రక్తతర్పణం

ABN , First Publish Date - 2022-08-10T06:48:40+05:30 IST

మొహర్రం దుఃఖదినాలను పురస్కరించుకుని కర్బలా అమరువీరులకు నివాళులర్పిస్తూ బందరు కోనేరుసెంటరులో మంగళవారం భారీగా చెస్ట్‌ బీటింగ్‌ జరిపారు.

రక్తతర్పణం

  కర్బలా అమరులకు అశ్రునివాళి

  కోనేరుసెంటరులో వేలాది మంది ముస్లింల చెస్ట్‌ బీటింగ్‌

ఇస్లాం పరిరక్షణ కోసం కర్బలా మైదానంలో అమరులైన మహమ్మద్‌ ప్రవక్త మనుమడు ఇమాం హుస్సేన్‌, 72 మంది అమరులకు అశ్రుతర్పణం గావిస్తూ జిల్లా కేంద్రం మచిలీపట్నంలో వేలాది మంది ముస్లింలు మాతం జరిపారు. ఇమాం హుస్సేన్‌ త్యాగాన్ని స్మరించుకుంటూ, రోదిస్తూ చెస్ట్‌ బీటింగ్‌ చేస్తూ రక్తతర్పణం గావించారు. పమిడిముక్కల మండలం అలీనఖీపాలెం, తోట్లవల్లూరు మండలం ఐలూరులలోనూ అమరులను స్మరిస్తూ చెస్ట్‌ బీటింగ్‌ జరిపారు. 

మచిలీపట్నం టౌన్‌, ఆగస్టు 9 : మొహర్రం  దుఃఖదినాలను పురస్కరించుకుని కర్బలా అమరువీరులకు నివాళులర్పిస్తూ బందరు కోనేరుసెంటరులో మంగళవారం భారీగా చెస్ట్‌ బీటింగ్‌ జరిపారు. బార్‌ ఇమాం పంజా, చింతచెట్టు సెంటర్‌, ఇనకుదురుపేట నుంచి వేలాది ముస్లింలు చిన్న పార్టీ, పెద్ద పార్టీ, సజ్జాది, గిరోహ్‌ హుస్సేని పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీగా చెస్ట్‌ బీటింగ్‌లో  పాల్గొన్నారు.  చిన్న పార్టీ ప్రతినిధి మీర్‌ జాఫర్‌ ఆలీ ర్యాలీకి నాయకత్వం వహించారు.  కోనేరుసెంటర్‌లో మత పెద్ద సయ్యద్‌ అనీస్‌ అబేది మొహర్రం సందేశం ఇచ్చారు.  ఇమాం హుస్సేన్‌ ప్రాణ త్యాగంతోనే ఇస్లాం మత పరిరక్షణ జరిగిందన్నారు.  గిరోహ్‌ - ఎ - మిరన్‌ షా (పెద్ద పార్టీ) ఆధ్వర్యంలో  పీర్లతో తరలి వచ్చారు. అబుజాన్‌, హసన్‌ అబ్బాస్‌ నేతృత్వం వహించారు.  చిన్న పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు కూడా  చెస్ట్‌ బీటింగ్‌లో పాల్గొనడం విశేషం. పసిపిల్లలకు సంప్రదాయ సిద్ధంగా తలపై గాట్లు  పెట్టి మత పెద్దలు కట్లు కట్టారు.  డీఎస్పీ మాసూంబాషా ఆధ్వర్యంలో సీఐ కొండయ్య, శ్రీధర్‌కుమార్‌ నేతృత్వంలో బందోబస్తు నిర్వహించారు.  జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.  టీడీపీ, వైసీపీ నా యకులు మజ్జిగ, టీ పంపిణీ చేశారు.  మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్వయంగా పాల్గొని ముస్లిం భక్తులకు సపర్యలు చేశారు. మునిసిపల్‌ మాజీ చైర్మన్లు మోటమర్రి బాబా ప్రసాద్‌, షేక్‌ సిలార్‌దాదా, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అబ్దుల్‌ కలాం, సూదాబత్తుల బసవయ్య, అబ్దుల్‌ ఫరీద్‌, శ్రవణం శివ సేవలందించారు. 

అలీనఖీపాలెంలో  

అలీనఖీపాలెం (పమిడిముక్కల) : మొహర్రం పదో రోజు అషూర సందర్భంగా  కర్మలా మైదానంలో అమరులైన వీరులను స్మరిస్తూ  మాతం (చెస్ట్‌ బీటింగ్‌) జరిపారు.  యా హుస్సేన్‌, యా అబ్బాస్‌ అంటూ రోదిస్తూ అశ్రుతర్పణ గావించారు.  చిన్నారులకు  గాటు పెట్టించారు.  ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. 



Updated Date - 2022-08-10T06:48:40+05:30 IST