
హైదరాబాద్ (Hyderabad): అల్లూరి సీతారామారాజు (Alluri Sitaramaraju) 125వ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత, చంద్రబాబు (Chandrababu), ఆయన తనయుడు లోకేష్ (Lokesh) నివాళులర్పించారు. సోమవారం హైదరాబాద్లోని తమ నివాసంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ స్వాతంత్ర్య సంగ్రామంలో సీతారామరాజు పోరాటం చిరస్మరనీయమన్నారు. అల్లూరి జయంతోత్సవాలు జరుపుకోవడం తెలుగు జాతికే కాకుండా దేశానికే గర్వకారణమని అన్నారు. ఆయన జీవితాంతం పోరాటంలో ముందుకుపోయారని, చిన్న వయసులోనే తెల్లవారిపై పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారని కొనియాడారు. దీనికి తగిన గుర్తింపు రాలేదన్నారు. జాతీయ స్థాయిలో కూడా అనుకున్నంత గుర్తింపు రాలేదన్నారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి అల్లూరి 125 జయంతోత్సవాలు జరపాలని కేంద్రం నిర్ణయించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రాష్ట్రానికి వచ్చి ఆ మహనీయుడు చేసిన త్యాగాన్ని గుర్తించి, నివాళులర్పించడం సముచితమైన నిర్ణయమని అన్నారు. పార్లమెంట్లో కూడా అల్లూరి విగ్రహం పెట్టాలని ఒకప్పుడు స్పీకర్ నిర్ణయించారని.. ఇప్పుడు విగ్రహాన్ని పార్లమెంట్లో ఏర్పాటు చేసి అల్లూరికి తగిన గుర్తింపు ఇవ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి