అమ్మో.. హైవే!

ABN , First Publish Date - 2021-10-18T04:27:43+05:30 IST

జిల్లా పరిధిలోని 16వ నంబర్‌ జాతీయ రహదారిపై ప్రయాణమంటేనే జనం హడలిపోతున్నారు. హైవే విస్తరణ పనులు అస్తవ్యస్తంగా ఉండడంతో ఎటు నుంచి ఎటు తిరగాలో తెలియక ప్రయాణికులు, వాహన చోదకులు తికమకపడుతున్నారు. కనీస హెచ్చరిక, సూచిక బోర్డులు లేకపోవడంతో కొత్తవారు గందరగోళానికి గురవుతున్నారు. తమ గమ్యస్థానాలను దాటి వెళ్లిపోతున్నారు. చివరికి వారినీ, వీరినీ అడిగి మళ్లీ వెనక్కి వస్తున్నారు.

అమ్మో.. హైవే!
సుభద్రాపురం జంక్షన్‌ వద్ద ఎటువంటి బోర్డులు లేని దృశ్యం


- అస్తవ్యస్తంగా 16వనంబర్‌ జాతీయ రహదారి విస్తరణ

- ఫైఓవర్‌ల వద్ద కానరాని సూచిక బోర్డులు

- ప్రయాణికులు, వాహన చోదకుల అవస్థలు

- దారుణంగా అప్రోచ్‌ రోడ్లు

- పట్టించుకోని అధికారులు

(రణస్థలం)

జిల్లా పరిధిలోని 16వ నంబర్‌ జాతీయ రహదారిపై ప్రయాణమంటేనే జనం హడలిపోతున్నారు. హైవే విస్తరణ పనులు అస్తవ్యస్తంగా ఉండడంతో ఎటు నుంచి ఎటు తిరగాలో తెలియక ప్రయాణికులు, వాహన చోదకులు తికమకపడుతున్నారు. కనీస హెచ్చరిక, సూచిక బోర్డులు లేకపోవడంతో కొత్తవారు గందరగోళానికి గురవుతున్నారు. తమ గమ్యస్థానాలను దాటి వెళ్లిపోతున్నారు. చివరికి వారినీ, వీరినీ అడిగి మళ్లీ వెనక్కి వస్తున్నారు. దీనివల్ల కొంతమంది ప్రమాదాలకు గురై..ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలూ ఉంటున్నాయి.

 -విశాఖకు చెందిన ఓ కుటుంబం కారులో అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనానికి బయలుదేరింది. జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతుండడంతో శ్రీకాకుళం నగరానికి ఎక్కడ మలుపు తీసుకోవాలో వారికి తెలియలేదు. కనీసం సూచిక బోర్డులు కూడా లేవు. దీంతో కుశాలపురం సింహద్వారా వద్ద మలుపు తిరగాల్సిన వారు కొత్తరోడ్‌(చెక్‌పోస్టు)కు వెళ్లిపోయారు. అక్కడ వాకబు చేసి మరో రూట్‌లో అతి కష్టమ్మీద  శ్రీకాకుళం నగరానికి చేరుకున్నారు.

- హైవే విస్తరణలో భాగంగా ఎచ్చెర్ల, ఎచ్చెర్ల పోలీస్‌క్వార్టర్స్‌ను తప్పిస్తూ కొత్తగా ఆరులైన్ల రహదారి పనులు చేపట్టారు. కింతలి మిల్లు వద్ద భారీ ఫైఓవర్‌ను నిర్మించారు. కానీ, అప్రోచ్‌ రోడ్డు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో ఎచ్చెర్ల, పొందూరు, రాజాం, సాలూరు వైపు వెళ్లాల్సిన వారికి ఎక్కడ మలుపు తిరగాలో తెలియడం లేదు. నేరుగా కొత్త రోడ్డులో చిలకపాలెం, బుడుమూరు వరకూ వెళ్లి ఉసూరుమంటూ మళ్లీ వెనక్కి వస్తున్నారు. 

