సెంటు మాన్యం భూమి కూడా చేజారకూడదు

ABN , First Publish Date - 2021-01-19T07:08:00+05:30 IST

జిల్లాలోని మాన్యం భూముల్లో సెంటు కూడా చేజారకూడదని దేవదాయ, ధర్మదాయ శాఖ జాయింట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ పేర్కొన్నారు.

సెంటు మాన్యం భూమి కూడా చేజారకూడదు
మాట్లాడుతున్న చంద్రశేఖర్‌ ఆజాద్‌


దేవదాయ శాఖ జాయింట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌


అనంతపురం టౌన్‌, జనవరి 18: జిల్లాలోని మాన్యం భూముల్లో సెంటు కూడా చేజారకూడదని దేవదాయ, ధర్మదాయ శాఖ జాయింట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ పేర్కొన్నారు. గడువులోపు ప్రతి ఆలయానికి సంబంధించిన ఆస్తులను 43 రిజిస్టర్‌లో సక్రమంగా నమోదయ్యేలా చూడాలనీ, లేదంటే సంబంధిత సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు తప్పదని హెచ్చరించారు. దేవాలయాల రక్షణ చర్యలు, మాన్యం భూముల రీసర్వే అంశాలపై సోమవారం జిల్లాకేంద్రంలోని మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయ కల్యాణమండపంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్‌ ఆలయా ల్లో దాదాపుగా సీసీ కెమరాలు ఇప్పటికే ఉన్నాయనీ, శాఖ పరిధిలోని వాటిలో ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. దాతల సహకారంతో వెంటనే ఏర్పాటు చేయాలనీ, ప్రతి ఆలయంలోనూ ఇంటర్నెట్‌ సదుపాయముండేలా చూడాలన్నారు. దాతల సహకారం లేని ఆలయాలకు ప్రతిపాదనలు పంపితే శాఖ ద్వారా అందించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి ఆలయానికి ట్రస్టుబోర్డు కమిటీలు ఏర్పాటు చేయటంతోపాటు వాచ్‌మన్‌ను నియమించాలన్నారు. అన్ని మండలాల్లోనూ స్థానిక ఎస్‌ఐ, వీఆర్‌లతో కలిసి ఈఓలు తమ పరిధిలోని ఆలయాల రక్షణ చర్యలు చేపట్టాలన్నారు.


నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్‌ వేటు తప్పదు

మాన్యం భూముల రికార్డులను సిద్దం చేయటంలో నిర్లక్ష్యం వహించిన ఈఓలపై జాయింట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 43 రిజిస్టర్‌ అంటే ఏంటో కూడా తెలియని వారున్నారంటే ఉద్యోగం చేయడమెందుకని ప్రశ్నించారు. నెలాఖరులోపు రికార్డులను పూర్తి చేయాలన్నారు. మార్చి 1వ తేదీన జిల్లాకేంద్రంలో మరోసారి సమావేశం నిర్వహిస్తాననీ, అప్పటికీ నిర్లక్ష్యాన్ని వీడకపోతే సస్పెన్షన్‌ వేటు తప్పదన్నారు. ఈ క్రమంలోనే మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వరాలయ ఈఓ సుధారాణిపై కూడా జేసీ ఘాటుగా స్పందించారు. ఇటీవల ఈఓ సుధారాణి పదోన్నతిపై కర్నూ లు జిల్లాకు బదిలీ ఉత్తర్వులు పొందారు. సదరు ఈఓ ఆల య మాన్యం భూముల రికార్డులను పూర్తి చేసేవరకూ ఆమె ను రిలీవ్‌ చేయకూడదని ఏసీ రామాంజనేయులుకు సూచించారు. కార్యక్రమంలో కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓ వెంకటేశ్వరరెడ్డి, కసాపురం ఏఈఓ మధు, ఇన్‌స్పెక్టర్లు లక్ష్మీనారాయణ, నరసింహరాజు, ఈఓలు, మండల ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-19T07:08:00+05:30 IST