For the seat of CM: కాంగ్రెస్‏లో అప్పుడే కుమ్ములాటలు

ABN , First Publish Date - 2022-07-24T18:41:21+05:30 IST

శాసనసభ ఎన్నికలకు ఇంకా పది నెలల గడువు ఉండగానే రాష్ట్ర కాంగ్రెస్(Congress)లో నేతల మధ్య సీఎం పీఠం కోసం కుమ్ములాటలు

For the seat of CM: కాంగ్రెస్‏లో అప్పుడే కుమ్ములాటలు

- సిద్దు, డీకే వర్గాల మధ్య ఆధిపత్య పోరు 

- అధిష్టానానికి తలనొప్పిగా మారిన వైనం 

- వివాదానికి పెద్దలే తెరదించాలి: ఖర్గే


బెంగళూరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికలకు ఇంకా పది నెలల గడువు ఉండగానే రాష్ట్ర కాంగ్రెస్(Congress)లో నేతల మధ్య సీఎం పీఠం కోసం కుమ్ములాటలు పతాకస్థాయికి చేరాయి. కాంగ్రెస్‌ పార్టీలో ఆధిపత్యపోరును నియంత్రించేందుకు గతంలో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చొరవ తీసుకుని శాంతింపచేశారు. అయితే పరిస్థితి మళ్లీ మొదటికి రావడంతో అధిష్టానం పెద్దలకు తలనొప్పిగా మారింది. రాష్ట్ర కాంగ్రెస్‏ను ముందుండి నడిపిస్తూ 2023 శాసనసభ ఎన్నికల్లో గెలుపు ఆశలను రేకెత్తించిన డీకే శివకుమార్‌(Shivakumar)ను కాదనలేక, బలహీనవర్గాలు, మైనార్టీలు, దళితులలో గట్టిపట్టు ఉన్న ప్రతిపక్షనేత సిద్దరామయ్యకు సర్దిచెప్పలేక అధిష్టానం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని, అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదంటూ వెలువడ్డ పలు సమీక్షల అనంతరం సీఎం(Cm) కుర్చీ కుమ్ములాట ప్రారంభమైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 


అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌ : ఖర్గే 

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే ముఖ్యమంత్రి అయిన సందర్భాలు చాలా తక్కువ. కాంగ్రెస్‏లో ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో అధిష్టానం పెద్దలే నిర్ణయించడం ఆనవాయితీగా వస్తోంది. రాజ్యసభ(Rajyasabha)లో కాంగ్రెస్‌ ప్రతిపక్షనేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. శనివారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందు రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెద్దాం. ఆపై ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుందని నేతలకు ఆయన స్పష్టం చేశారు. అధిష్టానం పెద్దలు తక్షణం జోక్యం చేసుకుని ఈ తాజా వివాదానికి తెర దింపాలని పలువురు కాంగ్రెస్‌ ద్వితీయ శ్రేణి నేతలు కూడా అభిప్రాయపడుతున్నారని ఖర్గే(Kharge) వెల్లడించారు. అధిష్టానం దృష్టికి ఈ అంశాలన్నీ తీసుకెళతానన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్ని దీన్ని ఓట్లుగా మలచుకుని అధికారంలోకి రావాలంటే నేతలంతా ఏకతాటిపై నడిచేలా అధిష్టానం తగు ప్రయత్నాలు చేస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 


వివాదానికి డీకేనే కారకులా..? 

ముఖ్యమంత్రి పదవికి సంబంధించి కొద్దిరోజుల క్రితం వరకు ఎలాంటి సమస్య లేదని, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ చేసిన వ్యాఖ్యలతోనే వివాదం ముసురుకుందని పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎస్‌ఎం కృష్ణ తర్వాత ఒక్కలిగ కులస్తులకు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే అదృష్టం కాంగ్రెస్‏కు రాలేదని, ఈసారి ఒక్కలిగ కులస్తులంతా ఏకతాటిపైకి వచ్చి గెలిపిస్తే సీఎం అవుతానని డీకే శివకుమార్‌ ఇటీవల ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి స్థానం కాదనుకునేందుకు తానేమి సన్యాసిని కానని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల తర్వాతే ముఖ్యమంత్రి పదవి విషయంలో నేతలంతా నోరు విప్పడం ప్రారంభించారని, తాము కూడా రేసులో ఉన్నామన్న సంకేతాలు పంపుతున్నారని కాంగ్రెస్‌ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు ముందే ఇలాంటి వివాదాలు శృతి మించితే పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తాయని వీరు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వాదనను డీకే శివకుమార్‌ వర్గీయులు మాత్రం ఇది నిజం కాదని వాదిస్తున్నారు. ప్రతిపక్షనేత సిద్దరామయ్య మద్దతుదారులు ఆయన 75వ పుట్టినరోజు సందర్భంగా సిద్దరామోత్సవకు సన్నాహాలు చేస్తుండడం వల్లే అసలు వివాదం ప్రారంభమైందని చెబుతున్నారు. కాంగ్రెస్(Congress)లో వ్యక్తి పూజ తగదని, నేతలంతా సమష్టిగా కలసికట్టుగా కృషి చేస్తేనే అధికార ఫలాలు అందుకోగలమని, ప్రజల ఆకాంక్షలను పూర్తి చేయగలమని వాదిస్తోంది. తమ నేత డీకే శివకుమార్‌ కూడా ఇదే వాదన వినిపించారని, ఇందులో తప్పేంటని డీకే వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. కాగా ముఖ్యమంత్రి పదవి కోసం కులాలను రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసమని బెంగళూరు కాంగ్రెస్‌(Congress) ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ వ్యాఖ్యానించారు. దీనిపై కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌(Shivakumar) కూడా తీవ్రంగానే స్పందించారు. ఇప్పుడు ఏకంగా జమీర్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ముఖ్యమంత్రి(Chief Minister) పీఠంపై కాంగ్రెస్‏లో రాజుకుంటున్న వివాదానికి తెరదించాలంటే డీకే, సిద్దూ వర్గీయుల మధ్య రాజీ కుదర్చడం మంచిదని లేనట్టయితే అధికారానికి ఆమడదూరంలో ఉండిపోతామని తటస్థనేతలు అధిష్టానం పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ జాతీయస్థాయిలో రాణించాలంటే 2023 ఎన్నికల్లో కర్ణాటకలో గెలిచి నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వీరు పేర్కొంటున్నారు. 



Updated Date - 2022-07-24T18:41:21+05:30 IST