పెలోసీపై చైనా ఆంక్షలు

ABN , First Publish Date - 2022-08-06T06:40:07+05:30 IST

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తెవాన్‌ పర్యటనపై చైనా మరింత రగిలిపోయింది. పెలోసీ సహా ఆమె కుటుంబంపై ఆంక్షలు విధిస్తున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా అమెరికాతో రక్షణ, పర్యావరణ

పెలోసీపై చైనా ఆంక్షలు

అమెరికా నేతలు మా దేశం రావొద్దు

పెలోసీ కుటుంబ సభ్యులు అసలే వద్దు

అగ్రరాజ్యంతో ఎలాంటి చర్చలూ ఉండవు.. మండిపడిన డ్రాగన్‌


బీజింగ్‌, ఆగస్టు 5: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తెవాన్‌ పర్యటనపై చైనా మరింత రగిలిపోయింది. పెలోసీ సహా ఆమె కుటుంబంపై ఆంక్షలు విధిస్తున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా అమెరికాతో రక్షణ, పర్యావరణ మార్పులు సహా ఇతర అంశాలపై జరపవలసిన చర్చలను రద్దు చేసుకుంటున్నట్టు వెల్లడించింది. అమెరికా ప్రజాప్రతినిధులు ఎవరూ తమ దేశానికి రావొద్దని తెగేసి చెప్పింది. 82 ఏళ్ల పెలోసీ దాదాపు 25 ఏళ్ల తర్వాత మంగళవారం తైవాన్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి  శుక్రవారం పెలోసీపై వి మర్శలతో విరుచుకుపడ్డారు. పెలోసీ పర్యటనకు నిరసనగా చైనాలోని అమెరికా రాయబారి క్రిస్‌ బర్న్స్‌కు సమన్లు జారీ చేశారు. పెలోసీ, ఆమె కుటుంబంపై ఆంక్షలు విధించారు. ‘‘చైనా ఆందోళనలను, వ్యతిరేకతను ఏమాత్రం పట్టించుకోకుండా.. పెలోసీ చైనాకు చెందిన తైవాన్‌ ప్రాంతంలో పర్యటించారు. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నాం.


పెలోసీ పర్యటన చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే. పెలోసీ రెచ్చగొట్టే ధోరణికి సమాధానంగా చైనా చట్టాల మేరకు ఆమె, ఆమె కుటుంబ సభ్యులు చైనా నుంచి జరిపే రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. అదేవిధంగా రక్షణ రంగంలో సహాయ సహకారాలు, మిలిటరీ మ్యారీటైమ్‌ ఎగ్రిమెంట్‌ సహా పర్యావరణ మార్పులపై అమెరికాతో చర్చలను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, తన తైవాన్‌ పర్యటనపై చైనా వ్యవహరించిన తీరును నాన్సీ పెలోసీ తీవ్రంగా తప్పుబట్టారు. ఆశియా పర్యటనను ముగించుకుని టోక్యో చేరుకున్న ఆమె.. తైవాన్‌లో పర్యటించకుండా ఎవరూ తమను ఆపలేరని, ముఖ్యంగా అమెరికా అధికారులను ఎవరూ నిలువరించలేరంటూ మీడియాతో వ్యాఖ్యానించారు. మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ కూడా చైనా తీరును తప్పుబట్టారు. 

Updated Date - 2022-08-06T06:40:07+05:30 IST