పుట్టగొడుగుల్లా చిట్‌ కంపెనీలు

ABN , First Publish Date - 2021-06-14T04:46:57+05:30 IST

జిల్లాలో చిట్‌ ఫండ్‌ కంపెనీల మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీటిలో కొన్ని ప్రభుత్వ అనుమతితో ప్రారంభిస్తుండగా, మరికొన్ని అనుమతి లేకుండా ప్రారంభిస్తున్నారు.

పుట్టగొడుగుల్లా చిట్‌ కంపెనీలు

చీటీల పేరుతో మోసాలు

లబోదిబోమంటున్న బాధితులు


నెల్లూరు(హరనాథపురం), జూన 13 : జిల్లాలో చిట్‌ ఫండ్‌ కంపెనీల మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.  వీటిలో కొన్ని ప్రభుత్వ అనుమతితో ప్రారంభిస్తుండగా, మరికొన్ని అనుమతి లేకుండా ప్రారంభిస్తున్నారు. ఈ కంపెనీల పరిస్థితి ఇలా ఉంటే, ఇళ్లలోనే చీటీలు వేసే వారు ఎందరో ఉన్నారు. వీరి ద్వారా మోసపోయిన వారు వందల్లో ఉన్నారు. మోసపోయిన ఎందరో పత్రికలకు తెలియచేసి లభోదిభోమంటున్నారు. కుమార్తె పెళ్లికో, ఇతర అత్యవసరాలకో కొందరు చీటీల్లో సొమ్ము పెడుతూ చీటి పాటదారుకు నగదు చెల్లిస్తున్నారు. అవసరమైనప్పుడు చీటి పాట పాటపాడి సొమ్ము తీసుకొంటుంటారు. సరిగ్గా పాట సమయానికి అందిన సొమ్ముతో ఎందరో చీటీ పాటదారులు చీటీ సొమ్ము కట్టించుకొని ఉడాయిస్త్తున్నారు. 


ప్రముఖ కంపెనీ మోసం


నెల్లూరులోని ఓ ప్రముఖ చిట్‌ కంపెనీ చీటీల పేరుతో మోసాలకు పాల్పడుతూ గ్రూపు సభ్యులను తీవ్రంగా మోసం చేస్తున్నట్లు సమాచారం. ఆ కంపెనీ మోసాల గురించి పలువురు ఆంధ్రజ్యోతి దృష్టికి తీసుకువచ్చారు. నగరంలోని బీవీ నగర్‌కు చెందిన జీ. విజయలక్ష్మి ఆ ప్రముఖ చిట్‌కంపెనీలో రూ. 5లక్షల చీటీ చేరింది. ఆమె చేరిన గ్రూపులో 50 మంది సభ్యులు ఉన్నారు. విజయలక్ష్మి నెలకు పదివేల వంతున చీటి సొమ్ము చెల్లించేలా ఆ చీటీలో చేరింది. ఆమెకు చిట్‌ మొత్తానికి సంబంధించి ఒక పాస్‌బుక్‌ కూడా ఇచ్చారు. ఆ చీటీలో చేరిన ఆమె 2020 అక్టోబరు 30న పాటపాడి ష్యూరిటీ కూడా ఇచ్చారు. ఈ చిట్‌కు సంబంధించి ఆమెకు రూ.4.09 లక్షలు రావాల్సి ఉండగా ఆమె పలు మార్లు ఆ చిట్‌ కంపెనీ చుట్టూ తిరిగినా ఆ డబ్బును ఆమెకు చెల్లించక పోవటంతో ఆంధ్రజ్యోతికి రాతపూర్వకంగా తెలిపింది. ఆ చిట్‌ కంపెనీ తనను మోసం చేసిందని, తనకు డబ్బు వచ్చేలా న్యాయం చేయాలని వేడుకుంది. ఇలా ఆ చిట్‌ కంపెనీ మరి కొంతమందిని కూడా మోసం చేసిందని తెలియ వచ్చింది. ఆ చిట్‌కంపెనీ మేనేజర్‌ను ఆంధ్రజ్యోతి ప్రశ్నించగా కరోనా కారణంగా ఆ చిట్‌కు రావాల్సిన డబ్బు అందకపోవటం తో చిట్‌ వేసిన విజయలక్ష్మికి చెల్లించలేక పోయామని చెప్పారు. 


