చిట్టీల పేరుతో టోకరా.. 3 కోట్లతో ఉడాయించిన దంపతులు

ABN , First Publish Date - 2022-02-07T19:01:42+05:30 IST

చిట్టీల పేరుతో సుమారు రూ. మూడు కోట్ల సొమ్ము కూడగట్టి రాత్రికి రాత్రే..

చిట్టీల పేరుతో టోకరా.. 3 కోట్లతో ఉడాయించిన దంపతులు

  • ఎమ్మెల్యేను ఆశ్రయించిన బాధితులు


హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల : చిట్టీల పేరుతో సుమారు రూ. మూడు కోట్ల సొమ్ము కూడగట్టి రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి ఉడాయించారు దంపతులు. ఈ సంఘటన సూరారంకాలనీలో జరిగింది. బాధితులు న్యాయం కోసం ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్‌ను ఆశ్రయించారు. వారికి న్యాయం జరిగేలా చూడాలని దుండిగల్‌ సీఐ రమణారెడ్డిని ఎమ్మెల్యే ఆదేశించారు. సూరారంకాలనీ రాజీవ్‌గృహకల్ప 11వ బ్లాక్‌ ఎదురుగా మద్దిరాల పద్మ, విజయ్‌కుమార్‌ ఇరవై ఏళ్లుగా నివాసముంటున్నారు. స్థానికులతో కలుపుగోలుగా ఉంటూ చిట్టీల వ్యాపారం చేశారు. 


వీరి వద్ద దాదాపు 300 మంది మహిళలు చిట్టీలు వేశారు. బంగారం తాకట్టు  పెట్టారు. డబ్బు, బంగారం కూడబెట్టుకున్న దంపతులు పిల్లలతో సహా రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసి, సామాను మొత్తం తరలించుకుని ఉడాయించారు. ఆదివారం గమనించిన బాధితులు ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం దాచుకున్న సొమ్మును దోచుకుపోవడంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు.

Updated Date - 2022-02-07T19:01:42+05:30 IST