ఎక్కడైనా అమ్ముకోండి

ABN , First Publish Date - 2020-06-04T07:03:00+05:30 IST

మోదీ సర్కారు అన్నదాతకు తీపి కబురు చెప్పింది. పంట ఉత్పత్తుల విక్రయాలపై దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆంక్షలను ఎత్తివేసింది. రైతులు సాధికారత సాధించేందుకు, గ్రామీణ భారతానికి ఊపునిచ్చేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది...

ఎక్కడైనా అమ్ముకోండి

  • ఒకే దేశం.. ఒకే వ్యవసాయ మార్కెట్‌!
  • నిత్యావసర వస్తువుల చట్టానికి సవరణ
  • రైతులు పంటను ఎవరికైనా అమ్మవచ్చు 
  • ఇకపై ఎలాంటి ఆంక్షలూ ఉండవు
  • స్వేచ్ఛాయుత రవాణాకు ఆర్డినెన్స్‌ 
  • అంతర్జాతీయ మార్కెట్లకూ ఎగుమతి 
  • కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): మోదీ సర్కారు అన్నదాతకు తీపి కబురు చెప్పింది. పంట ఉత్పత్తుల విక్రయాలపై దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆంక్షలను ఎత్తివేసింది. రైతులు సాధికారత సాధించేందుకు, గ్రామీణ భారతానికి ఊపునిచ్చేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులు కష్టపడి పండించిన పంటలను ఇకపై స్వేచ్ఛగా.. తమకు ఇష్టం వచ్చిన వారికి విక్రయించుకోవచ్చు. చిన్న దుకాణాల నుంచి బడా వ్యాపారుల వరకు.. ఎవరితోనైనా ఒప్పందాలు చేసుకొని ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఇలా రైతులకు, వినియోగదారులకు లభ్ధి చేకూర్చే చరిత్రాత్మక నిర్ణయాలకు ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారమిక్కడ సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.


‘ఒకే దేశం.. ఒకే వ్యవసాయ మార్కెట్‌’ లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆరున్నర దశాబ్దాల కిందటి నిత్యావసర వస్తువుల చట్టాన్ని సవరించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఫలితంగా తృణధాన్యాలు, కాయఽధాన్యాలు, ఉల్లి గడ్డలు వంటి వాటిని నిత్యావసర వస్తువుల జాబితా నుంచి తొలగిస్తారు. అలాగే రాష్ట్రం లోపల, రాష్ట్రాల మఽధ్య ఎలాంటి ఆంక్షలు లేకుండా వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం చేసుకునేందుకు; రైతులు ఎవరితోనైనా స్వేచ్ఛగా చర్చలు జరిపి తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు వీలుగా ఆర్డినెన్స్‌లు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నిర్ణయాల వల్ల వ్యవసాయ రంగం రూపురేఖలు మారిపోవడమేగాక రైతుల ఆదాయం పెరుగుతుందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు. నిత్యావసర వస్తువుల చట్ట సవరణ నిర్ణయం ప్రైవేట్‌ పెట్టుబడిదారుల వ్యాపార కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం లేకుండా చేసేందుకు దోహద పడుతుందన్నారు. పంటల ఉత్పత్తి, నిల్వ, రవాణా, పంపిణీ, సరఫరాల్లో రైతులకు స్వేచ్ఛ కల్పించడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో ప్రై వేట్‌, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు. శీతలీకరణ కేంద్రాలు, ఆహార సరఫరా ఆధునికీకరణలో పెట్టుబడులు పెరిగేందుకు కూడా వీలు కలుగుతుందని చెప్పారు.  ధరల స్థిరీకరణ జరుగుతుందని, మార్కెట్‌లో పోటీ వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. 


పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక బృందం

దేశంలో పెట్టుబడులను ఆక ర్షించేందుకు, 2024-25 కల్లా 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కేబినెట్‌ నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా ఒక సాధికారిక బృందంతో పాటు ప్రాజెక్టు అభివృద్ధి విభాగాల ఏర్పాటుకు నిర్ణయించామన్నారు.

కోల్‌కతాలోని నౌకాశ్రయానికి జనసంఘ్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి శ్యామాప్రసాద్‌ ముఖర్జీ పేరు పెట్టాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది.




ఆంక్షలుండవు.. ఎక్కడైనా అమ్ముకోవచ్చు

వ్యవసాయ ఉత్పత్తుల స్వేచ్ఛా వ్యాపారానికి సంబంధించిన ఆర్డినెన్స్‌ వల్ల మార్కెట్‌ కమిటీల యార్డులకు, లైసెన్సీలకు మాత్రమే కాకుం డా రైతులు తమ ఉత్పత్తులను ఇతరులెవరికైనా అమ్ముకునేందుకు వీలు కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాల వల్ల వ్యవసాయోత్పత్తుల స్వేచ్ఛా రవాణాపై ఇప్పటి వరకూ ఉన్న ఆంక్షలు తొలగిపోతాయి. ఫలితంగా రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు మార్కెట్‌ ఖర్చులు తగ్గుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉత్పత్తులను అమ్ముకునే రైతులపై ఎలాంటి సెస్‌ కానీ, లెవీ కానీ ఉండదని, వివాదాలను పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించాయి. రైతులు స్థిరమైన ఆదాయం పొందేందుకు ఈ ఆర్డినెన్స్‌ ఉపయోగపడుతుందన్నాయి. ఉపకరణాల వ్యయం కంటే 50ు అధికంగా కనీస మద్దతు ధరను నిర్ణయించాలన్న స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసును కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తోమర్‌ చెప్పారు. రైతులు ఇకపై ఎగుమతిదారులు, పెద్ద రిటైల్‌, హోల్‌సేల్‌ వ్యాపారులు, ఉత్పత్తిదారులకు వ్యాపారులకు మధ్య సంధానకర్తగా వ్యవహరించేవారు, పెట్టుబడిదారులతో స్వేచ్ఛగా చర్చలు జరుపుకునేందుకు వీలుగా కేంద్రం మరో ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఈ మేరకు ధరల హామీ, రైతు సేవలపై ఒప్పందం కుదుర్చుకునేందుకు రైతుల (సాధికారికత, పరిరక్షణ) ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు స్వేచ్ఛగా తరలించేందుకు వీలుగా వ్యవసాయ రంగంలో ప్రైవేట్‌ పెట్టుబడులు వస్తాయని తోమర్‌ తెలిపారు. తాజా ఆర్డినెన్స్‌ల వల్ల ఆహార ఉత్పత్తుల వృథా తగ్గిపోవడంతో పాటు దళారులతో సంబంధం లేకుండా రైతులు నేరుగా మార్కెటింగ్‌ జరిపేందుకు అవకాశం లభిస్తుందన్నారు.  


Updated Date - 2020-06-04T07:03:00+05:30 IST