చాణక్య నీతి: వెన్నంటి ఉండే స్నేహితుని కంటే బద్ధ శత్రువు వెయ్యి రెట్లు మేలు.. అదెలాగో తెలుసా?

ABN , First Publish Date - 2021-11-16T12:35:07+05:30 IST

ఆచార్య చాణక్యుడి విధానాలు, ఆలోచనలు కొంచెం కఠినంగా..

చాణక్య నీతి: వెన్నంటి ఉండే స్నేహితుని కంటే బద్ధ శత్రువు వెయ్యి రెట్లు మేలు.. అదెలాగో తెలుసా?

ఆచార్య చాణక్యుడి విధానాలు, ఆలోచనలు కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ వాటిలో జీవిత సత్యం కనిపిస్తుంది. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాణక్యుని ఆలోచనలు వింతగా అనిపించవచ్చు. కానీ ఇవి మీకు జీవితంలో ఎదురయ్యే ప్రతి పరీక్షలోనూ సహాయపడతాయి. ఈ రోజు మనం ఆచార్య చాణక్యుడి ఈ ఆలోచనల నుంచి సేకరించిన మరో ఆలోచనను గ్రహిద్దాం. ఈ ఆలోచన స్నేహానికి సంబంధించినది. 'కలసి ఉంటూ మోసం చేసేవాడికన్నా పెద్ద శత్రువు మరొకరు ఉండరు.. మన చెడును మన ముఖం మీదనే చెప్పేవాడిని మించిన స్నేహితుడు ఉండడు.' అని అంటాడు ఆచార్య చాణక్య. ఈ వ్యాఖ్యానం ద్వారా ఆచార్య చాణక్య.. మనకు నిజమైన స్నేహితుడు ఎవరో తేల్చిచెప్పారు. 




 వెన్నుపోటు పొడిచి, చెడు తలపెట్టే స్నేహితునికి దూరంగా ఉండడం మంచిదని ఆచార్య సూచించారు. ఈ స్వభావం ఉన్న స్నేహితులు చాలా ప్రమాదకరం. ఇటువంటివారి కన్నా మీ ముఖం మీదనే ఉన్నది ఉన్నట్లు చెప్పేవారు చాలా మంచివారని గ్రహించాలి. ఇలాంటి వారంటే కొందరికి భయం ఉండొచ్చు. కానీ మన వెనుక గోతులు తవ్వేవారి కంటే వీరు ఎంతో ఉత్తమం. ఇలాంటివారు మీకు జీవితంలో ఎదుపడే ఉంటారు. మీరు ఎవరితోనూ చెప్పుకోలేని మీ వ్యక్తిగత విషయాలను పంచుకునే కొంతమంది స్నేహితులు మీకు ఉంటారు. వారిని మీరు సన్నిహితులుగా భావించి, చాలా విషయలు చెబుతారు. ఆ సమయంలో భావోద్వేగాలకు లోనవుతూ మీ రహస్యాలను ఈ స్నేహితునితో పంచుకోవడం జరుగుతుండవచ్చు. అయితే మీనుంచి వీటిని పంచుకున్న స్నేహితులు.. అవకాశం దొరికినప్పుడు మీ రహస్యాలన్నింటినీ ఇతరులకు తెలియజేస్తారు. ఈ పని చేస్తున్నప్పుడు వారు ఏమాత్రం బాధపడరు, మీ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నామన్న సంగతేవారు ఆలోచించరు. అలాంటి స్నేహితుల కంటే మీకుండే బద్ధ శత్రువులు ఎంతో ఉత్తములు. మిమ్మల్ని అస్సలు ఇష్టపడని వారు కూడా మీ చుట్టూ ఉంటారు. వారు కుండ బద్దలు కొట్టినట్లు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. వారి వలన హాని జరగకపోవచ్చు. అందుకే ఆచార్య చాణక్య.. పక్కనే ఉంటూ మోసం చేసే మిత్రుని కన్నా.. మన చెడును మన ముఖం మీదనే చెప్పే శత్రువు మేలని చెబుతాడు. 

Updated Date - 2021-11-16T12:35:07+05:30 IST