ఈ అవకాశం.. అదృష్టంగా భావిస్తున్నా..

ABN , First Publish Date - 2021-07-25T06:27:20+05:30 IST

తూర్పుగోదావరికి కలెక్టర్‌గా రావడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లాలో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడ పనిచేసిన అనుభవంతో భవిష్యత్తులో రాష్ట్రస్థాయిలో అనేక కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఈ అవకాశం.. అదృష్టంగా భావిస్తున్నా..

 రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాలో పనిచేసే అవకాశం నిజంగా అదృష్టం

 రాయలసీమలో పూర్తిగా కరువుంటే ఇక్కడంతా పచ్చదనమే

 థర్డ్‌వేవ్‌ పొంచి ఉన్న నేపథ్య్లంలో కేసుల కట్టడే తొలి ప్రాధాన్యంగా పనిచేస్తా

జిల్లాలో బలహీన వర్గాల ప్రజలు అధికం..  వీరి అభివృద్ధికి సహకరిస్తా

‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో కొత్త కలెక్టర్‌ చెవ్వూరి హరికిరణ్‌

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

తూర్పుగోదావరికి కలెక్టర్‌గా రావడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లాలో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడ పనిచేసిన అనుభవంతో భవిష్యత్తులో రాష్ట్రస్థాయిలో అనేక కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. తూర్పుగోదావరి కలెక్టర్‌గా పనిచేస్తే రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు రావడానికి ఎంతో అవకాశం ఉంటుంది. నా కెరీర్‌లో ఇంతవరకు గోదావరి జిల్లాలో పనిచేయలేదు. ఇప్పటివరకు విజయవాడ ఆ తర్వాత రాయలసీమలోనే ఎక్కువకాలం విధులు నిర్వహించాను. కరువు అధికంగా ఉండే ప్రాంతం నుంచి ఇప్పుడు పచ్చని గోదావరి జిల్లాకు వస్తుండడం సంతోషంగా ఉందన్నారు కలెక్టర్‌ హరికిరణ్‌. జిల్లా కొత్త కలెక్టర్‌గా నియమితులైన ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ఫోన్‌లో శనివారం ఇచ్చిన ఇంటర్వూలో పలు విషయాలు మాట్లాడారు. త్వరలో మంచిరోజు చూసుకుని బాధ్యతలు చేపడతానన్నారు. ఇన్నేళ్ల తన సర్వీసులో విజయవాడ, రాయలసీమ జిల్లాల్లోనే ఎక్కువగా పనిచేశానని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. జనాభా, భౌగోళికపరంగా తూర్పు అతిపెద్ద జిల్లా అని, ఇక్కడ సమర్థవంతంగా పనిచేస్తే రాష్ట్రస్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు. ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో తీసుకోబోయే అనేక కీలక నిర్ణయాలు జిల్లాలో క్షేత్రస్థాయి అంశాలతో ముడిపడి ఉంటా యన్నారు. ఇక్కడ పనిచేస్తే లభించే అనుభవం ద్వారా భవిష్యత్తులో ఉన్నతస్థాయిలో పనిచేసేటప్పుడు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. రాయలసీమలో తన సర్వీసు ఎక్కువ కాలం గడిచిందని, అక్కడ పూర్తిగా కరువు పరిస్థితులుంటే.. ఇక్కడ నిత్యం నీటిపరవళ్లు జిల్లాను సస్యశ్యామలంగా ఉంచుతున్నాయన్నారు. ఒకపక్క సముద్రం.. మరోపక్క అడవులు.. ఇంకోపక్క మెట్ట ప్రాంతం ఇలా విభిన్న భౌగోళిక పరిస్థితులకు జిల్లా చిరునామా అని పేర్కొన్నారు. తూర్పుగోదావరి అంటేనే అభివృద్ధికి చిరునామా అని ఇక్కడ సంస్కృతి, సంప్రదాయాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లదన్నారు. వీటన్నింటికితోడు ఇక్కడ బలహీనవర్గాలు కూడా అధికంగా ఉన్నారని, వీరి అభివృద్ధికి అన్నివిధాలా సహకరించడమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. వీరికి ఇంకా ఎంతో చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే జిల్లాలో మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి విషయాల్లో కఠినంగా ఉండాలని, అప్పుడే వైరస్‌ ముప్పును కొంతలోకొంతైనా నియంత్రించవచ్చని చెప్పారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకుని పనిచేస్తానన్నారు. పట్టణ ప్రాంతాలు జిల్లాలో ఎక్కువగా ఉన్నా యి. వీటిపై ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉందన్నారు. అలా చేస్తే పాజిటివ్‌లు అదుపులోకి తీసుకురావచ్చని వివరించారు. పేదలకు గృహనిర్మాణంతోపాటు ఇతర సంక్షేమ పథకాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, అధికారుల సాయంతో జిల్లాను మరిం త అభివృద్ధి బాటలో పయనించేలా చేయడమే కర్తవ్యంగా పనిచేస్తానని చెప్పారు.



Updated Date - 2021-07-25T06:27:20+05:30 IST