నాన్న ఆశయాలతో ముందుకు..

ABN , First Publish Date - 2020-07-09T12:09:50+05:30 IST

నాన్న వైఎస్సార్‌ అలుపెరగని యోధుడు.. గొప్ప వ్యక్తిత్వం కలిగిలిన రాజకీయ నాయకుడు..

నాన్న ఆశయాలతో ముందుకు..

పేదల హృదయాల్లో వైఎస్సార్‌ స్థానం పదిలం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ఇడుపులపాయ ఎస్టేట్‌లో వైఎస్సార్‌ 71వ జయంతి వేడుకలు

ఘన నివాళి అర్పించిన సీఎం జగన్‌, కుటుంబ సభ్యులు

అమ్మ రచించిన ‘నాలో.. నాతో వైఎస్‌ఆర్‌’ పుస్తకం ఆవిస్కరించిన తనయుడు 


కడప, జూలై 8(ఆంధ్రజ్యోతి): నాన్న వైఎస్సార్‌ అలుపెరగని యోధుడు.. గొప్ప వ్యక్తిత్వం కలిగిలిన రాజకీయ నాయకుడు.. విద్యావేత్త.. నిరంతరం పేదల సంక్షేమం కోసం పరితపించిన పాలకుడు.. నేడు మనమధ్య లేకపోయినా ఆయన ఆశయస్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్సార్‌ 71వ జయంతి వేడుకలను బుధవారం ఇడుపులపాయలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరయ్యేందుకు సీఎం జగన్‌ మంగళవారం సాయంత్రమే ఇడుపులపాయ చేరుకున్నారు. రాత్రి వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని అతిథి గృహంలో బస చేశారు.


బుధవారం ఉదయం 8.50 గంటలకు గెస్ట్‌ హౌస్‌ నుంచి వైఎస్‌ఆర్‌ ఘాట్‌కు చేరుకున్నారు. అమ్మ వైఎస్‌ విజయలక్ష్మి, చెల్లెలు షర్మిల, సతీమణి వైఎస్‌ భారతి, మామ డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి, కుటుంబ సభ్యులతో కలసి తండ్రి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అరగంటకుపైగా కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జయంతి వేడుకల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పి.రవీద్రనాధరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, రఘురామిరెడ్డి, సుధీర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, గోవిందరెడ్డి, వెన్నపూస గోవర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


నాలో.. నాతో వైఎస్సార్‌ పుస్తకం ఆవిష్కరణ

వైఎస్‌ విజయలక్ష్మి తన భర్త వైఎస్‌ రాజశేఖరరెడ్డితో సాగించిన ప్రయాణం, రాజకీయ ఎత్తుపళ్లాలు.. తదితర అంశాలతో స్వయంగా రచించిన ‘నాలో.. నాతో వైఎస్సార్‌’ పుస్తకాన్ని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఆ పుస్తకం పేజీలు తిరగేసి గత జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ ‘నాన్నతో అమ్మ ప్రయాణం మధుర జ్ఞాపకం. నాన్నతో కలసి సాగించిన సుదీర్ఘ ప్రయాణంలో అమ్మ ఎన్నో నేర్చుకున్నారు. భర్తగా.. పిల్లలకు తండ్రిగా.. కుటుంబ పెద్దగా.. ఎన్నో ఎత్తుపళ్లాలు చవి చూసిన రాజకీయ నాయకుడిగా.. ప్రజల సంక్షేమ పథకాలతో జననేతగా మదిమదిలో స్థానం పదిలం చేసుకున్న నాన్న వైఎస్‌ ప్రయాణం స్ఫూర్తిదాయకం’ అని సీఎం జగన్‌ అభివర్ణించారు. ఈ సందర్భంగా వైఎస్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ వైఎస్సార్‌ ఓ గొప్ప నాయకుడని, అనునిత్యం ప్రజల సంక్షేమం, రైతు అభ్యున్నతి కోసం పరితపించారని అన్నారు. రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా కుటుంబం గురించి నిరంతరం ఆలోచించిన గొప్ప వ్యక్తి అని వివరించారు.


