‘ఇండియన్ పోర్ట్‌పై చైనీస్ హ్యాకర్ల దాడి కొనసాగుతోంది’

ABN , First Publish Date - 2021-03-04T02:04:22+05:30 IST

చైనా ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న హ్యాకర్లు ఓ ఇండియన్

‘ఇండియన్ పోర్ట్‌పై చైనీస్ హ్యాకర్ల దాడి కొనసాగుతోంది’

న్యూఢిల్లీ : చైనా ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న హ్యాకర్లు ఓ ఇండియన్ మారిటైమ్ పోర్టుపై  ఇప్పటికీ దాడి చేస్తున్నారని అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘రికార్డెడ్ ఫ్యూచర్’ చెప్తోంది. ఇండియన్ మారిటైమ్ పోర్ట్ నెట్‌వర్క్ సిస్టమ్‌లోకి హ్యాకర్లు ప్రవేశపెట్టిన కనెక్షన్ ద్వారా కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిపింది. చైనాతో సంబంధాలు ఉన్న ‘రెడ్ఇకో’ అనే గ్రూపు ఈ దారుణానికి పాల్పడుతున్నట్లు పేర్కొంది. ‘రికార్డెడ్ ఫ్యూచర్’ సంస్థను ఉటంకిస్తూ ఓ న్యూస్ వెబ్‌సైట్ బుధవారం ఈ వివరాలను వెల్లడించింది. 


‘రికార్డెడ్ ఫ్యూచర్’ నివేదిక ప్రకారం, చైనాతో సంబంధాలు ఉన్న రెడ్ఇకో అనే హ్యాకర్ల గ్రూపు ఇండియన్ పవర్ సెక్టర్‌పై హ్యాండ్‌షేక్ (ట్రాఫిక్ ఎక్స్ఛేంజ్) ద్వారా దాడి చేసింది. రెడ్ఇకో-ఇండియన్ మారిటైమ్ పోర్ట్ మధ్య ఇంటర్నెట్ ద్వారా ట్రాఫిక్ మార్పిడి జరిగే విధంగా హ్యాకర్లు ఏర్పాట్లు చేశారు. 10 విద్యుత్తు సంస్థలపైనా, రెండు పోర్టులపైనా రెడ్ఇకో దాడి చేస్తోందని ఫిబ్రవరి 10న రికార్డెడ్ ఫ్యూచర్ మన దేశానికి తెలిపింది. 


రికార్డెడ్ ఫ్యూచర్ సీఈఓ స్టువర్ట్ సోలోమన్ ఆ న్యూస్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ, దాడి చేసేవారికి, దాడికి గురవుతున్న ఇండియన్ పోర్టుకు మధ్య యాక్టివ్ కనెక్షన్ ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. 


రికార్డెడ్ ఫ్యూచర్ ఫిబ్రవరి 28న విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారత దేశంలోని పవర్ గ్రిడ్‌ను చైనా టార్గెట్ చేసింది. గల్వాన్‌లో భారత్-చైనా సైనికుల మధ్య గత ఏడాది జూన్‌లో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన అనంతరం గత ఏడాది అక్టోబరులో ముంబైలో పవర్ బ్లాక్అవుట్ జరిగింది. ఈ రెండు సంఘటనల మధ్య సంబంధం ఉందా? అనే ప్రశ్నను ఈ నివేదిక లేవనెత్తింది. అయితే ఈ సంఘటనల మధ్య సంబంధం ఉన్నట్లు భారత దేశంలోని దర్యాప్తు సంస్థలు నిర్థరించలేదు. 


మరోవైపు సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీ సైఫర్మ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం, చైనా మద్దతుగల హ్యాకింగ్ గ్రూపు కొద్ది వారాల నుంచి మన దేశంలోని వ్యాక్సిన్ తయారీ సంస్థలైన సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలను లక్ష్యంగా చేసుకుంది. 


చైనీస్ మాల్‌వేర్ దాడి వల్ల సమాచారం అక్రమంగా బయటకు పొక్కినట్లు రికార్డెడ్ ఫ్యూచర్ నివేదిక వెల్లడించగా, అలాంటిదేమీ లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. 


బాధ్యతలేని వ్యవహార శైలి : చైనా

ఇదిలావుండగా, చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ బుధవారం మాట్లాడుతూ, సైబర్ దాడుల విషయంలో ఊహాగానాలకు విలువ లేదన్నారు. సైబర్ దాడి ఎక్కడి నుంచి ప్రారంభమైందో గుర్తించడం చాలా కష్టమని చెప్పారు. తగిన సాక్ష్యాధారాలు లేకుండా ఓ పక్షంపై ఆరోపణలు చేయడం తీవ్రమైన బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. ఇటువంటి బాధ్యతారహితమైన, దురుద్దేశాలతో కూడిన వ్యవహార శైలిని చైనా గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. 


Updated Date - 2021-03-04T02:04:22+05:30 IST