పెట్రో ధరల తగ్గింపుపై కేంద్రంలో సంప్రదింపులు

ABN , First Publish Date - 2021-10-19T07:14:05+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించ డంపై ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి....

పెట్రో ధరల తగ్గింపుపై కేంద్రంలో సంప్రదింపులు

రాష్ట్రాలూ కొంత వదులుకోవాలని సూచన

పెట్రో దోపిడీపై పోరాటమేదీ?: యశ్వంత్‌సిన్హా


న్యూఢిల్లీ, అక్టోబరు 18: పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించ డంపై ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ధరలు తగ్గించాల్సి వస్తే కేంద్రం వైపు నుంచే కాకుండా రాష్ట్రాల నుంచి కూడా జరగాల్సి ఉంటుందని చెప్పాయి. చమురు ఉత్పత్తుల ధరలు ఆల్‌టైం గరిష్ఠ స్థాయికి చేరి, మరింత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా సంకేతాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సౌదీ అరేబియా, రష్యా తదితర చమురు ఉత్పత్తి దేశాలతో భారత పెట్రోలియం శాఖ సంప్రదింపులు జరుపుతూ ధరలు తగ్గించడం కోసం తన వంతు ప్రయత్నం చేస్తోందని కేంద్ర ప్రభుత్వం వర్గాలు వెల్లడించాయి.  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు హైదరాబాద్‌లో 110, 103 రూపాయల చొప్పున పలుకుతున్నాయి.


దేశంలో పెట్రోల్‌ ధరలు విమాన ఇంధనం ధర కన్నా 33 శాతం అధికంగా ఉన్నాయి. విమాన ఇంధనం లీటర్‌ రూ.79 మాత్రమే.  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ కూడా చమురు ధరలు పెరుగుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యం, రోడ్లు, ఇతర మౌలిక వసతుల పెట్టుబడులపైనే ప్రభుత్వం ప్రధానం గా నిధులను ఖర్చు పెడుతుందని వివరించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆమె కొవిడ్‌ వ్యాక్సిన్‌ ముడి సరుకు దిగుమతిలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. కాగా, దేశంలో పెరుగుతున్న చమురు ధరలపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా స్పందించారు. ‘‘దేశ ప్రజలు మృతప్రాయులు  అయ్యారు. రోజూ అన్యాయంగా పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు పెంచుతుంటే ప్రపంచంలో ఏ దేశ ప్రజలూ ఇలా సహించరు. 2014లో చమురుపై వసూలు చేసిన పన్ను రూ.75 వేల కోట్లు కాగా, ఇప్పుడు 3.5 లక్షల కోట్లు వసూలు చేస్తున్నారు. ఇది పట్టపగలు దోపిడీ కాదా?’’ అని ప్రశ్నించారు. 


పన్ను దోపిడీ చేస్తున్న బీజేపీ ప్రభుత్వం: రాహుల్‌

పెట్రో ధరలను ఇష్టానుసారంగా పెంచుతూ బీజేపీ ప్రభుత్వం పన్ను దోపిడీకి పాల్పడుతోందని కాంగ్రెస్‌  నేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. ఇంధన ధరలు విమానాల్లో వాడే ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌) ధరలకు మించి ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ స్నేహితుల ప్రయోజనాల కోసం మోసపోతున్న ప్రజల వెంట తానుంటానని సోమ వారం ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇప్పటికైనా పన్ను దోపిడీని ఆపేయాలని డిమాండ్‌ చేశారు. సాధారణ ప్రజలు సైతం విమానా ల్లో ప్రయాణించేలా చేస్తామని బీజేపీ ప్రభు త్వం హామీ ఇచ్చిందని, ఇప్పుడు మధ్య తరగతి ప్రజలు సైతం రోడ్డుపైనా ప్రయాణించలేని పరిస్థితి నెలకొందని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ట్విటర్‌లో విమర్శించారు.

Updated Date - 2021-10-19T07:14:05+05:30 IST