Chidambaram వివాదం తేలేనా ?

ABN , First Publish Date - 2022-06-23T13:14:48+05:30 IST

కడలూరు జిల్లా చిదంబరంలోని నటరాజస్వామివారి ఆలయ వివాదంపై దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అభిప్రాయసేకరణ పూర్తయింది. మొత్తం

Chidambaram వివాదం తేలేనా ?

                   -  ఆలయం వద్ద అభిప్రాయ సేకరణ పూర్తి


చెన్నై, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): కడలూరు జిల్లా చిదంబరంలోని నటరాజస్వామివారి ఆలయ వివాదంపై దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అభిప్రాయసేకరణ పూర్తయింది. మొత్తం 6,628 మంది స్థానికులు, భక్తులు, ప్రముఖుల నుంచి అభిప్రాయాలు వచ్చినట్లు దేవాదాయశాఖ ప్రకటించింది. సుప్రసిద్ధ శైవాలయమైన నటరాజస్వామివారి ఆలయ పాలన వ్యవహారాలను దీక్షితార్లు పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల కాలంలో దీక్షితార్లు ఆ ఆలయ వ్యవహరాలను సక్రమంగా నిర్వహించడం లేదని, భక్తుల నుంచి అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆ ఆలయ వ్యవహారాలను పరిశీలించేందుకు వెళ్ళిన దేవాదాయ శాఖ కమిటీ కి కూడా చుక్కెదురైంది. ఆలయ జమాఖర్చులకు సంబంధించిన రికార్డుల ను దీక్షితార్లు సమర్పించలేదు. ఈ నేపథ్యంలో ఆ ఆలయాన్ని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలా? లేక ఎప్పటివలెనే దీక్షితార్లే నిర్వహించాలా? అనే అంశంపై దేవాదాయ శాఖ అభిప్రాయ సేకరణ జరిపింది. ఆ మేరకు రెండు రోజులుగా ప్రజలు, భక్తులు, సంఘసేవకులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, తమిళ ఆధ్యాత్మిక సంస్థల నిర్వాహకులు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా అందజేశారు.. అధికారులు ఈ అభిప్రాయాలపై ఓ నివేదిక రూపొందించిన అనంతరం దేవాదాయ శాఖ కమిషనర్‌కు సమర్పించనున్నారు.


ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలి...

చిదంబరం ఆలయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవాలని పిచ్చావరం జమీందార్‌, చోళచక్రవర్తుల వంశీయుడైన పాళయంగార్‌ రాజా సూరప్పచోళన్‌ ఆ శాఖకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... వందేళ్ల క్రితం చిదంబరం ఆలయం పిచ్చావరం జమీందార్ల ఏలుబడిలో ఉండేదని, జమీన పాళయంగార్ల నుంచి ఆ ఆలయాన్ని దీక్షితార్లు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఆ ఆలయంలో చోళ చక్రవర్తుల వంశీకులైన తమకు పంచాక్షర పద్ధతి ప్రకారం ఆశీనులు చేసి పట్టాభిషేకం, కిరీట ధారణ చేయడం ఆనవాయితీ ఉందని, ఆ ఆలయం తమకే చెందుతుందనటానికి ఇంతకు మించిన ఆధారం ఏముందని ప్రశ్నించారు. ప్రస్తుతం దీక్షితార్లు ఆలయాన్ని సక్రమంగా నిర్వహించడం లేదని, భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని తెలిపారు. 


కనకసభపై దేవారం ఆలాపన...

చిదంబరం ఆలయంలోని కనకసభపై నిలిచి పరమశివుడిని కీర్తించే తిరువాచగం, దేవారం కీర్తనలను భక్తులు ఆలాపించేందుకు అనుమతించాలంటూ రాష్ట్ర హిందూ దేవాదాయ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీక్షితార్లు ఈ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోకూడదని, భక్తులు కనకసభపై నిలిచి కీర్తనలు పాడేందుకు అనుమతించాలని ఆ ఉత్తర్వులో పేర్కొంది. ఆ మేరకు శైవాగమ పండితులు, కొంతమంది భక్తులు కనకసభపై నిలిచి తిరువాచగం, దేవారం కీర్తనలను ఆలపించారు.

Updated Date - 2022-06-23T13:14:48+05:30 IST