నగరవాసులపై మరో భారం

ABN , First Publish Date - 2022-09-15T13:05:54+05:30 IST

ఎన్నికలేవీ ఇప్పట్లో లేవన్న నిర్లక్ష్యమో! ఎన్నికలేమీ లేనందున ప్రజలు తమనేమీ చేయలేరన్న తెగింపో తెలియదుగానీ రాష్ట్ర ప్రభుత్వాధీనంలోని

నగరవాసులపై మరో భారం

- 7 శాతం తాగునీటి పన్ను పెంపు

- మెట్రోవాటర్‌ బోర్డుకు అదనంగా రూ.120 కోట్ల ఆదాయం


పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 14: ఎన్నికలేవీ ఇప్పట్లో లేవన్న నిర్లక్ష్యమో! ఎన్నికలేమీ లేనందున ప్రజలు తమనేమీ చేయలేరన్న తెగింపో తెలియదుగానీ రాష్ట్ర ప్రభుత్వాధీనంలోని సంస్థలన్నీ ఒక్కొక్కటిగా జూలు విదుల్చుతున్నాయి. మొన్నటికి మొన్న నగర కార్పొరేషన్‌ భారీగా ఆస్తి పన్ను పెంచగా, నిన్నటికి నిన్న విద్యుత్‌ బోర్డు చార్జీల మోత మోగించింది. తాజాగా చెన్నై మెట్రోవాటర్‌ బోర్డు సైతం ప్రతాపం చూపించింది. నగర వాసులకు తాగునీటి పన్ను పెంచిన చెన్నై మెట్రోవాటర్‌ బోర్డు, తొలి అర్ధవార్షిక పన్ను వసూళ్ల నుంచి ఈ పెంపు వర్తిస్తుందని ప్రకటించింది. ఈ విషయమై మెట్రోవాటర్‌ బోర్డు(Metro Water Board) అధికారులు మాట్లాడుతూ.. జీసీసీ(GCC) పరిధిలోన 7.75 లక్షల తాగునీటి కనెక్షన్లున్నాయని, పెంచిన ఆస్తి పన్నుతో లెక్కించి 7 శాతం వరకు తాగునీటి పన్నులు పెంచామన్నారు. ఉధాహరణకు, ఒకరికి ఆస్తి పన్ను రూ.1,000 నుంచి రూ.1,500లకు పెరిగితే, పెరిగిన రూ.500లకు 7 శాతం తాగునీటి పన్ను వసూలుచేయనున్నట్లు తెలిపారు. ఈ పెంపు కారణంగా వాటర్‌ బోర్డుకు ఏడాదికి రూ.120 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. పెంచిన తాగునీటి పన్ను వివరాలు వినియోగదారులకు ఎస్‌ఎస్ఎం ద్వారా పంపినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆస్తి పన్ను, నీటి పన్ను వంటివి సర్వసాధారణమే అయినా, సంస్థలన్నీ వరుసబెట్టి పన్నులు పెంచుతుండడంతో నగర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 

Updated Date - 2022-09-15T13:05:54+05:30 IST