మత్స్యకారులకు కేంద్రం చేయూత

ABN , First Publish Date - 2022-01-20T04:34:49+05:30 IST

మత్స్య సంపదను మరింత పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా నడుం బిగించినట్లు కనిసిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఆర్థిక సాధికారిత కల్పించేందుకు ప్రతీ ఏటా ఉచితంగా చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

మత్స్యకారులకు కేంద్రం చేయూత

- చేపల ఉత్పత్తి పెంచేందుకు సరికొత్త పథకం  

- పీఎంఎంఎస్‌వై పేరుతో ఆర్థిక చేయూత

- చేపల చెరువుల నిర్మాణానికి రాయితీలు

- ఎనిమిది కేటగీరీల్లో యూనిట్లు మంజూరు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

మత్స్య సంపదను మరింత పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా నడుం బిగించినట్లు కనిసిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఆర్థిక సాధికారిత కల్పించేందుకు ప్రతీ ఏటా ఉచితంగా చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంతేకాదు మత్స్యకారులకు చేపల రవాణాకోసం వాహనాలను అందజేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా చేపల వేటను వృత్తిగా కొనసాగిస్తూ జీవనోపాధి సాగిస్తున్న జాలర్లతోపాటు చేపల పెంపకాన్ని చేపట్టేందుకు ఇతర వర్గాలకు కూడా చేయూతనందించాలని నిర్ణయించింది. ఇందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పేరిట సరికొత్త పథకాన్ని ప్రకటించింది. ఇందులో చెరువులు, కుంటలు మొదలుకొని కొత్తగా చెరువుల తవ్వకం, అలంకరణ చేపల పెంపకం, కోల్డ్‌ స్టోరేజీ, రీసైక్లింగ్‌ ఆఫ్‌ ఆక్వా సిస్టం వంటి యూనిట్ల ఏర్పాటుకు భారీగా రాయితీలను ప్రకటించింది. తద్వారా దేశంలో పెరుగు తున్న డిమాండుకు తగ్గట్టుగా చేపల దిగుబడులు పెంచడం, మార్కెటింగ్‌ సదుపాయాలను మెరుగుపరచడం వంటి కీలకమైన అంశాలపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి 2022-23ఆర్థిక సంవత్సరాలకు గాను అన్ని జిల్లాలనుంచి ఈ పథకం కోసం కార్యాచరణ తయారు చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. గతంలోనే ఇందుకు సంబంధించి ఉత్తర్వులిచ్చినా తాజాగా మరిన్ని మార్పులు చేర్పులతో ఈ పథకాన్ని విస్తరించి దరఖాస్తులను స్వీకరిస్తోంది.  

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకానికి రైతులు, చేపల పెంపకందారులు అర్హులు. ఈ  పథకంలో భాగంగా చెరువులు, హేచరీలు, దాణా తయారీ యంత్రాలు, నాణ్యతపరీక్షా కేంద్రాలు,  తదితర మౌళిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా చేపల పెంపకం, వాటిరక్షణ కోసం ఏర్పాట్లు కూడా చేస్తారు. కొత్తమార్కెట్‌ అవకాశాలు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టనున్నారు. రైతులకు రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్‌, బయోఫ్లోక్‌, అక్వా ఫోనిక్స్‌, ఫిష్‌ ఫీడ్‌ మెషీన్లు, ఎయిర్‌ కండిషన్డ్‌ వెహికల్స్‌, ఫిష్‌కీపింగ్‌ లాంటివి సమకూరుస్తారు. దీనిద్వారా రైతులకు ప్రత్యేక ప్రయోజనాలు ఒనగూరనున్నాయి. కేజ్‌ కల్చర్‌ విధానంలో చేపలసేద్యం, రంగురంగుల చేపల ఉత్పత్తి, ప్రమోషన్‌ అండ్‌ బ్రాండింగ్‌, ఫిష్‌కీపింగ్‌ లాంటి ప్రయోజనాలు అందేలా చర్యలు చేపడతారు. 

లబ్ధిదారులు వీరే

జిల్లాలో అర్హులైన లబ్ధిదారుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మత్స్యకారులు, మత్స్య కృషీవలురు, మత్స్య రంగ కార్మికులు, చేపల విక్రయదారులు, మత్స్య సహకార సంఘాలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ప్రైవేటు వ్యక్తులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోనే వెసులు బాటు కల్పించారు. చేపల చెరువుల నిర్మాణం, చేపల ఉత్పత్తి, ఫిష్‌ ప్రాసెసింగ్‌, చేపల మార్కెటింగ్‌ రంగాల్లో అసక్తి, సామర్థ్యం కల్గినయువతీ, యువకుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతోపాటు దరఖాస్తులను జిల్లా మత్స్య శాఖాధికారి కార్యాల యంలో ఈనెల 20లోపు అందించడానికి గడువుగా నిర్ణయించారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద వివిధ కేటగిరీల్లో 40శాతం నుంచి 60శాతం వరకు రాయితీలను నిర్ణయించారు. ఇతర వర్గాల వ్యక్తులకు 40శాతం, ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు 60శాతం రాయితీని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.

ఎనిమిది రకాల యూనిట్లు

అసిఫాబాద్‌ జిల్లాలో ఈ పథకం కింద ఎనిమిది రకాల యూనిట్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఆసక్తిగల యువతీ యువకులు దరఖాస్తు చేసుకునే వీలును కల్పించింది. రూ.25లక్షలతో మంచినీటి చేపల హెచరీలు, రూ. రూ.11లక్షలుచేపల చెరువు నిర్మాణానికి, రూ.25లక్షలతో రిసర్క్యూలేటరీ ఆక్వా కల్చర్‌ సిస్టమ్‌, రూ.3లక్షలతో జలాశయాల్లో కేజ్‌ కల్చర్‌కు, రూ.20 లక్షలతో ఇన్సూలేటెడ్‌ వాహనాల సరఫరా, రూ.3లక్షలతో త్రీవీలర్స్‌, రూ.30 లక్షలతో చిన్న తరహా చేపల దాణా మిల్లుల ఏర్పాటు, రూ.10లక్షలతో మొబైల్‌ ఫిష్‌ ఔట్‌లెట్స్‌ను ఏర్పాటుకు రుణాలను అందించనున్నారు. ఇందులో లబ్ధిదారుల వాటా 60శాతం ప్రభుత్వ సబ్సీడీ 40శాతంగా నిర్ణయించారు.

దరఖాస్తు విధానం

జిల్లాలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. చేపల రైతులు, చేపల విక్రయదారులు, స్వయం సహాయక సంఘాలు, చేపల వ్యాపారులు, రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసు కోవచ్చు. దీనిని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులైన వ్యక్తుల దరఖాస్తులను జిల్లాస్థాయిలో ఎంపిక చేస్తారు. వారిపేర్లను రాష్ట్ర స్థాయిలో పంపి యూనిట్స్‌ను మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటారు. పథకానికి సంబందించి మరిన్ని వివరాలను పొందడానికి జిల్లా మత్స్యశాఖాధికారి కార్యాలయంలో గానీ, 9494319715 అనే మొబైల్‌ నంబర్‌కు ఫోన్‌ ద్వారా సంప్రదించే అవకాశాన్ని కల్పించారు.

Updated Date - 2022-01-20T04:34:49+05:30 IST