వాట్సాప్‌లో వేధింపులకు ఇలా చెక్‌ పెట్టండి

ABN , First Publish Date - 2020-09-12T05:30:00+05:30 IST

ఆకతాయిల వేధింపులకు ఈ మధ్య వాట్సాప్‌ కూడా ఒక సాధనంగా మారింది. ఒక్కోసారి పూర్తిగా అపరిచితుల నుంచి వాట్సాప్‌ కాల్స్‌ వస్తుంటాయి.

వాట్సాప్‌లో వేధింపులకు ఇలా చెక్‌ పెట్టండి

ఆకతాయిల వేధింపులకు ఈ మధ్య వాట్సాప్‌ కూడా ఒక సాధనంగా మారింది. ఒక్కోసారి పూర్తిగా అపరిచితుల నుంచి వాట్సాప్‌ కాల్స్‌ వస్తుంటాయి. ప్రైవసీ సెట్టింగ్స్‌ పెట్టుకోని పక్షంలో వివిధ గ్రూపుల్లో ఉండే అపరిచితుల నుంచి కూడా పలకరింపులతో మొదలై వేధింపులకు దారితీయవచ్చు. ముఖ్యంగా ఇవి మహిళలకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. అయితే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. అదేమాదిరిగి చిన్నపాటి చిట్కాలను పాటిస్తే ఈ వేధింపుల నుంచి బైటపడొచ్చు.


అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్‌కు అస్సలు జవాబు ఇవ్వవద్దు.  నెంబరును ఒకసారి చెక్‌ చేసి, ఆ వ్యక్తి ఎవరో తెలియని పక్షంలో బ్లాక్‌ చేసేయండి. 

అధమపక్షం అపరిచితులతో మాట్లాడాల్సి వస్తే సెల్ఫీ కెమెరాపై వేలిని అదిమిపెట్టి ఉంచి మాట్లాడండి. కొంత మంది వచ్చిన ప్రతి కాల్‌ను రిసీవ్‌ చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఈ పని చేయడం ఉత్తమం.

‘+91’ తో మొదలుకాని నెంబర్ల కాల్స్‌ను ఆన్సర్‌ చేయకుండా ఉండడం ఉత్తమం(అంతర్జాతీయంగా ప్రతీ దేశానికి ఒక కోడ్‌ ఉంటుంది. ఇండియా కోడ్‌ +91). స్కామర్లు, వేధించే వ్యక్తులు ఎక్కువగా తమ నంబర్‌కు మాస్క్‌ అంటే తెలియకుండా చూసుకుంటారు. నైజీరియన్‌ ముఠాలు, స్కామర్లు చేసే ఇంటర్నేషనల్‌ కాల్స్‌ను ఈ విధంగా గుర్తు పట్టాలి. విదేశాల్లో ఉన్న మీ మిత్రుల లేదంటే బంధువుల నంబర్లు కచ్చితంగా తెలిస్తేనే రిసీవ్‌ చేసుకోవాలి.

మీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న వారికి కూడా మీ స్టేటస్‌, ప్రొఫైల్‌ పిక్చర్‌లు కనపడకుండా సెట్టింగ్స్‌ మార్చుకోవచ్చు. అవసరార్థం లేదంటే వృత్తిరీత్యా  కొన్ని నంబర్ల నుంచి మెసేజ్‌లు అందుకోవాల్సి ఉంటుంది. అంతమాత్రాన వారందరికీ మీ ఫ్రొఫైల్‌ పిక్చర్‌ లేదా స్టాటస్‌ తెలియాల్సిన అవసరం లేదు.

ఇంకో విషయం, మీ కాంటాక్ట్‌లో ఉన్న వారందరికీ కూడా మీ ఫ్రొఫైల్‌ పిక్చర్లతో పని లేదు. ఉదాహరణకు పేపర్‌ బాయ్‌, మిల్క్‌ బాయ్‌, రెగ్యులర్‌గా మిమ్మల్ని తీసుకువెళ్ళే ఆటో/కారు డ్రైవర్‌ వంటి వారి నంబర్లు మీకు అవసరమే. అంతమాత్రాన వారిని వాట్సాప్‌లో చేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా! ఈ విషయంలోనే విచక్షణకు పనిచెప్పాలి.

మీ కాంటాక్ట్‌ సభ్యులు మాత్రమే మిమ్మలను గ్రూప్‌లలో మెంబర్స్‌గా చేసేలా ప్రైవసీ సెట్టింగ్స్‌ మార్చుకోవచ్చు.  

Updated Date - 2020-09-12T05:30:00+05:30 IST