మాయమైన బియ్యంలో కేంద్ర కోటా!

ABN , First Publish Date - 2021-12-02T06:37:51+05:30 IST

కైకలూరు నుంచి దారిమళ్లిన బియ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

మాయమైన బియ్యంలో కేంద్ర కోటా!
స్టాక్‌ పాయింట్‌ దగ్గర ఆందోళన చేస్తున్న డీలర్లు

అధికారుల పరిశీలనతో వెలుగులోకి

కేంద్ర విజిలెన్స్‌ బృందాలు రంగంలోకి దిగాలి

ఆందోళన  బాట పట్టిన రేషన్‌ డీలర్లు 


కైకలూరు నుంచి దారిమళ్లిన బియ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఇప్పుడు డీలర్ల మెడకు చుట్టుకొంటోంది. సరుకు ఇవ్వకముందే సంతకాలు చేసిన నేరానికి డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. ఆరు నెలలుగా రేషన్‌ బియ్యం సక్రమంగా అందడం లేదంటూ పలువురు కార్డుదారులు నిలదీస్తుండడం.. మరోపక్క బియ్యం దిగుమతి చేసుకోకపోయినా సంతకాలు చేసినందున తామే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో మూడు మండలాల రేషన్‌ డీలర్లు ఆందోళన బాట పట్టారు.


(ఆంధ్ర జ్యోతి, విజయవాడ / కైకలూరు) : కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ పరిధిలో చోటుచేసుకున్న భారీ బియ్యం స్కామ్‌ కారణంగా కలిదిండి, కైకలూరు, మండవల్లి మండలాలకు చెందిన పేద ప్రజలు నిత్యావసరాలను అందుకోలేకపోతున్నారు. ప్రస్తుతం సెప్టెంబరు, అక్టోబరు నెలల రేషన్‌ గురించి మాత్రమే చర్చ జరుగుతున్నా.. ఆరు నెలలుగా ఈ మూడు మండలాల ప్రజలు పూర్తిస్థాయిలో నిత్యావసరాలను అందుకోవటం లేదని తెలుస్తోంది. నిత్యావసరాలను ఎందుకు పంపిణీ చేయటం లేదంటూ కార్డుదారులు రేషన్‌ డీలర్లను నిలదీస్తున్నారు. మరోపక్క బియ్యం దిగుమతి చేసుకోకపోయినా ముందస్తుగా సంతకాలు చేసిన పాపానికి తామే బాధ్యతవహించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో మూడు మండలాల డీలర్లు ఆందోళనబాట పట్టారు. స్టాక్‌ పాయింట్‌ దగ్గర, ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. రోడ్డెక్కుతున్నా సమస్య పరిష్కారం కావటం లేదని వాపోతున్నారు.


నెల నుంచి మా సమస్య తేలటం లేదు 

కైకలూరు పాయింట్‌ ద్వారా మా మండలానికి వేలాది బస్తాల రేషన్‌ రావాలి. ప్రశ్నిస్తే సంతకాలు చేశారని అంటున్నారు. సంతకాలు చేయించుకుని, సరుకు ఇవ్వకపోతే బాధ్యత మాది ఎలా అవుతుంది? గోడౌన్‌లో భారీ అక్రమం జరిగింది. డీలర్లకు న్యాయం చేయాలి. - కాగితాల నాగరాజు , కలిదిండి మండల డీలర్ల అధ్యక్షుడు 


కార్డుదారుల ఒత్తిడిని భరించలేకపోతున్నాం

సెప్టెంబరు, అక్టోబరు నెలలకుగానూ 30 టన్నుల రేషన్‌ రావాలి. కేంద్ర కోటా బియ్యాన్ని ఇంతవరకు ఇవ్వలేదు. కార్డుదారులకు సమాధానాలు చెప్పుకోలేక పోతున్నాం. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశాం. విచారణ జరుగుతోందని చెబుతున్నారు.   - జల్లూరు వెంకన్న, డీలర్‌, పందిరిపల్లిగూడెం

Updated Date - 2021-12-02T06:37:51+05:30 IST