ట్రిపుల్‌ ఐటీలో రూ.190 కోట్ల ప్రగతి పనులు

ఆర్కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీలో సుమారుగా రూ.190 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామీణ విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్య అందించే లక్ష్యంగా రూ.139.83 కోట్లతో నిర్మించిన నూతన అకడమిక్‌ కాంప్లెక్స్‌ను జగన్‌ ప్రారంభించారు. రూ.10.10 కోట్లతో నిర్మించనున్న కంప్యూటర్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. నాలుగు కంప్యూటర్‌ ల్యాబులు, రెండు లెక్చర్‌ హాల్స్‌, 616 మంది విద్యార్థులు కూర్చునే సామర్థ్యంతో ఈ-సెంటర్‌ను నిర్మించనున్నారు. రూ.40 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో 1700 మంది విద్యార్థులు ఏకకాలంలో కూర్చోవడానికి వీలుగా 6 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించే వైఎస్సార్‌ ఆడిటోరియంకు శంకుస్థాపన చేశారు. 3 మెగావాట్స్‌ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన సోలార్‌ ప్లాంట్‌ను విద్యార్థులకు అంకితం చేశారు.


వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ

ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ క్యాంపస్‌లో వైఎస్సార్‌ సర్కిల్‌లో నెలకొల్పిన దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని సీఎం జగన్‌ ఆవిస్కరించారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించిన వైఎస్సార్‌ జయంతి రోజును రైతు దినోత్సవంగా ప్రకటించినందుకు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, రాష్ట్ర రైతు సంఘం జిల్లా నాయకులు సంబటూరు ప్రసాద్‌రెడ్డి జగన్‌కు నాగలి బహుకరించి అభినందించారు. సీఎం పర్యటనలో కలెక్టర్‌ సి.హరికిరణ్‌, ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌, ఆర్జీయూకేటీ చాన్సిలర్‌ కేసీ రెడ్డి, జాయింట్‌ కలెక్టర్లు గౌతమి, సాయికాంత్‌వర్మ, శిక్షణ కలెక్టరు వికాష్‌ మర్మాట్‌, పులివెందుల ఓఎస్‌డీ అనిల్‌కుమార్‌రెడ్డి, డైరెక్టర్‌ సుధీర్‌ప్రేమ్‌చంధ్‌, జెడ్పీ సీఈవో సుధాకర్‌, డీపీవో ప్రభాకర్‌రెడ్డి, జీఎన్‌ఎస్‌ఎస్‌ ఎస్డీసీ సతీష్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.


రెండు గంటలు ముందే విజయవాడకు

సీఎం జగన్‌ జిల్లా పర్యటన షెడ్యూలు కంటే రెండు గంటలు ముందే విజయవాడకు బయలుదేరారు. ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌కు  చేరుకొని తండ్రి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. 10.00 గంటల్లోపు ట్రిపుల్‌ ఐటీ కళాశాలలో కార్యక్రమాలు ముగించుకొని 10.15 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో కడప విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరారు. 


సీఎం పర్యటనలో కనిపించని డిప్యూటీ సీఎం

సీఎం జగన్‌ జిల్లా పర్యటనకు వస్తే సహజంగానే జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఆయన కార్యక్రమాల్లో పాల్గొనడానికి పోటీ పడతారు. జిల్లాకు చెందిన మంత్రులు హాజరై స్వాగతం పలకడం ఆనవాయితి. అయితే.. జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా బుధవారం సీఎం పర్యటనలో.. ఇడుపులపాయలో జరిగిన దివగంత నేత వైఎస్సార్‌ జయంతి వేడుకల్లో కనిపించలేదు. జిల్లాలో ఉండి సీఎం పర్యటనకు గైర్హాజరు కావడంపై సోషల్‌ మీడియా వేదికగా పలువురు పలు రకాలుగా చర్చించుకోవడం కొసమెరుపు.

Updated Date - 2020-07-09T12:09:50+05:30 IST