కరోనాకు కారణం చైనానే.. హాంకాంగ్ వైరాలజిస్ట్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-07-12T05:02:30+05:30 IST

కరోనాకు కారణం ముమ్మాటికీ చైనానేనని హాంకాంగ్‌కు చెందిన వైరాలజిస్ట్ ఒకరు సంచల వ్యాఖ్యలు చేశారు. కరోనా గురించి చైనాకు...

కరోనాకు కారణం చైనానే.. హాంకాంగ్ వైరాలజిస్ట్ సంచలన వ్యాఖ్యలు

హాంకాంగ్: కరోనాకు కారణం ముమ్మాటికీ చైనానేనని హాంకాంగ్‌కు చెందిన వైరాలజిస్ట్ ఒకరు సంచల వ్యాఖ్యలు చేశారు. కరోనా గురించి చైనాకు ఎప్పుడో తెలుసని, కానీ ఆ విషయాన్ని కావాలనే దాచిపెట్టిందని ఆరోపించారు. హాంకాంగ్ నుంచి ఇటీవల అమెరికా వెళ్లిపోయిన వైరాలజిస్ట్ లీ మెంగ్ యాన్ ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇన్‌ఫ్లుయెంజా వంటి వైరస్‌లు, మహమ్మారులపై ప్రయోగాలు చేసేందుకు గానూ చైనా లాబోరేటరీలకు డబ్ల్యూహెచ్‌వో అమోదం కలదని, అలాంటప్పుడు అక్కడినుంచే ఓ మహమ్మారి ప్రపంచానికి సోకితే జవాబుదారీగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘అయితే ఈ వైరస్ నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు నేను కొన్ని ప్రయోగాలు కూడా ప్రారంభించాను. కానీ నా సీనియర్లు, పెద్ద పెద్ద నిపుణులు ఎవరూ నన్ను పట్టించుకోలేదు. ఒకవేళ నాకు కొంత చేయూత లభించిఉంటే ఎందరో ప్రాణాలను కాపాడగలిగేవాళ్లం. అంతేకాదు కోవిడ్-19పై పరిశోధనలు చేసిన తొలి శాస్త్రవేత్తల్లో నేను కూడా ఉన్నాను.


అప్పట్లో డబ్ల్యూహెచ్‌వో రిఫరెన్స్ ల్యాబ్‌లో పనిచేస్తున్నప్పుడు నా సీనియర్ డాక్టర్ లియో పూన్ నా వద్దకు వచ్చారు. 2019 డిసెంబరులో చైనా నుంచి సార్స్ వంటి మహమ్మారి బయటపడే అవకాశాలు ఉన్నాయని, అలాంటి వైరస్‌లపై అధ్యయనం చేయాలని చెప్పారు. అయితే పక్కదేశాల వాళ్లని చైనా అనుమతించలేదు. కనీసం హాంకాంగ్ నుంచి కూడా శాస్త్రవేత్తలను రానివ్వలేదు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ వైరస్‌కు సంబంధించి శాస్త్రవేత్తలు బహిరంగంగానే మాట్లాడుకోవడం ప్రారంభించారు. కానీ ఎప్పుడైతే ఈ వైరస్ ప్రపంచానికి వ్యాపించిందో అప్పటి నుంచి ఊహాన్‌లోని శాస్త్రవేత్తలు దీనిపై మాట్లాడడం మానేశారు.


ప్రభుత్వం కూడా వారిని ఎవరూ ప్రశ్నించకూడదని బెదిరించింది. అయితే ఈ వైరస్‌కు సంబంధించి తామేమీ మాట్లాడలేమని, అయితే అందరూ మాస్కులు ధరించాలని అక్కడి శాస్త్రవేత్తలు చెప్పడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆ వైరస్ ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. ఉన్నట్లుండి కేసులు భారీగా పెరిగిపోయాయి. దీంతో నాకు విషయం అర్థమైపోయింది. వెంటనే నా బ్యాగ్ సర్దుకుని, ఎవరి కంటా పడకుండా విమానం ఎక్కి అమెరికా వచ్చేశాను’ అంటూ యాన్ చెప్పుకొచ్చారు. ఒకవేళ తనను చైనా పట్టుకుని ఉంటే ఇప్పటికల్లా మాయమైపోయిన శాస్త్రవేత్తల జాబితాలో చేరిపోయేదానినని, లేదా జైల్లో అయినా వేసేవారని పేర్కొన్నారు.


ఇప్పుడు తాను పారిపోయి అమెరికా వచ్చేయడంతో చైనా, హాంగ్‌కాంగ్‌లలో నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, తాను కరోనాపై నోరు తెరవకుండా ఉండేందుకు గానూ సైబర్ అటాక్‌కు కూడా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే హాంకాంగ్‌లోని తన ఇంటిని ధ్వంసం చేశారని, తన తల్లిదండ్రులపైనా బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. తన ప్రాణాలకు ఇప్పటికీ ముప్పుందని, బహుశా తానింక ఎప్పటికీ తన మాతృభూమికి వెళ్లలేనేమోనని ఆవేదన వ్యక్తం చేశారు.


ఇదిలా ఉంటే హాంకాంగ్ యూనివర్సిటీ ఆమెకు సంబంధించిన వివరాలను కూడా తన అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించింది. తాను సెలవు కోసం అనుమతి తీసుకున్నానంటూ యాన్ చెప్పినప్పటికీ యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Updated Date - 2020-07-12T05:02:30+05:30 IST