చాక్‌పీస్‌.. డస్టర్లకు డబ్బులు లేవు

ABN , First Publish Date - 2022-08-11T05:59:52+05:30 IST

విద్యార్థులకు అవసరమైన తరగతి బోధన జరపడానికి చాక్‌పీస్‌.. డస్టర్లను కొనాలన్నా డబ్బులు లేని దుస్థితిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు కొట్టుమిట్టాడుతున్నాయి.

చాక్‌పీస్‌.. డస్టర్లకు డబ్బులు లేవు

- నిధులకు గ్రహణం

- ప్రిన్సిపాల్స్‌కు తలనొప్పిగా మారిన బిల్లులు

- ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలపై నిర్లక్ష్యం

జగిత్యాల, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు అవసరమైన తరగతి బోధన జరపడానికి చాక్‌పీస్‌.. డస్టర్లను కొనాలన్నా డబ్బులు లేని దుస్థితిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రతి  యేటా మంజూరు కావాల్సిన బిల్లులు రాకపోవడంతో ప్రిన్సిపాల్స్‌ ఇబ్బం దులకు గురవుతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో జూనియర్‌ కళాశాలల నిర్వహణ భారంగా మారుతోంది.   స్టేషనరీ, రెగ్యులర్‌ పరీక్షల నిర్వహణ తదితరాల కోసం ఏడాదికి సగటున ఒక్కో కళాశాలకు కనీసం రూ. 20 వేల వరకు ఖర్చవుతుంది. దీనికి తోడు మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ కోసం నెలకు కనీసం రూ. 5 వేల వరకు అవసరం ఉంటుంది. విద్యుత్‌ పరికరాల మరమ్మతులు, ఇతర సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. 

నిధులు మంజూరు కాక ఇక్కట్లు

విద్యార్థుల సంఖ్య పెంచండి.. ఇందుకోసం పాఠశాలలు, ఇళ్లకు వెళ్లండి.. వాల్‌ పోస్టర్లు, బ్యానర్లతో విసృత ప్రచారం చేయండి. అంటూ ఆదేశిస్తున్న ఇంటర్మీడియట్‌ అధికారులు కళాశాల నిర్వహణకు అయ్యే నిఽధుల వరకు వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారన్న విమర్శలున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి విద్యా సంవత్సరం ప్రభుత్వం నాలుగు విడతల్లో కాంటిజెంట్‌ నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. కళాశాలలో ప్రవేశం పొందిన ఒక్కో విద్యార్థికి రూ. 25 చొప్పున నాలుగు విడతల్లో రూ. 100 నిధులు మంజూరు చేయాలి. రెండు సంవత్సరాలుగా ఒకే విడత నిధులు విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం సైతం కేవలం ఒక విడత మాత్రమే కాంటింజెంట్‌ నిధులను విడుదల చేసింది. అంతంతమాత్రంగా విడుదలవుతున్న నిధులతో కళా శాల నిర్వహణ ఎలా చేయాలో తెలియక ప్రిన్సిపాల్స్‌  ఇబ్బందులు పడుతున్నారు.  2014 విద్యా సంవత్సరం వరకు విద్యార్థుల నుంచి కనీసం రూ. 200కు తగ్గకుండా రూ.900 వరకు ఫీజులు వసూలు చేసేవారు. సంబంధిత డబ్బులతో కళాశాల నిర్వహణకు అవసరమైన పనులకు బిల్లులు సమకూ ర్చుకునే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం సుమారు ఎనిమిది సంవత్సరాలుగా అవి వసూలు చేయడం లేదు.

సొంత డబ్బులతో స్టేషనరీ కొనుగోలు

2015 తర్వాత ఇంటర్‌లో ఉచిత ప్రవేశాల కారణంగా సంఖ్య గణనీయంగా పెరిగింది.  మూడేళ్లుగా ప్రభుత్వ కళాశాలలకు నిధులు మంజూరు చేయకపోవడంతో నిర్వహణ తలకుమించిన భారంగా తయారైంది. చాక్‌ పీసులు, డస్టర్లు, స్టేషనరీ ఇతర సామగ్రి కొనుగోలుకు ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌ తమ జేబు నుంచి వెచ్చించి  కొనుగోలు చేస్తున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

- బి. నారాయణ, జిల్లా ఇంటర్‌ విద్యాధికారి

జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల నిర్వహణకు విడుదల కావాల్సిన నిధులు సకాలంలో రావడం లేదు. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లాము. నాలుగు విడతలుగా మంజూరు కావాల్సిన కాంటిజెంట్‌ నిధులల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఒక్క విడత మంజూ రు అయింది. మిగిలిన విడతల నిధులు మంజూరు కావాల్సి ఉంది.  

Updated Date - 2022-08-11T05:59:52+05:30 IST