టీడీపీలో నయా జోష్‌..

ABN , First Publish Date - 2022-05-20T06:24:22+05:30 IST

జిల్లా టీడీపీలో నయా జోష్‌ వచ్చింది. అధినేత చంద్రబాబునాయుడు పర్యటన సక్సెస్‌ కావడంతో క్యాడర్‌లో ఎన్నడూ లేని ఉత్సాహం నెలకొంది. చంద్రబాబుకు కార్యకర్తలు,

టీడీపీలో నయా జోష్‌..

చంద్రబాబు టూర్‌ సక్సెస్‌

క్యాడర్‌లో ఉత్సాహం

ప్రజల్లో ఉండండి...

వెతికి వెతికి అవకాశాలు ఇస్తానంటూ చంద్రబాబు స్పష్టీకరణ 

కడప, మే19(ఆంధ్రజ్యోతి) : జిల్లా టీడీపీలో నయా జోష్‌ వచ్చింది. అధినేత చంద్రబాబునాయుడు పర్యటన సక్సెస్‌ కావడంతో క్యాడర్‌లో ఎన్నడూ లేని ఉత్సాహం నెలకొంది. చంద్రబాబుకు కార్యకర్తలు, జనం నీరాజనాలు పలకడంతో టీడీపీ శ్రేణులు ఉబ్బితబ్బిబవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత చంద్రబాబునాయుడు తొలినాళ్లలో జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం గత ఏడాది అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి పలువురు నీటమునిగి చనిపోయిన బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శించి పరిహారం అందించారు. తాజాగా బుధవారం కమలాపురంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమానికి ఊహించని రీతిలో స్పందన రావడంతో జిల్లా పార్టీ నేతలే ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.


క్యాడర్‌కు భరోసా లేక..

ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతుండడం, ఇతరత్రా వేధింపుల కారణంగా జిల్లాలో మూడేళ్లుగా టీడీపీ స్తబ్దుగా ఉంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొన్ని నియోజకవర్గాల్లో నిరసనలు, ఇతర కార్యక్రమాలు జరిగేవి. స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాల్లో వైసీపీ వారే గెలిచారు. క్షేత్ర స్థాయిలో క్యాడర్‌ పోటీచేయాలని కొందరు కసితో ఉన్నప్పటికీ వారికి సరైన భరోసా లభించకపోవడంతో బరిలో నిలబడలేకపోయారు.


బాదుడే బాదుడుతో...

2024 ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబునాయుడు క్యాడర్‌ను సమాయత్తం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని పార్టీలో జోష్‌ నింపేందుకు ఎంచుకున్నారు. జగన్‌ ఇచ్చే సంక్షేమ పథకాలు కొందరికి మాత్రమే వస్తే.. జగన్‌ పెంచిన పన్నుల భారం మాత్రం కులం చూడం, మతం చూడం, వర్గం చూడం అన్నట్లుగా అందరిపైనా పడింది. టీడీపీ హయాంలో పెట్రోల్‌, డీజల్‌, గ్యాస్‌ ఇతర నిత్యావసర ధరలు, వైసీపీ పాలనలో ఉన్న ధరలను పోలుస్తూ చేస్తున్న ప్రచారం బాగా జనంలోకి వెళుతోంది. ఇందులో భాగంగా చంద్రబాబు హాజరైన బాదుడేబాదుడు కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. జిల్లా స్థాయి విస్తృత సమావేశం, సభల్లో క్యాడర్‌ ఉత్సాహం చూస్తే వచ్చే ఎన్నికల్లో గెలవాలన్న పట్టుదల కార్యకర్తల్లో స్పష్టంగా కనిపిస్తోంది.


