కార్యకర్తకు చంద్రబాబు భరోసా
ABN , First Publish Date - 2022-03-08T06:15:36+05:30 IST
కుప్పంలో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలకు గురైన మురళి అనే కార్యకర్తకు ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భరోసా ఇచ్చారు.
కుప్పం, మార్చి 7: కుప్పంలో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలకు గురైన మురళి అనే కార్యకర్తకు ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇటీవల కుప్పంలో అధికార పార్టీ నాయకుల అక్రమ దందాలపై మురళి వారిని ప్రశ్నించారు. దీనిపై ఆగ్రహించిన నాయకుల అనుచరులు మురళిపై దాడి చేసి గాయపరిచారు. దీనిపై టీడీపీ శ్రేణులు ఆందోళన చేయగా, పోలీసుస్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో మురళి భార్యాబిడ్డలతో ఆదివారం అమరావతి వెళ్లి పార్టీ కార్యాలయంలో చంద్రబాబును కలిశారు. తనపై వైసీపీ నాయకులు చేసిన దాడిని, దౌర్జనాన్ని వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... కుప్పం నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అరాచకాలు ఎక్కువైపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి అక్రమాలను ఎదిరించినందుకు మురళిని అభినందించారు. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని, ఎవరూ భయపడవద్దని భరోసా ఇచ్చారు. అవసరమైతే తానే నేరుగా కుప్పం వచ్చి వారి తరఫున నిలబడి ఆందోళన చేస్తానన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, కష్టపడే ప్రతివొక్క కార్యకర్తకూ మంచి రోజులు వస్తాయని, వారిని గుర్తుంచుకుని అవకాశాలు ఇస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.