టోక్యో : జపాన్ రాజధాని టోక్యోలో ‘క్వాడ్ 2022’ (Quad 2022) సదస్సు జరుగుతున్న వేళ చైనా, రష్యా దూకుడు చర్యకు పాల్పడ్డాయి. ఇరుదేశాలకు ఫైటర్జెట్లు(FighterJets) ఉమ్మడిగా జపాన్ గగనతలానికి(Japan Airspace) సమీపం నుంచి పయనించాయి. ఈ విషయాన్ని జపాన్ రక్షణశాఖ మంత్రి నొబువో కిషీ ప్రకటించారు. ప్రాంతీయ భద్రతలో భాగంగా అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాధినేతలు చర్చలు జరుపుతున్న సమయంలో చోటుచేసుకున్న ఈ దుందుడుకు చర్యపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం నాలుగు విమానాలు జపాన్ గగనతలానికి సమీపం నుంచి ప్రయాణించాయన్నారు. అయితే రష్యా, చైనా విమానాలు జపాన్ ప్రాదేశిక గగనతలంలోకి మాత్రం ప్రవేశించలేదని స్పష్టం చేశారు. అయితే గతేడాది ఏడాది నవంబర్ నుంచి చైనా, రష్యా విమానాలు ఒకేసారి జపాన్ సమీపంలోకి రావడం ఇది 4వసారి అని జపాన్ మంత్రి వివరించారు.
అయితే సాధారణ పెట్రోలింగ్‌లో భాగంగానే చైనీస్ హెచ్-6ర బాంబర్స్, రష్యన్ టు-95ఎంఎస్ బాంబర్స్ విమానాలు ఉమ్మడిగా జపాన్ సముద్రం, ఈస్ట్ చైనా సముద్రం, వెస్ట్ పసిఫిక్ సముద్రాలపైన మంగళవారం గస్తీ నిర్వహించాయని రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకటన విడుదల చేసింది. విమానాలు అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడే ప్రయాణించాయని, ఇతర దేశాల గగనతలంలోకి ప్రవేశించలేదని ట్విటర్లో పేర్కొంది.