పచ్చని పల్లెలో కెమికల్‌ ఫ్యాక్టరీనా?

ABN , First Publish Date - 2021-10-19T04:40:23+05:30 IST

పచ్చని పల్లెలో కెమికల్‌ ఫ్యాక్టరీ చిచ్చు పెట్టింది. వ్యవసాయం చేస్తామని భూములు కొన్న వ్యక్తులు కెమికల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సిద్ధమవడంతో గ్రామస్థుల గుండెల్లో రాయి పడింది. తమ ఊళ్లో రసాయన పరిశ్రమ ఏర్పాటును ఎలాగైనా అడ్డుకోవాలని గ్రామస్థులంతా ఏకమై ఆందోళనకు దిగారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం చిన్నచింతకుంట గ్రామ పరిధిలోని సర్వే నంబరు 40లో ఏడెకరాల భూమిని ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తులు కొనుగోలు చేశారు.

పచ్చని పల్లెలో కెమికల్‌ ఫ్యాక్టరీనా?
పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న గ్రామస్థులు

పంట పొలాల మధ్యలో ప్రహరీ ఎలా నిర్మిస్తారు?  

చిన్నచింతకుంటలో కంపెనీ ఏర్పాటుపై రగడ   

రసాయన పరిశ్రమ వద్దంటూ గ్రామస్థుల ఆందోళన 


నర్సాపూర్‌, అక్టోబరు 18: పచ్చని పల్లెలో కెమికల్‌ ఫ్యాక్టరీ చిచ్చు పెట్టింది. వ్యవసాయం చేస్తామని భూములు కొన్న వ్యక్తులు కెమికల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సిద్ధమవడంతో గ్రామస్థుల గుండెల్లో రాయి పడింది. తమ ఊళ్లో రసాయన పరిశ్రమ ఏర్పాటును ఎలాగైనా అడ్డుకోవాలని గ్రామస్థులంతా ఏకమై ఆందోళనకు దిగారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం చిన్నచింతకుంట గ్రామ పరిధిలోని సర్వే నంబరు 40లో ఏడెకరాల భూమిని ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తులు కొనుగోలు చేశారు. వ్యవసాయం చేస్తామని గ్రామస్థులు భావించగా ఆ స్థలంలో ఓ రసాయన ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమ ఏర్పాటుకు యజమానులు సన్నద్ధమయ్యారు. స్థలం చుట్టూ కాంపౌండ్‌వాల్‌ నిర్మాణం కోసం రెండ్రోజుల క్రితం పనులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పంచాయతీ అనుమతి లేకుండా ప్రహరీ ఎలా నిర్మిస్తారని ఆదివారం పలువురు గ్రామస్థులు పనులు చేస్తున్నవారితో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. రసాయన పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న గ్రామస్థులంతా సోమవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అనుమతులు లేకుండా ప్రహరీ నిర్మిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పంచాయతీ కార్యదర్శిని నిలదీశారు. గతంలోనే అనుమతి కోసం లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోగా పాలకవర్గం తిరస్కరించిందని, అనుమతులు లేకుండా నిర్మాణ పనులు జరుగుతున్నట్టు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని  కార్యదర్శి స్పష్టం చేశారు. అనంతరం ఆయన ప్రహరీ నిర్మాణం జరుగుతున్న స్థలాన్ని పరిశీలించారు, నిర్మాణ పనులను నిలిపివేయాలని సూపర్‌వైజర్‌కు నోటీసు అందజేశారు. మరోవైపు పరిశ్రమ ఏర్పాటు వెనుక గ్రామానికి చెందిన ముఖ్యనాయకుడి హస్తం ఉందన్న ప్రచారం జరుగుతున్నది, ఆయన అండదండలతోనే పంచాయతీ అనుమతి లేకుండానే పనులు చేపడుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 


ప్రభుత్వ భూమి ఆక్రమణ!

సర్వే నంబర్‌ 40లో ఏడెకరాలు కొనుగోలు చేసిన వ్యక్తులు పక్కనే ఉన్న అసైన్‌మెంట్‌, అటవీశాఖకు సంబంధించిన భూమిని ఆక్రమించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. భూమిని పూర్తిగా సర్వే చేయిస్తే విషయం బయటపడుతుందని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న పల్లెలో రసాయన సంబంధ పరిశ్రమను ఏర్పాటుచేస్తే తమ బతుకులు చిద్రమవుతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చని పొలాల మధ్య, నివాస ప్రాంతాలకు సమీపంలో కెమికల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు యత్నిస్తే సమీప గ్రామాల ప్రజలతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.  రాజకీయ జోక్యం కారణంగానే అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపిస్తున్నారు.

Updated Date - 2021-10-19T04:40:23+05:30 IST