జనంలో ఉండండి

ప్రజల్లో ఉండండి.. ప్రజల తరపున పోరాడండి.. జనంలో ఉంటే వెతికి వెతికి అవకాశాలు ఇస్తానంటూ బుధవారం కడపలో జరిగిన కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు స్పష్టంగా వెల్లడించారు. ఏదో ఎక్కడో కూర్చొని, ఏదో పార్టీ కార్యక్రమాలకు పిలిపిస్తే కనిపించేసి, ఫోటోలు తీసుకొని ఓ ప్రెస్‌మీట్‌ పెట్టి నెట్టుకొస్తే చాలు.. పార్టీలో మన స్థానం ఉంటుందనే భావన వీడండి అంటూ హెచ్చరించారు. బాదుడే బాదుడు ప్రతి ఇంటికి వెళ్లిందని, ఇక నుంచి ప్రజల్లో ఉండాలంటూ ఆదేశించారు. ప్రజల్లో ఉండే వారికే అవకాశం ఇస్తానని చంద్రబాబు తేల్చేశారు. కరోనా సాకో.. ఇంకా ఎన్నికల సమయం ఉందని అప్పుడు చూద్దాంలే అంటే కుదరదని... ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేందుకు సిద్ధంగా ఉండాలని అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.


ఇక జనంబాట పట్టాల్సిందే

టికెట్‌ ఆశిస్తున్న వారు... టికెట్‌ కన్ఫర్మ్‌ అయిన వారు కూడా ఇక జనంబాట పట్టాల్సిందే అని చంద్రంబాబు స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వ పన్నుల భారం, టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, జగన్‌ పాలనను పోలుస్తూ గడప గడప తొక్కాల్సిందే. నేతలు క్షేత్ర స్థాయిలోకి వస్తే క్యాడర్‌ కూడా ముందుకు వెళుతుంది. పార్టీ రాష్ట్ర కమిటీ కార్యక్రమాలే కాకుండా జిల్లా స్థాయి సమస్యలపై కూడా పోరాటం చేయాలి. ఇప్పటిదాకా ఆ పరిస్థితి లేదు. జిల్లాలో భూకబ్జాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కాజేసే రోజు పోయి ప్రైవేటు భూములను కూడా ఆక్రమిస్తున్నారు. కడప, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో భూఆక్రమణలు పెరిగిపోయాయి. అలాగే ఉక్కుఫ్యాక్టరీ కోసం పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉంది. జగన్‌ వేలకోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. పనులు చేపట్టలేదు. వీటన్నిటిపై ప్రణాళికలు రూపొందించుకొని అవి పూర్తి చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు సిద్ధం కావాలి. ఏదైనా సమస్య వస్తే టీడీపీ ఉందనే భరోసా జనానికి కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఈ మేరకు చంద్రబాబు పర్యటనతో టీడీపీ నేతలు, కార్యకర్తలు చేయాల్సిన పనులకు సంబంధించి స్పష్టత తెచ్చింది.


చంద్రబాబు టూర్‌... క్యాడర్‌కు టానిక్‌

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు లింగారెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవితో పాటు, కడప, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, రాజంపేట, బద్వేలు, రాయచోటి, రైల్వేకోడూరు ఇన్‌చార్జ్‌లు సమన్వయంగా చంద్రబాబు పర్యటనను విజయవంతం చేశారు. అయితే ఊహించని రీతిలో స్పందన రావడంతో జిల్లా పార్టీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు నిర్వేదంగా ఉన్న టీడీపీ నాయకులకు, క్యాడర్‌కు చంద్రబాబు టూర్‌ టానిక్‌గా పని చేసిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. జిల్లాలో ఒకరిద్దరు మాత్రమే నియోజకరవర్గాల్లో చురుగ్గా పర్యటిస్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లో నామమాత్రంగా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే చంద్రబాబు పర్యటనలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపించిందని, దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇక ప్రజా క్షేత్రంలో దిగాల్సిన సమయం ఆసన్నమైందని ఓ నేత వ్యాఖ్యానించారు. ఈ పర్యటనను కలసికట్టుగా ఎలా అయితే విజయవంతం చేశారో, ఇక మీదట ప్రతి కార్యక్రమాన్ని ఇలాగే చేపడతామని ఆయన అన్నారు.

Updated Date - 2022-05-20T06:24:22+05:30 IST