Abn logo
Apr 21 2021 @ 01:09AM

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేస్తున్న తెలుగు మహిళలు, టీడీపీ నాయకులు

ఒంగోలు, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. కరోనా, ఇతర కారణాలతో కీలక నేతలు అందుబాటులో లేనప్పటికీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెలుగు తమ్ముళ్లు పార్టీ అధినేత జన్మదిన వేడుకలను ఉత్సాహంగానే నిర్వహించారు. పార్టీ కార్యాలయాలు, ఇతర చోట్ల కేక్‌ల కటింగ్‌లతోపాటు వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో కేక్‌ కటింగ్‌ జరిగింది. పార్టీ నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కామేపల్లి శ్రీనివాసరావు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ ఇతర నేతలు పాల్గొన్నారు. అలాగే నగరంలోని 11వ డివిజన్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు, గుర్రాల రాజ్‌విమల్‌, శశికాంత్‌భూషణ్‌ పాల్గొన్నారు. తెలుగు యువత ఆధ్వర్యంలో  సీతారాంపురంలోని వృద్ధాశ్రమంలో దుస్తుల పంపిణీతో పాటు అన్నదానం చేశారు. గిద్దలూరులో జరిగిన వేడుకల్లో అక్కడి మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, దర్శిలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు పాల్గొన్నారు.  పొదిలి, కనిగిరి, ఉలవపాడు, దోర్నాల, ఎర్రగొండపాలెం, చీరాల, ఎస్‌ఎన్‌పాడు తదితర పలు ప్రాంతాల్లోనూ వేడుకలు జరిగాయి. 


Advertisement
Advertisement
Advertisement