చింతలపూడిలో అన్నీ సమస్యలే..

ABN , First Publish Date - 2022-03-10T05:36:09+05:30 IST

చింతలపూడి పంచాయతీ నుంచి నగర పంచాయతీ స్థాయికి ఎదిగింది.

చింతలపూడిలో అన్నీ సమస్యలే..

చింతలపూడి, మార్చి 9: చింతలపూడి పంచాయతీ నుంచి నగర పంచాయతీ స్థాయికి ఎదిగింది. పట్టణ హోదాతో చింతలపురంగానే ఉంది. స్థాయి పెరిగి ఏడాది దాటినా పట్టణంలో అభివృద్ధి జాడే లేదు. అభివృద్ధి చేస్తామని బీరాలు పలికిన నాయకులకు ప్రజా సమస్యలు కనిపించవా, గుర్తుకు రావా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కనీస సౌకర్యాలైన డ్రెయినేజి, మంచినీరు, వీధిలైట్లు, రోడ్లు, విద్య, వైద్యం, రవాణా పట్టణంలో ప్రధాన సమస్యలు. కొన్ని ప్రాంతాల్లో మంచినీటిని రోజువిడిచి రోజు అందిస్తున్నారు. 20 వార్డులు ఉన్నప్పటికీ మెయిన్‌ రోడ్లు మినహా ఎక్కడా శాశ్వత డ్రెయినేజీలు లేవు. మారుతీనగర్‌లో డ్రెయినేజీ సమస్యలపై స్పందనలో పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. వర్షాకాలం మురుగునీటితో దోమల బెడద. సామాజిక ఆసుపత్రిలో 20 పడకలున్నా వైద్య సౌకర్యాలు సక్రమంగాలేవు. ఆస్పత్రికి గర్బిణులు ప్రసవానికి వస్తే ఏలూరు లేదా తెలంగాణలోని సత్తుపల్లి తీసుకువెళ్ళండంటూ ప్రైవేటు అంబులెన్సులను పురమాయిస్తున్నారు. ఆసుపత్రి బయటే ప్రైవేటు అంబులెన్సులు సిద్ధంగా ఉంటాయి. వంద పడల ఆసుపత్రి నిర్మాణం ఆదిలోనే ఆగింది. కోటి రూపాయలతో సాయిబాబా గుడి నుంచి బోయగూడెం వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌ పదేళ్లలో ఏ ఒక్క రోజు వెలిగిన దాఖలాలులేవు. సరికదా ఆ స్తంభాలకు ఉన్న దీపాలను తొలగించారు. కొన్ని స్తంభాలు ప్రమాదాలకు గురికావడంతో తీసివేశారు. రాత్రివేళ చీకట్లోనే ప్రయాణించాలి. చింతలపూడి కేంద్రంగా బాలయోగి గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాల పదేళ్లుగా మార్కెట్‌ యార్డు గోడౌన్లలో తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాల కోసం పదేళ్ళుగా భవనాలు నిర్మాణంలోనే ఆగిపోయి ఉన్నాయి. 


రవాణా సౌకర్యం లేదు..

పేరుకు నియోజకవర్గ కేంద్రం. ఇప్పుడు పట్టణ హోదా.. కానీ ఇక్కడి నుంచి విజయవాడకు ఒక్క బస్సు సర్వీసు కూడా లేదు. ప్రతీ ఊరి నుంచి హైదరాబాదుకు మాత్రం ఐదారు సర్వీసు లు నడుస్తున్నాయి. నియోజకవర్గంలో జంగారెడ్డిగూడెం బస్సు డిపో ఉన్నప్పటికీ విజయవా డకు ఒక్క బస్సులేకపోవడంపై ఎందుకీ వివక్ష అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మండ లంలోని గ్రామాలకు బస్సు సౌకర్యంలేదు. ఇక రోడ్ల పరిస్థితి అధ్వాన్నం. నగర పంచాయతీలో దళితవాడలు ఎక్కువ. కొవ్వూరుగూడెం, సుప్రియన్‌పేట, బోయగూడెం, పాత చింతలపూడి, నందమూరి విద్యానగర్‌ కాలనీ, గణేష్‌నగర్‌, ఆంథోని నగర్‌, భట్టువారిగూడెం, ఎస్‌బిఐ నగర్‌, చార్లెస్‌నగర్‌, మారుతీనగర్‌, ఆర్‌కె.నగర్‌, గాంధీనగర్‌, వెంకట్రామాబాగ్‌, మోడల్‌ కాలనీ, ఎరుకులపేట, వెలమపేట, ఇవికాక పలు పేటలు కూడా ఉన్నాయి. వీటిలో అవసరమైన చోట్ల కనీస రోడ్లు లేవు. అభివృద్ధి లేక స్థానికులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే వారే లేరు.


మహిళా డాక్టర్‌ లేరు.. 

ప్రభుత్వాసుపత్రిలో మహిళా డాక్టర్‌ లేక అవస్థలు తప్పడం లేదు. చుట్టు పక్కల గ్రామాల నుంచి అనేక మంది గర్భిణులను ఆసుపత్రికి తీసుకువస్తుం టే ఇతర ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తు న్నారు. పట్టణంలో అభివృద్ధి శూన్యం.

ఆర్‌వీ.సత్యనారాయణ, చింతలపూడి


ప్రతిపాదనలు చేశాం

పట్టణంలో కోటి రూపాయలతో పనులకు ప్రతిపాదనలు చేశాం. రోడ్లు, మంచినీరు, సెంట్రల్‌ లైటింగ్‌ కోసం 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రతిపాదనలు చేస్తున్నాం.

ఎన్‌.రాంబాబు, మునిసిపల్‌ కమిషనర్‌



Updated Date - 2022-03-10T05:36:09+05:30 IST