చేపపిల్లల పంపిణీ నిలిపివేత

ABN , First Publish Date - 2022-09-29T05:46:33+05:30 IST

జిల్లాలోని చెరువులు, కుంటల్లో చేపలు పెంచి ఉపాధి పొందేందుకు గాను ప్రభుత్వం పంపిణీ చేయాల్సిన ఉచిత చేప పిల్లల కార్యక్రమం నిలిచిపోయింది.

చేపపిల్లల పంపిణీ నిలిపివేత

- నాణ్యత లేనివి సరఫరా చేశారనే కారణం 

- అధికారుల పరిశీలన

- జాప్యంపై మత్య్సకారుల ఆందోళన 


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి ) 

జిల్లాలోని చెరువులు, కుంటల్లో చేపలు పెంచి ఉపాధి పొందేందుకు గాను ప్రభుత్వం పంపిణీ చేయాల్సిన ఉచిత చేప పిల్లల కార్యక్రమం నిలిచిపోయింది. చేప పిల్లలను పంపిణీ చేసే కాంట్రాక్టర్లు నాణ్యమైన పిల్లలను తీసుకురాక పోవడంతో అధికారులు పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో 1013 చెరువుల, కుంటలు ఉండగా, శ్రీపాద ఎల్లంపల్లి, సుందిళ్ల బ్యారేజిలు ఉన్నాయి. చెరువులు, కుంటలను ప్రభుత్వం మత్య్స సహకార సంఘాలకు లీజుకు ఇవ్వగా, ప్రాజెక్టులు రిజర్వాయర్లో చేపలు పెంచుకుని ఉపాధి పొందేందుకు గానూ మత్య్సకారులకు లైసెన్స్‌లను జారీ చేసింది. ప్రతీ యేటా మత్య్సకారులు చేపలు పెంచుకొని ఉపాధి పొందుతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మత్య్సకారులకు చేప పిల్లలను ఉచితంగా అందజేస్తోంది. చెరువుల, కుంటల్లో చేపలు పెంచేందుకు 40 ఎంఎం సైజు గల చేప పిల్లలను రిజర్వాయర్లు ప్రాజెక్టుల్లో 80 నుంచి 100 ఎంఎం సైజ్‌ పిల్లలను మత్య్సకారులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. ఈ ఏడాది జిల్లాలో గల చెరువులు, కుంటల్లో ఒక కోటి రెండు లక్షల చేప పిల్లలను, ప్రాజెక్టులు రిజర్వాయర్లో పెద్ద సైజు గల 56 వేల చేప పిల్లలను పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ కోసం టెండర్‌లను ఆహ్వానించగా శ్రీరాములు, వినోద్‌, సురేష్‌ అనే ముగ్గురు టెండర్లను దక్కించుకున్నారు. ఈ ప్రక్రియ జరగడానికి నెల రోజులు ఆలస్యం కాగా వారం రోజుల క్రితం నుంచి చెరువులు, కుంటల్లో చేప పిల్లలను పోషిస్తున్నారు. ఓదెల, .జూలపల్లి, ధర్మారం, పెద్దపల్లి మండలాల్లోని 310 చెరువులు, కుంటల్లో 33 లక్షల 6 వేల 507 చేప పిల్లలను పోశారు. 

- తక్కువ సైజు పిల్లల పంపిణీ..

చేప పిల్లలను చెరువులు, కుంటల్లో సొసైటీ సభ్యులు, ఎంపీడీవో, మత్య్సశాఖ అధికారుల సమక్షంలో చేపలను పోయాల్సి ఉంటుంది. అయితే కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్న చేపపిల్లలు స్థానికంగా వారి సొంత ఫిషరీస్‌ ఫారంలో పెంచినవి పోయాల్సి ఉండగా ఆంధ్ర ప్రాంతాల నుంచి నాణ్యతలేని పిల్లలను తీసుకువచ్చి తక్కువ సైజు గల చేప పిల్లలను పోస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. చెరువులో చేపలు పోసే కార్యక్రమాన్ని కూడా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ కూడా జిల్లాకు వచ్చి తనిఖీ చేశారని తెలిసింది. ఈ సందర్భంగా ఆయన పరిశీలనలో నాణ్యత లేని చేప పిల్ల్లలు పోసిన తరువాత ఆ మరుసటి రోజే అవి చనిపోతున్నాయని అలా పలు చెరువుల్లో చనిపోవడంతో మళ్లీ కాంట్రాక్టర్లతో పోయిస్తున్నట్లు సమాచారం.  రెండు  రోజుల క్రితం నుంచి ప్రస్తుతానికి పూర్తిగా నిలిపివేసినట్లుగా తెలుస్తున్నది. ఈప్రక్రియను అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేశారని సమాచారం. నాణ్యత లేని చేపపిల్లలను కాంట్రాక్టర్లు సరఫరా చేయడం వల్లనే తాత్కాలికంగా బ్రేక్‌ వేసినట్లు సమాచారం. నాణ్యమైన చేప పిల్లలను కాంట్రాక్టర్లు జారీ చేయడంలో జాప్యం జరుగుతుండటంతో మత్య్సకారులు ఆందోళనలకు గురవుతున్నారు. చేపలు పెంచడం ఆలస్యం అయితే అవి పెద్దగా ఎదగవని తద్వారా తమకు లాభాలు ఉండవని చెబుతున్నారు. జిల్లాలో మత్య్సకారులకు పంపిణీ చేసే చేప పిల్లల విలువ కోటి 16 లక్షల రుపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చేపపిల్లల పంపిణీ నిలిపివేతపై ‘ఆంధ్రజ్యోతి’ జిల్లా మత్య్సకార అధికారి భాస్కర్‌ను వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల మేరకు తాత్కాలికంగా నిలిపివేశామని, చేపపిల్లలు నాణ్యత లేవని ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే మత్య్సకారులకు నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేసే విధంగా చర్యలు చేపడుతామని ఆయన తెలిపారు. 


Updated Date - 2022-09-29T05:46:33+05:30 IST