పిల్లల టీకాకు లైన్‌ క్లియర్‌

ABN , First Publish Date - 2021-12-18T07:28:01+05:30 IST

మూడేళ్లు దాటిన పిల్లల కోసం మనదేశంలో కొవిడ్‌ టీకా అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ...

పిల్లల టీకాకు లైన్‌ క్లియర్‌

‘కోవోవ్యాక్స్‌’ అత్యవసర వినియోగానికి 

డబ్ల్యూహెచ్‌వో పచ్చజెండా

న్యూఢిల్లీ, డిసెంబరు 17 : మూడేళ్లు దాటిన పిల్లల కోసం మనదేశంలో కొవిడ్‌ టీకా అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేయనున్న ‘కోవోవ్యాక్స్‌’ (ఎన్‌వీఎక్స్‌ - కోవ్‌2373) టీకాను అత్యవసర ప్రాతిపదికన వినియోగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) శుక్రవారం అనుమతులు మంజూరు చేసింది. దీంతో ఆ సంస్థ అత్యవసర వినియోగ జాబితాలోని కొవిడ్‌ టీకాల సంఖ్య 9కి పెరిగింది. ఈ కీలక నిర్ణయాన్ని అనుసరిస్తూ.. త్వరలోనే డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) కూడా కోవోవ్యాక్స్‌కు పచ్చజెండా ఊపే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే వచ్చే ఏడాది మొదటి మూడు నెలల్లోగా భారత్‌లో పిల్లలకు కొవిడ్‌ టీకా అందుబాటులోకి రావడం ఖాయమనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇక డబ్ల్యూహెచ్‌వో నిర్ణయంపై సీరం సీఈవో అదర్‌ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు. ‘‘కొవిడ్‌పై భారత్‌ జరుపుతున్న పోరులో ఇది మరో మైలురాయి. ఈ టీకా భద్రత, ప్రభావశీలత భేష్‌’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. 


ఎవరు అభివృద్ధి చేశారు ? 

కోవోవ్యాక్స్‌ టీకాను భారత ప్రభుత్వం, బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌లు సంయుక్త వ్యవస్థాపకులుగా ఉన్న ‘కొయెలిషన్‌ ఫర్‌ ఎపిడెమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌’ సంస్థతో కలిసి అమెరికా ఫార్మా కంపెనీ ‘నోవావ్యాక్స్‌’ అభివృద్ధి చేసింది. భారత్‌ సహా పేద, మధ్య ఆదాయ దేశాల్లో టీకా ట్రయల్స్‌, తయారీ, విక్రయ హక్కుల లైసెన్సింగ్‌ను మన దేశానికి చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌కు నోవావ్యాక్స్‌ కేటాయించింది. 2020 జూలైలో నోవావ్యాక్స్‌ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. సీరం ఇన్‌స్టిట్యూట్‌ తమ ప్లాంట్‌లో 200 కోట్ల కోవోవ్యాక్స్‌ టీకా డోసులను ఉత్పత్తి చేయనుంది. 


ప్రయోగ పరీక్షల పురోగతి.. 

భారత్‌లో ‘కోవోవ్యాక్స్‌’తో పిల్లలపై ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు తొలిసారిగా 2021 జూలైలో డీసీజీఐ నుంచి సీరం ఇన్‌స్టిట్యూట్‌కు అనుమతులు వచ్చాయి. దీంతో వలంటీర్ల ఎంపిక ప్రక్రియను ఆగస్టు చివరి వారం నుంచి ఆ కంపెనీ ప్రారంభించింది. తొలుత 12-17 ఏళ్లలోపు 460 మందిపై టీకాను పరీక్షించారు. సానుకూల ఫలితాలు వచ్చాక మరోసారి డీసీజీఐ అనుమతులు తీసుకొని.. తదుపరిగా 7-11 ఏళ్లలోపు 230 మందిపై ట్రయల్స్‌ను మొదలుపెట్టారు. ఇందులో వచ్చిన ఫలితాలను డీసీజీఐ ఇంకోసారి సమీక్షించి పచ్చజెండా ఊపాక.. నవంబరు మొదటివారంలో 2 నుంచి 6 ఏళ్లలోపు 230 మంది పిల్లలపై దేశవ్యాప్తంగా 10 వైద్యకేంద్రాల్లో ‘కోవోవ్యాక్స్‌’ పరీక్షలను సీరం ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభించింది. ట్రయల్స్‌లో భాగంగా వలంటీర్లకు మొదటి డోసును ఇచ్చిన 21 రోజుల తర్వాత రెండో డోసు వేశారు. పిల్లలపై ఈ టీకా ప్రభావవంతంగా పనిచేస్తోందని ఇటీవల ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పూనావాలా వెల్లడించారు. కోవోవ్యాక్స్‌కు అత్యవసర వినియోగ అనుమతులు కోరుతూ డబ్ల్యూహెచ్‌వోకు అక్టోబరు చివరి వారంలో సమర్పించిన నివేదికలోనూ.. టీకా 90 శాతం సమర్ధంగా పనిచేస్తోందని ‘సీరం’ పేర్కొంది. 


ఈ టీకా ఏ రకం ? 

కోవోవ్యాక్స్‌ అనేది రీకాంబినంట్‌ నానో పార్టిక్‌ల్‌ వ్యాక్సిన్‌. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన టీకాలకు భిన్నమైన సాంకేతికతతో దీన్ని అభివృద్ధి చేశారు. కరోనా వైర్‌సకు ఆయువు పట్టు స్పైక్‌ ప్రొటీన్‌. మానవుడి ఊపిరితిత్తుల్లోని కణాలను హైజాక్‌ చేసేందుకు కరోనా వైరస్‌ ప్రయోగిస్తున్న అస్త్రం స్పైక్‌ ప్రొటీన్‌. దాన్ని గుర్తించి, వైర్‌సపై దాడి చేసేందుకు మానవ రోగ నిరోధక వ్యవస్థను కోవోవ్యాక్స్‌ సమాయత్తం చేస్తుంది. 

Updated Date - 2021-12-18T07:28:01+05:30 IST