నకిలీ విత్తనాలకు చెక్‌

ABN , First Publish Date - 2022-04-26T05:15:09+05:30 IST

శ్రమను నమ్ముకుని ఆరుగాలం కష్టం చేసినా కొన్ని సందర్భాల్లో అనుకున్న దిగుబడులు రాక రైతులు పెట్టిన పెట్టుబడులు రాక, పండిన పంట అప్పులకే సరిపోతుండడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నాడు.

నకిలీ విత్తనాలకు చెక్‌
ఫర్టిలైజర్స్‌ దుకాణదారులకు యాప్‌పై అవగాహన కల్పిస్తున్న దృశ్యం

- సీడ్స్‌ విక్రయాలు ఆన్‌లైన్‌లో నమోదు

- ప్రత్యేక యాప్‌ రూపొందించిన వ్యవసాయశాఖ

- విత్తన డీలర్లు, ఫర్టిలైజర్‌ యజమానులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయాధికారులు

- ఈ వానాకాలం నుంచి అమలు


కామారెడ్డి టౌన్‌, ఏప్రిల్‌ 25: శ్రమను నమ్ముకుని ఆరుగాలం కష్టం చేసినా కొన్ని సందర్భాల్లో అనుకున్న దిగుబడులు రాక రైతులు పెట్టిన పెట్టుబడులు రాక, పండిన పంట అప్పులకే సరిపోతుండడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. వ్యవసాయం, ఇచ్చిన మాటపై నిలబడడం తప్ప మరోమనిషిని మోసం చేయడం రాని రైతన్నను కొందరు అక్రమార్కులు విత్తన రూపంలో రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం పంటల సాగులో నకిలీ విత్తనాలకు చెక్‌ పెట్టేందుకు కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అందుకు తగ్గట్టుగా ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు మండల స్థాయిలో ఫర్టిలైజర్‌ యజమానులు, విత్తనాలు డీలర్లకు ఈ యాప్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఇక మీదట విక్రయించే విత్తనాలు, వాటి రకాలు, అందుకు సంబంధించిన నిల్వలు వంటి వాటిని ఆన్‌లైన్‌లో పక్కాగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వానాకాలం నుంచే ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

నకిలీ విత్తనాల నివారణకు చర్యలు

ప్రభుత్వం విత్తనాలపై సబ్సిడీని రద్దు చేయడంతో పత్తితో పాటు కంది, వరి, కూరగాయల విత్తనాలకు రైతులు ఫర్టిలైజర్స్‌ దుకాణాలపై ఆధారపడాల్సి వస్తోంది. మార్కెట్‌లో అనేక రకాల విత్తనాలు అందుబాటులో ఉంటున్నాయి. రైతులు ఏ విత్తనాలు వేయాలో తెలియక అయోమయంలో ఉన్నా సమయంలో కొంత మంది నకిలీ విత్తనాలు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ప్రతీ సంవత్సరం పత్తితో పాటు ఇతర పంటల సాగుకు సంబంధించిన విత్తనాల్లో కొందరు నకిలీవి సాగుచేసి నష్టపోయిన ఘటనలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం విత్తన విక్రయాలపై ప్రత్యేక  దృష్టి సారించి నకిలీ విత్తనాలు నివారణ వైపు అడుగులు వేస్తోంది.

అన్నీ ఆన్‌లైన్‌లోనే..

వ్యవసాయశాఖ నుంచి లైసెన్స్‌ పొందిన ఫర్టిలైజర్స్‌ యజమానులు  తెప్పించి విక్రయించే విత్తనంతో పాటు ఆయా విత్తనాల రకాలు, దుకాణంలో ఉన్న నిల్వలు, వాటి ధర తదితర వివరాలన్నీ ఆన్‌లైన్‌లో విధిగా నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం రోజువారిగా విక్రయాలు నిల్వల నమోదు చేయడంతో అధికార యంత్రాంగం జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఏయే దుకాణాల్లో ఏయే విత్తనాలు అందుబాటులో ఉన్నాయి, ఏ రకం విత్తనాలు ఎక్కువగా విక్రయించారనే సమాచారం తెలుసుకునే వీలుంటుంది. ప్రతీ విత్తన రకం పేరు, వివరాలు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆయా మండల వ్యవసాయశాఖ అధికారులు రైతువేదికల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వివరించడంతో పాటు యాప్‌ పనితీరును వివరిస్తున్నారు.

రైతులకు అండగా నిల్వనున్న యాప్‌

ఆన్‌లైన్‌లో స్టాక్‌ వివరాలతో పాటు విత్తన రకాలు, నిల్వలు నమోదు చేయడం ద్వారా నకిలీ విత్తనాలకు చెక్‌ పెట్టినట్లు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతంలో ఏ విత్తనాలు రైతులకు విక్రయిస్తున్నారు. అవి ఏ కంపెనీవి, వాటి రకాలు తదితర వాటి గురించి పూర్తిగా సమాచారం ఉండేది కాదు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాప్‌లో డీలర్లు ఏ కంపెనీ విత్తనాలు విక్రయిస్తున్నారు. వారి వద్ద ఇంకా ఎంత నిల్వ ఉంది. లాట్‌ నెంబర్లు, ఏ రైతులకు విక్రయించారు. ఆ రైతులకు రశీదు ఇచ్చారా లేదా అనేది తెలుస్తోంది. దీంతో డీలర్ల నుంచి తీసుకున్న విత్తనం మొలకెత్తకపోతే ఈ విత్తనాలు ఎవరు విక్రయించారనేది సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. విత్తన విక్రయాలు పూర్తికాగానే అమ్మకాలను బట్టి ఏ పంట ఎక్కువగా సాగు అవుతుందనేది అంచనా వేయడానికి వీలుంటుంది. క్షేత్రస్థాయి నుంచే వ్యవసాయ అధికారులు సైతం రైతులు ఏ విత్తనం, ఏ రకం వేశారు. ఎవరి నుంచి కొనుగోలు చేశారనే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. దీంతో కంపెనీలు, డీలర్లు, అధికారుల మధ్య పారదర్శకత నెలకొనడంతో పాటు రైతులకు నకిలీ విత్తనాల నుంచి ఉపశమనం పొందేందుకు ఈ యాప్‌ ఉపయోగపడనుందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - 2022-04-26T05:15:09+05:30 IST