పాట లక్షల్లో..


 నెల్లూరులో 17 చిట్‌ కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ రిజిస్ట్రర్‌ అయి ఉన్నాయి. ఈ కంపెనీలు 25,. 40, 50 నెలలకు చీటీలు వేస్తుంటాయి. లక్ష, రెండు లక్షలు, మూడు లక్షలు, నాలుగు లక్షలు, ఐదు లక్షల చీటీలు వేస్తుంటాయి. ఒక గ్రూపుగా సభ్యులు ఈ చీటీలో చేరి చీటీ పాట పాడుతుంటారు. పాట పడినప్పుడు మొత్తం డబ్బును చిట్‌ కంపెనీలు పాట పాడినవారికి చెల్లించాలి. కాని చాలా కంపెనీలు అలా చెల్లించటం లేదని తెలిసింది. దీంతో చీటి పాట పాడిన వారు తీవ్రంగా నష్ట పోతున్నారు. 


అనుమతి అవసరం  :


జిల్లాలో చిట్‌ కంపెనీల పర్యవేక్షణకు చిట్‌ రిజిసా్ట్రర్‌ ఉంటారు. చిట్‌ కంపెనీ కొత్తగా గ్రూపును ఏర్పాటు చేసి చీటి వేసినప్పుడు ఆ చిట్‌ రిజిసా్ట్రర్‌కు తెలియచేయాలి.  ఆయన అనుమతి తీసుకోవాలి. ఎంత మొత్తానికి చిట్‌ వేస్తారో అంతే మొత్తాన్ని ఆ చిట్‌ రిజిసా్ట్రర్‌కు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రిపోర్టు(ఎఫ్‌డీఆర్‌) ఇవ్వాలి. కాని చాలా కంపెనీలు  ఇవ్వటం లేదనేది సమచారం. అసలు చిట్‌ వేసే విషయం కూడా ఆ చిట్‌ రిజిసా్ట్రర్‌కు తెలియ చేయటం లేదనేది సమాచారం. దీంతో చిట్‌ కంపెనీలు సులభంగా ప్రజలను మోసం చేస్తున్నట్లు తెలిసింది. మోసపోయిన వారు చివరకు చిట్‌ రిజిసా్ట్రర్‌ను, ప్రతికలను ఆశ్రయించటం మామూలైంది.


చిట్‌కంపెనీ వారు మోసం చేశారు..


ప్రముఖ చిట్‌ కంపెనీలో రూ. 5 లక్షల  చీటీ గ్రూపులో 2018 ఫిబ్రవరి 2న  చేరాను. 50 మంది సభ్యులు గల గ్రూపు అని చెప్పారు. నెలకు 10వేలు కడుతున్నాను.  2020 అక్టోబరు 30న పాట పాడి ష్యూరిటీ కూడా ఇచ్చాను. నాకు రూ.4.09 లక్షలు రావాల్సి ఉండగా ఇవ్వలేదు. ఆ ప్రముఖ కంపెనీ కార్యాలయం చుట్టూ తిప్పుకొంటున్నారు. మేనేజర్‌ సమాధానం చెప్పటం లేదు. ఈ విషయాన్ని చిట్‌ రిజిసా్ట్రర్‌ దృష్టికి కూడా తీసుకొని వెళ్లాం.అయినా ఫలితం లేదు. 

- జి. విజయలక్ష్మి, బీవీ నగర్‌



కంపెనీ బాగోగులను తెలుసుకోవాలి 


ఏదైనా చిట్‌ కంపెనీలో చేరేవారు ఆ చిట్‌ కంపెనీ గురించి ముందుగా తెలుసుకోవాలి. అప్పుడే చీటీలో చేరాలి. ఏమైనా మోసాలు జరిగితే ఆ కంపెనీల మీద చర్యలు తీసుకొంటాం. మోసపోయిన వారు ఎవరైనా తమకు పిర్యాదు చేయవచ్చు.

-భాస్కర్‌రావు, చిట్‌ రిజిసా్ట్రర్‌






Updated Date - 2021-06-14T04:46:57+05:30 IST