చేనేత వెతలు

ABN , First Publish Date - 2022-05-18T06:27:33+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ మూడేళ్లలో చేనేత రంగాన్ని పక్కన పడేసింది.

చేనేత వెతలు

సొంత మగ్గాలకు పడుగులు... కార్మికులకు పనుల్లేవు

నిధుల స్వాహాపై నిలదీసిన కార్మికులు

పెడనలో చేనేత కార్మికుల ఆందోళన

అధికారుల జోక్యంతో ఆగిన నిరసనలు

వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ మూడేళ్లలో చేనేత రంగాన్ని పక్కన పడేసింది. చేనేత సహకార సంఘాలకు నామినేటెడ్‌ పద్ధతిపై ఎంపిక చేసిన అధ్యక్షులు కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు. సంఘాల్లో పనిచేసే మేనేజర్లు కార్మికులకు పని కల్పించకుండా దాగుడు మూతలు ఆడుతున్నారు. పెడనలోని శ్రీ సదాశివ లింగేశ్వర చేనేత సహకార సంఘం నిధులు దుర్వినియోగం అయినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. వాటిని రికవరీ చేస్తామని అధికారులు వెల్లడించడంతో కార్మికులు శాంతించారు. 

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : బందరులోని శ్రీ సదాశివ లింగేశ్వర చేనేతసహకార సంఘంలో 150 మంది సభ్యులుగా ఉన్నారు. సంఘం మేనేజరుగా ఉమ్మిటి ఆదివిష్ణు, సంఘం చైర్మన్‌ బూసం శ్యామలరావుల పనితీరుపై కార్మికులు భగ్గుమంటున్నారు.  ఈ సంఘం ద్వారా గత 18 నెలలుగా సంఘంలోని సభ్యులు వస్త్రాలు నేసేందుకు పడుగులు (నూలు) ఇవ్వడం లేదు. గతంలో చేసిన పనికి సంబంధించిన వేతనాలు ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారు. దీంతో గతేడాది అక్టోబరు నెలలో కార్మికులు సంఘం భవనం ఎదుట ఆందోళనకు దిగారు. అధికారులు వచ్చి విచారణ చేస్తే సంఘంలో రూ.8 లక్షల వరకు అవినీతి జరిగిందని అప్పట్లో రుజువైంది. సంఘం మేనేజరు విడతల వారీగా రూ. 6 లక్షల వరకు చెల్లించారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి తాను సొంతంగా ఏర్పాటు చేసుకున్న మగ్గాలకు పడుగులు ఇచ్చి, సంఘంలో సభ్యులకు పడుగులు ఇవ్వకుండా మేనేజరు జాప్యం చేస్తున్నారు. సోమవారం జరిగిన సంఘ సమావేశంలో సభ్యులు సంఘానికి సంబంధించిన లెక్కలు చెప్పాలని కోరారు. ‘లెక్కలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు’ అని అధ్యక్షుడు, మేనేజరు చెప్పడంతో ఈ అంశంపై వాగ్వివాదం జరిగింది. మంగళవారం సభ్యులంతా తమకు సంఘం ద్వారా పనికల్పించాలని, నిధుల దుర్వినియోగం చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సంఘం ఎదుట ధర్నాకు ఉపక్రమించారు. దీంతో చేనేత, జౌళి శాఖ ఏడీ రఘునందన్‌, ఇతర అధికారులు సంఘంలో జరిగిన అవకతవకలపై విచారణ చేశారు. గతంలో చెల్లించాల్సిన రూ.2 లక్షలు, ఈ ఏడాదిలో రూ.1.60 లక్షల నగదును మేనేజరు వాడేసుకున్నాడని తేల్చారు.  మేనేజరు ఆదివిష్టు తాను తన ఉద్యోగానికి వలంటరీ రిటైర్మెంట్‌ తీసుకుంటానని, తాను చెల్లించాల్సిన రూ.3.60 లక్షలను తన పదవీ విరమణ నిధుల నుంచి మినహాయించుకోవాలని కోరారు. 

  చేనేత కార్మికులకు పని కల్పించేనా  

 కృష్ణా జిల్లాలో 24 చేనేత సహకారసంఘాలున్నాయి. మూడు సంవత్సరాలుగా ఈ సంఘాల ద్వారా చేనేత కార్మికులకు పని ఇవ్వని స్థితి నెలకొంది. జిల్లాకు రూ.10 కోట్లకుపైగా బకాయిలు రావాలి. చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాల కొనుగోలును ప్రభుత్వం దాదాపు నిలిపివేసింది. నిల్వ ఉన్న వస్త్రాలు మార్కెటింగ్‌ కాకపోవడం, బకాయిలుపేరుకుపోవడంతో చేనేత సహకార సంఘాలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్లాడుతున్నాయి.  

మేనేజరు నుంచి నగదు వసూలు చేస్తాం 

 పెడనలోని శ్రీ సదాశివ లింగేశ్వర చేనేత సహకార సంఘంలో రూ.3.60 లక్షలు మేనేజరు ఆదివిష్ణు తన సొంత అవసరాలకు వాడుకున్నట్లుగా అంగీకరించాడు. ఆయన నుంచి ఈ నగదును వసూలు చేస్తాం. సంఘ సభ్యులకు పని కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. 

- రఘునందన్‌, ఏడీ, చేనేత జౌళిశాఖ



Updated Date - 2022-05-18T06:27:33+05:30 IST