చీరాల వైసీపీలో.. వర్గపోరు

ABN , First Publish Date - 2022-07-10T05:12:25+05:30 IST

చీరాల వైసీపీలో వర్గపోరు పతాక స్థాయికి చేరుకుంది. బలనిరూపణకు ఆ పార్టీ నేతలు తెగబడ్డారు. అందుకు శనివారం వైసీపీ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలకు సంబంధించిన పార్టీ శ్రేణుల తరలింపు వేదికైంది.

చీరాల వైసీపీలో.. వర్గపోరు

మాజీ ఎమ్మెల్యే ఆమంచిని, అతని అనుచరులను అడ్డుకున్న పోలీసులు

పట్టణంలో ర్యాలీని ప్రారంభించిన ఇన్‌చార్జి వెంకటేష్‌


చీరాల, జూన్‌9: చీరాల వైసీపీలో వర్గపోరు పతాక స్థాయికి చేరుకుంది. బలనిరూపణకు ఆ పార్టీ నేతలు తెగబడ్డారు. అందుకు శనివారం వైసీపీ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలకు సంబంధించిన పార్టీ శ్రేణుల తరలింపు వేదికైంది. పట్టణంలో ప్లీనరీకి వెళ్లే వాహనాలను ఆపార్టీ కార్యక్రమ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ కరణం వెంకటేష్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, డాక్టర్‌ వరికూటి అమృతపాణి తదితరులు జెండా ఊపి సాగనంపారు. బస్సులలో పార్టీ శ్రేణులు అధికసంఖ్యలో తరలివెళ్లారు.  

ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ తన అనుచరులు, పార్టీ శ్రేణులతో పందిళ్లపల్లి నుంచి ర్యాలీగా చీరాలకు బయలుదేరగా వారిని నల్లగాంధీబొమ్మ సెంటర్లో పోలీసులు  అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులకు, ఆమంచి వర్గీయులకు మధ్య తోపులాట జరిగింది. గడియార స్తంభం సెంటర్లోని వైఎస్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించి తాము ప్లీనరీ సమావేశాలకు వెళతామని, తామంతా శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పినా పోలీసులు అనుమతించలేదు. చివరకు సంపత్‌నగర్‌కు చేరుకొని 216 జాతీయరహదారి మీదుగా తోటపారిపాలెం, బాపట్ల, పొన్నూరు మీదుగా ప్లీనరీకి వెళ్లారు. ఈక్రమంలో నల్లగాంధీబొమ్మ సెంటర్లో సుమారు గంటపాటు ట్రాఫిక్‌ స్తంభించింది. ఇరువర్గాలను ఒకచోటకు చేరకుండా తాము ఈ విధమైన చర్యలు చేపట్టాల్సి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు.


ర్యాలీలో స్వల్ప అపశ్రుతి

మాజీ ఎమ్మెల్యే ఆమంచి 216 జాతీయరహదారిలో పార్టీ శ్రేణులు, తన అభిమానులతో కలసి ర్యాలీగా వెళుతున్న సమయంలో బాపట్ల మండలం అప్పికట్ల దాటిన ఆమంచి నడుపుతున్న బైక్‌ను వెనుకనుంచి వస్తున్న బైక్‌ అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో  బైక్‌ నడుపుతున్న ఆమంచికి, వెనుక కూర్చున్న మార్పు గ్రెగోరికి స్వల్ప గాయాలయ్యాయి. పొన్నూరులో ప్రాథమిక చికిత్స అనంతరం వారు ప్లీనరీకి వెళ్లారు.

  

నివురుగప్పిన నిప్పులా..

చీరాల నియోజకవర్గ వైసీపీలో ఇరువర్గాల మధ్యవర్గపోరు నివురుగప్పిన నిప్పులా ఉంది. అవి ఎప్పుడు ఎగసిపడే మంటలుగా మారతాయోనని ఆ పార్టీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. పార్టీలో ఉండేదెవరు, పక్క చూపులు చూస్తున్నదెవరు అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. వైసీపీ రాష్ట్ర ప్లీనరీకి జనసమీకరణలో అటు కరణం, ఇటు ఆమంచి ఎవరిస్థాయిలో వారు భారీగా జనాల్ని తరలించారు. ఇదిలాఉంటే ఇటు కరణం, అటు ఆమంచి వర్గాలు ఒకరికి ఒకరు ఎదురుపడకుండా చూసేందుకు పోలీసులకు శక్తికి మించిన పనైంది. ఎట్టకేలకు ఒకరికి, ఒకరు ఎదురుపడకుండా చేయగలిగారు. 


