డబ్బులు డ్రా చేస్తానంటూ మోసం

ABN , First Publish Date - 2021-06-22T05:33:02+05:30 IST

ఏటీఎం సెంటర్ల వద్ద మోసాలకు పాల్పడుతూ డబ్బులు డ్రా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అమాయకులు, వృద్ధులను టార్గెట్‌ చేసుకుని ఏటీఎం వద్ద డబ్బులు డ్రా చేస్తానని నమ్మించి పిన్‌ నంబర్‌ తెలుసుకుని, అనంతరం కార్డు మార్చేస్తున్న అతని మోసాన్ని పోలీసులు ఛేదించారు.

డబ్బులు డ్రా చేస్తానంటూ మోసం
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ అనిల్‌కుమార్‌

ఏటీఎం కేంద్రాల వద్ద 

4 ఏటీఎం కార్డులు, నగదు స్వాధీనం 

విజయనగరం క్రైం, జూన్‌ 21 : ఏటీఎం సెంటర్ల వద్ద మోసాలకు పాల్పడుతూ డబ్బులు డ్రా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అమాయకులు, వృద్ధులను టార్గెట్‌ చేసుకుని ఏటీఎం వద్ద డబ్బులు డ్రా చేస్తానని నమ్మించి పిన్‌ నంబర్‌ తెలుసుకుని, అనంతరం కార్డు మార్చేస్తున్న అతని మోసాన్ని పోలీసులు ఛేదించారు. విజయనగరంలోని తన కార్యాలయంలో డీఎస్పీ అనిల్‌కుమార్‌ ఆ వివరాలను సోమవారం వెల్లడించారు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని బైరాగివీధికి చెందిన పేడాడ చినబాబు విశాఖలోని పీఎంపాలెం కొమ్మాదిలో  నివాసం ఉంటున్నాడు. ఏటీఎం కార్డులను తెలివిగా తస్కరిస్తూ డబ్బులు డ్రా చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ నెల 11వ తేదీన విజయనగరం మండలం మర్రిశర్ల ఏటీఎం వద్ద అదే గ్రామానికి చెందిన పట్నాయిక్‌ని కృష్ణారావు అనే వృద్ధుడు ఏటీఎం సెంటర్‌కు వచ్చాడు. అక్కడే మాటువేసిన చిన్నబాబు వృద్ధునికి మాయమాటలు చెప్పి కార్డు మార్చేసి కార్డు పనిచెయ్యలేదంటూ చెప్పాడు. అనంతరం ఆ కార్డుతో రూ.20వేలు డ్రా చేశాడు. ఫోన్‌కి డబ్బులు తీసినట్లు మెసేజ్‌ రావడంతో కృష్ణారావు వెంటనే బ్యాంక్‌కి వెళ్లి ఆరా తీశాడు. మోసం జరిగినట్లు తెలుసుకుని ఈ నెల 14న విజయనగరం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై దృష్టి సారించిన సీఐ మంగవేణి, ఎస్‌ఐ నారాయణరావు సిబ్బందితో కలసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల పుటేజీని ఆధారం చేసుకుని చినబాబును గుర్తించారు. అనంతరం నిఘా పెట్టి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఏటీఎం వద్ద నగదు డ్రా చేస్తున్న సమయంలో పట్టుకున్నారు. ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో చినబాబు అంగీకరించాడు. అతని వద్ద నుంచి పోలీసులు నాలుగు ఏటీఎం కార్డులు, రూ.16,500 నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సీఐ మంగవేణి, ఎస్‌ఐ నారాయణరావు, ఏఎస్‌ఐ తినాథరావు, కానిస్టేబుల్‌ షపీలను డీఎస్పీ అభినందించారు. 


Updated Date - 2021-06-22T05:33:02+05:30 IST