పాలు కక్కేస్తే ఎలా?
ABN , First Publish Date - 2020-02-04T00:07:13+05:30 IST
డాక్టర్! మా బాబుకు మూడు వారాలు. ఎటువంటి ఇబ్బందీ లేకుండా పాలు తాగుతున్నా, రోజులో మూడు నుంచి నాలుగు సార్లు పాలు వాంతి చేసుకుంటున్నాడు. ఇది ప్రమాదకర లక్షణమా?
ప్రశ్న: డాక్టర్! మా బాబుకు మూడు వారాలు. ఎటువంటి ఇబ్బందీ లేకుండా పాలు తాగుతున్నా, రోజులో మూడు నుంచి నాలుగు సార్లు పాలు వాంతి చేసుకుంటున్నాడు. ఇది ప్రమాదకర లక్షణమా?
ఓ సోదరి, వరంగల్
జవాబు: ఆరు నెలల లోపు పిల్లలకు పాలు, పెరుగు వాంతులు అయ్యే లక్షణాన్ని ‘గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్స్’ అంటారు. ఆరు నెలల వయసు వరకూ అన్నవాహికకు, జీర్ణాశయానికి మధ్య ఉండే కండరం వదులుగా ఉండడం మూలంగా పాలు కొంత మేరకు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది పిల్లల్లో ఈ సమస్య ఏడాది వరకూ కొనసాగవచ్చు. అయితే బిడ్డ బరువు తగ్గకుండా వారానికి 150 గ్రాముల చొప్పున క్రమేపీ బరువు పెరుగుతూ ఉంటే పాలు వాంతి చేసుకుంటున్నా కంగారు పడవలసిన అవసరం లేదు.
అయితే కొందరు తల్లులు బిడ్డ ఏడ్చిన ప్రతిసారీ పాలు పట్టించేస్తూ ఉంటారు. ఇలా అవసరానికి మించి పాలు పట్టించినా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే సీసా పాలు పట్టించే పిల్లల్లో కూడా ఇలా జరుగుతుంది. కాబట్టి కారణం గమనించాలి. అలాగే పాలు తాగించిన వెంటనే బిడ్డను పడుకోబెట్టకుండా, 10 నిమిషాల పాటు భుజం మీద పడుకోబెట్టి, త్రేన్పు వచ్చేవరకూ వెన్ను తట్టాలి. ఇలా చేసినా పిల్లలు పాలు కక్కేసుకోకుండా ఉంటారు.
డాక్టర్ విజయానంద్
పిడియాట్రీషియన్ అండ్ నియోనాటాలజిస్ట్,
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్.