కొంతకాలం మౌనంగా ఉన్న ఆమంచి

 నియోజకవర్గంలో ఇరు వర్గాల మధ్య సఖ్యతలేదు. ఎప్పుడు ఉప్పూ, నిప్పూ అన్నట్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి కరణం వెంకటేష్‌ను ఇన్‌చార్జిగా ప్రకటించారు. ఆ క్రమంలో ఆమంచి కొంతకాలం నుంచి మౌనంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ చీరాల నియోజకవర్గ, బాపట్ల జిల్లా ప్లీనరీ సమావేశాలకు కూడా ఆయన హాజరుకాలేదు. అయితే కొన్ని రోజుల క్రితం విజయసాయిరెడ్డి తదితరులను కలసివచ్చిన తరువాత మరలా క్రియాశీలకంగా తన అనుచరులను అప్రమత్తం చేశారు. రాష్ట్ర ప్లీనరీకి భారీగా జనసమీకరణకు పావులు కదిపారు. కరణం వర్గీయులు కూడా అదే రీతితో జనసమీకరణలో పోటీపడ్డారు. 


ఎవరికి వారే..

గడప, గడపకు నియోజకవర్గ ఇన్‌చార్జి, ప్లీనరీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా కరణం వెంకటేష్‌ పేరును పార్టీపరంగా ప్రకటించారు. అంతకుముందు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఆమంచిని ఆ స్థానం నుంచి తప్పించారా, వెంకటేష్‌ను నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా ప్రకటించారా అనే విషయంలో పార్టీ శ్రేణుల్లోనే స్పష్టత లేదు.  చీరాలలో పార్టీ కార్యాలయం ఏర్పాటుచేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్న తాము నిజమైన పార్టీ వారసులమని,  ఆమంచి వర్గీయులు చెప్తున్నారు. అయితే పార్టీ కార్యాలయం ప్రామాణికం కాదని ఒకటికి పలుమార్లు పార్టీపరంగా గుర్తింపు పొందామని కరణం అనుచరులు చెప్పుకుంటున్నారు. అయితే ఎవరూ పార్టీ గడప దాటకుంటా ఎవరి హద్దుల్లో వారు ఉండేందుకు పార్టీ అధిష్ఠానం ఉచ్చులు బిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  మూడో వర్గంగా వేరు కుంపటితో ఉన్న ఎమ్మెల్సీ పోతుల సునీతకు పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి పదవి ఇచ్చి సైలెంట్‌ చేశారు. 


పట్టు నిరూపించుకునేందుకు పోటీ..

 రాష్ట్ర ప్లీనరీలో పరిపాలన- పారదర్శకత అనే అంశంపై ఆమంచి మాట్లాడేందుకు సమయమిచ్చారు. ఈ క్రమంలో పార్టీ అధిష్ఠానం ఎవరికి ప్రాఽధాన్యం ఇచ్చిందనే విషయాన్ని పక్కన పెడితే స్థానికంగా మాత్రం ఎవరికి వారు తమకే అధిష్ఠానంలో పట్టు ఉందని చెప్పుకునేందుకు ప్రధానంగా ఆమంచి, కరణం వర్గీయులు పోటీ పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకే సీటు ఖాయమని ఎవరికి వారు వారి అనుయాయులకు చెప్పుకుంటున్నారు.  చివరకు చీరాల సీటు బీసీలకు కేటాయించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఆపార్టీ వర్గాల్లోనే పైస్థాయిలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అప్పుడు ఈ వర్గాలలో ఉన్నవారు అందరూ వైసీపీ వైపే ఉంటారా లేక  టీడీపీ వైపు దృష్టి సారిస్తారో వేచి చూడాలి. ఈ కోణంలోనూ పార్టీ అధిష్ఠానం రహస్యంగా సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా ఓ సర్వే టీం గత పదిహేను రోజులుగా చీరాల నియోజకవర్గంలో పనిచేస్తున్నట్లు చెప్తున్నారు.  


 

Updated Date - 2022-07-10T05:12:25+05:30 IST