- ఇలా హైవే విస్తరణ పనులతో ప్రయాణికులు, వాహన చోదకులకు ఇబ్బందులు తప్పడం లేదు. పైడిభీమవరం నుంచి నరసన్నపేట వరకూ ఇదే పరిస్థితి. ముఖ్యంగా అత్యవసర, అనారోగ్య సమయాల్లో రాకపోకలు సాగించే వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. జిల్లాలో 193 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరించి ఉంది. దీన్ని ఆరులైన్లుగా విస్తరిస్తున్నారు. తొలి విడతగా పైడిభీమవరం నుంచి నరసన్నపేట వరకు పనులు చేపడుతున్నారు. ప్రధాన జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు. పైడిభీమవరం, కోష్ట, సుభద్రాపురం, బుడుమూరు, చిలకపాలెం, కింతలి మిల్లు, కొయ్యరాళ్ల జంక్షన్‌, పెద్దపాడు, సింగుపురంల వద్ద వంతెనల నిర్మాణం పూర్త య్యింది. శ్రీకాకుళం సింహద్వారం, కోమర్తి జంక్షన్‌, నరసన్నపేట వద్ద ఫ్లైఓవర్‌ పనులు జరుగుతున్నాయి. పనులు అస్తవ్యస్తంగా జరుగుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాణ సామగ్రిని ఇష్టారాజ్యంగా విడిచిపెట్టడం.. రోడ్డుపై క్రషర్‌ బుగ్గి, చిప్స్‌ వదిలేస్తుండడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.


బారికేడ్లు, స్టాపర్లతో సరి

పనుల వద్ద ఎక్కడా సూచిక బోర్డులు కనిపించడం లేదు. కేవలం బారికేడ్లు, స్టాపర్లు ఏర్పాటు చేసి హైవే అథారిటీ అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. హైవే నుంచి సమీప పట్టణాలు, గ్రామాలకు ఎక్కడ మలుపు తీసుకోవాలో తెలియడం లేదు. రోడ్డుపై ఉన్న వారికి వాకబు చేసి వెళ్లాల్సి వస్తోంది. అత్యవసర, అనారోగ్య  పరిస్థితుల్లో ఆస్పత్రులకు వెళ్తున్న వారికి సమయం వృథా అవుతోంది. వంతెన నిర్మాణాలు పూర్తయిన చోట సైతం బోర్డులు లేకపోవడంతో వాహన చోదకులు నేరుగా ఫ్లైఓవర్‌పై దూసుకుపోతున్నారు. ఒకటి, రెండు కిలోమీటర్లు ముందుకెళ్లిన తరువాత గుర్తిస్తున్నారు. అతి కష్టమ్మీద వెనక్కి వస్తున్నారు.


దయనీయంగా అప్రోచ్‌ రోడ్లు

అప్రోచ్‌ రోడ్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. దారి పొడవునా గోతులే దర్శనమిస్తున్నాయి. క్రషర్‌ బుగ్గి, చిప్స్‌, కంకర విడిచి పెడుతుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు నెలల కిందట విజయనగరం నుంచి ఆమదాలవలసకు ఓ వ్యక్తి తన భార్యా పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా శ్రీకాకుళం బైపాస్‌ వద్ద అప్రోచ్‌ రోడ్డులో టిప్పర్‌ ఢీకొంది. దీంతో రెండేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. పది రోజుల కిందట నరసన్నపేట సమీపంలో అప్రోచ్‌ రోడ్డు వద్ద లారీ ఢీకొనడంతో ఓ మహిళ మృతిచెందింది. అప్రోచ్‌ రోడ్లు అస్తవ్యస్తంగా ఉంవడడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కనీసం ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తయ్యేవరకైనా అప్రోచ్‌ రహదారుల నిర్వహణను చూడాల్సిన హైవే అధికారులు పట్టించుకోవడం లేదు.  ఇప్పటికైనా హైవేలపై సూచిక బోర్డులతో పాటు అప్రోచ్‌ రోడ్ల నిర్వహణపై దృష్టి సారించాలని ప్రయాణికులు, వాహన చోదకులు కోరుతున్నారు. 



Updated Date - 2021-10-18T04:27:43+05:30 IST