బీజేపీ రాష్ట్ర కమిటీలో నలుగురికి ఛాన్స్‌

ABN , First Publish Date - 2020-08-03T11:18:19+05:30 IST

బీజేపీ రాష్ట్ర కమిటీలో ఉమ్మడి జిల్లా నుంచి నలుగురికి కీలక పదవుల దక్కాయి.

బీజేపీ రాష్ట్ర కమిటీలో నలుగురికి ఛాన్స్‌

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర కమిటీలో ఉమ్మడి జిల్లా నుంచి నలుగురికి కీలక పదవుల దక్కాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఆది వారం రాష్ట్ర కమిటీని ప్రకటించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌ కర్నూల్‌ నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బంగారు శ్రుతికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. ఈమె ఇప్పటి వరకు ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శిగా పని చేశారు. బీజేపీ దివంగత జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ కుమార్తె అయి న శ్రుతి విద్యార్థి దశ నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ విభాగాల్లో పని చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కోశాధికారిగా పని చేస్తున్న శాంతకుమార్‌కు మరోసారి అదే పదవి దక్కింది. విద్యార్థి దశ నుంచి బీజేపీలో కొనసాగిన ఆయన, ఐటీ కమిషనర్‌ పదవికి స్వచ్ఛంద విరమణ చేశాక 2012 నుంచి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. పలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల కోసం వ్యూహాలు అమలు చేస్తూ వచ్చారు.


మహబూబ్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి తాజాగా పార్టీ ఉపాధ్యక్ష పదవి దక్కింది. 2001లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన ఈయన 2007లో గ్రాడ్యుయే ట్స్‌ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. 2007-09 మధ్య టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. ఆ సమయంలో పాలమూరు సాగునీటి పథకాలపై అన్ని పార్టీలతో కలిసి ఉద్యమం నిర్వహించారు. 2009లో కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇన్‌ ఛార్జిగా పనిచేశారు. ఆ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ను వీడి, యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. 2012 ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మహబూబ్‌నగర్‌ నుంచి గెలుపొందారు.


2014 లో స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. తాజా లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీలో పునఃప్రవేశించారు. వీరితో పాటు గద్వాల పట్టణానికి చెందిన ఎండీ అప్సర్‌ పాషా మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈయన విద్యార్థి దశలో ఏబీవీపీ ఉమ్మడి జిల్లా కో కన్వీనర్‌గా, గద్వాల కన్వీనర్‌గా పని చేశారు. 2014-16 మఽధ్య కాలంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర  ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2016 నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. తాజా కార్యవర్గంలోనూ ఆయన కు అదే పదవి దక్కిది. కొత్త కార్యవర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి కీలకమైన వ్యక్తులకు, ప్రాధాన్యమైన పదవులు దక్కడంపై బీజేపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమౌతోంది. 

Updated Date - 2020-08-03T11:18:19+05:30 IST