారంభించారు.

Updated Date - 2022-05-31T06:27:17+05:30 IST