కరోనా దెబ్బకు రైతు విలవిల

ABN , First Publish Date - 2020-03-28T10:43:33+05:30 IST

జిల్లాలో 2019-20లో పంటల సాగు గతం కన్నా బాగా ఉంది. ఖరీఫ్‌, రబీ కలిపి 5.5లక్షల హెక్టార్లకు పైగానే సాగు జరిగింది.

కరోనా దెబ్బకు రైతు విలవిల

పొలంలోనే 75వేల టన్నుల మిర్చి

ఇళ్లలో శనగలు, కందుల నిల్వలు

పొగాకు గ్రేడింగ్‌ పనులు నిలిపివేత

పలుచోట్ల ఎండిపోతున్న మొక్కజొన్న, వైట్‌బర్లీ

రూ.కోట్లలో నష్టపోతామని రైతుల ఆవేదన 


జిల్లాలోని రైతాంగానికి కరోనా దెబ్బ తీవ్రంగానే తగిలింది. కోట్టల్లో మేర నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేకించి మిర్చి, శనగ రైతులపై ఆ ప్రభావం తీవ్రంగా ఉండగా కంది, మొక్కజొన్న, వైట్‌బర్లీ, ధాన్యం రైతులపై కూడా అధికంగానే కనిపిస్తోంది. పొలంలో ఉన్న పంటను కోసి ఇంటికి తెచ్చుకోలేక, ఇళ్లలో ఉన్న పంట ఉత్పత్తులను అమ్ముకునే వీల్లేక  కనీసం స్టోరేజీలకు తీసుకెళ్లి దాచుకునే దారి కూడా లేక అవస్థలు పడుతున్నారు. ఒక్క మిర్చి పంటే 75వేల మెట్రిక్‌ టన్నులు వరకు ప్రస్తుతం పొలంలో ఉం ది. పండుకాయ కోతలు ఆగి పోయాయి. శనగలు, కందులు వేలాది టన్నులు రైతుల ఇళ్లలో ఉన్నాయి. ధాన్యం రైతుల పరిస్థితి అలాగే ఉంది. మొక్కజొన్న, వైట్‌బర్లీ పొలంలోనే ఎండి పోతున్నాయి. పొగాకు గ్రేడింగ్‌కు అవకాశం లేక రైతులు ఆవేదన చెందుతున్నారు.


ఒంగోలు,మార్చి 27 : జిల్లాలో 2019-20లో పంటల సాగు గతం కన్నా బాగా ఉంది. ఖరీఫ్‌, రబీ కలిపి 5.5లక్షల హెక్టార్లకు పైగానే సాగు జరిగింది. అందులో ప్రధానపంటలైన కంది, శనగ, వరి, మిర్చి, పొగాకు తదితర పంటల విస్తీర్ణం సాధారణం కన్నా అధికంగానే సాగైనట్లు అంచనా. జిల్లాలో ఈ సీజన్‌లో 34వేల హెక్టార్లలో మిర్చి సాగు చేశారు. పర్చూరు మార్టూరు, అద్దంకి, వైపాలెం, మార్కాపురం వ్యవసాయ సబ్‌ డివిజన్లతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సాగు చేశారు. సగటున హెక్టారుకు ఆరు టన్నుల వంతున రెండు లక్షల టన్నులకుపైగా ఈ ఏడాది దిగుబడులుగా అం చనా. 40శాతం మేర పంట ఇంకా పొలంలోనే ఉంది.


మరో నెలరోజుల పాటు మిర్చి కోతలు జరుగుతాయి. అలాంటిది కరోనా దెబ్బతో ప్రస్తుతం కోతలు నిలిచిపోయాయి. కూలీలు వస్తేనే తప్ప ఈ పంటను కోసేందుకు మరో అవకాశం లేదు. కరోనా నియంత్రణలో భాగంగా పనులకు కూలీలు రావడం లేదు. అలా పొలంలోనే పంట ఉంటే కాయలు మరింతగా పండి రాలిపోవడం లేదా నీరంతా తూకం తగ్గడం, నాణ్యత కోల్పోనున్నాయి.  ప్రస్తుతం పొలంలో ఉన్న మిర్చి పంట విలువ తక్కువలో తక్కువగా రూ.750కోట్ల వరకు ఉంటుంది. 


 అధ్వానంగా శనగ రైతుల పరిస్థితి

అసలే అంతంతమాత్రంగా ఉన్న శనగల రైతుల పరిస్థితి మరింత దిగజారింది. జిల్లాలో 80వేల టన్నుల వరకు పంట ఉత్పత్తి అంచనా. చాలా వరకు రైతుల ఇళ్ళలోనే శనగలు నిల్వ ఉన్నాయి. వాటిని అమ్ముకునే అవకాశం లేకపోగా కోల్డ్‌స్టోరేజీలకు తరలించి నిల్వ చేయాలన్నా ఖాళీ లేక ఇబ్బంది  పడుతున్నారు. జిల్లాలో 98వేల హెక్టార్లలో కంది పంట సాగు కాగా 5లక్షల టన్నులు ఉత్పత్తి అయినట్లు అంచనా. 


పొగాకు రైతుకు కష్టాలే

మరో ప్రధాన పంట అయిన పొగాకు జిల్లాలో 80 మిలియన్ల పంట ఉత్పత్తి అంచనా కాగా కేవలం మూడు మిలియన్లు విక్రయాలు జరిగేసరికి కరోనా వైరస్‌ దెబ్బతో కొనుగోలు కేంద్రాలు నిలిచిపోయాయి.  కరోనా దెబ్బతో పొగాకు గ్రేడింగ్‌ను కూడా అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో పొగాకు రైతులు ఆందోళన చెం దుతున్నారు. ధాన్యం, నిమ్మ, బత్తాయి, బొప్పాయి రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. అధికారులు వాస్తవ దృష్టితో ఆలోచించి తమకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని రైతులు కోరుతున్నారు. 


నాలుగు రోజుల క్రితమే కోయాల్సింది: వంకాయలపాటి అంజనేయులు, కొత్త అన్నసముద్రం 

ఎకరన్నరలో మిర్చి వేశా. ఇప్పుడు చివరి కోత సిద్ధంగా ఉంది. నాలుగు రోజుల క్రితమే కోయాల్సింది. కూలీలు లేక కోయలేకపోయా. ఇంకా ఆరేడు క్వింటాళ్ళ పంట పొలంలోనే ఉంది. కూలీలు వస్తామన్న వలంటీర్లు రానీయడం లేదు. ఇలాగైతే నష్టపోతాం. 


Updated Date - 2020-03-28T10:43:33+05:30 IST