సెల్‌టవర్‌ బ్యాటరీలే టార్గెట్‌!

ABN , First Publish Date - 2020-06-04T10:02:14+05:30 IST

రిలయన్స్‌ సెల్‌ టవర్లకు అమర్చిన బ్యాటరీలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి ..

సెల్‌టవర్‌ బ్యాటరీలే టార్గెట్‌!

దొంగల ముఠా అరెస్టు

20 తులాల బంగారు, 39 బ్యాటరీలు స్వాధీనం


కూడేరు, జూన్‌ 3: రిలయన్స్‌ సెల్‌ టవర్లకు అమర్చిన బ్యాటరీలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆత్మకూరు సర్కిల్‌ సీఐ కృష్ణారెడ్డి, ఎస్‌ఐలు యువరాజ్‌, రాఘవరెడ్డి, జయపాల్‌రెడ్డి బుధవారం అరవకూరు క్రాస్‌ వద్ద 8 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వీరి నుంచి మొత్తం 25 తులాల బంగారు నగలు, 39 సెల్‌టవర్ల బ్యాటరీలు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక టాటాఏస్‌, తూఫాన్‌ వాహనాలతో పాటు రూ.5400 నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ముఠాను కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ కృష్ణారెడ్డి నిందితుల వివరాలను వెల్లడించారు. కూడేరు మండలం కడదరకుంట గ్రామానికి చెందిన రంజిత్‌కుమార్‌ రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ టవర్లలో సూపర్‌వైజర్‌గా పనిచేసేవాడు. ప్రస్తుతం పనులు నిలిపివేయడంతో ప్రైవేట్‌ కారు డ్రైవర్‌గా పనిచేసుకుంటున్నాడు.


జల్సాలకు అలవాటుపడ్డ రంజిత్‌ జల్సాలను తీర్చుకునేందుకు దొంగతనాలను మార్గంగా ఎంచుకున్నాడు. దీంతో తన మిత్రులైన అనంతపురం నగరంలోని నందమూరినగర్‌కు చెందిన జయరాములు, కనగానపల్లి మండలం తగరకుంటకు చెందిన షేక్‌ రహంతుల్లా, గొల్ల ఽధనుంజయ యాదవ్‌, కనగాపల్లికి చెందిన బట్టా మహేష్‌, యల్లనూరు మండలం వేములపల్లికి చెందిన తప్పెట నగేష్‌, అనంతపురం రూరల్‌ మండలం రుద్రంపేటకు చెందిన షేక్‌ సిరాజ్‌, పాపంపేటకు చెందిన ఎద్దులపల్లి శీనాలతో కలిసి దొంగతనాలకు పాల్పడేవారు. అలా దొంగలించిన సొమ్ముతో 20 తులాల బంగారు, వాహనాలు కొనుగోలు చేశారు. ఆ వాహనాల్లోనే దొంగలించిన బ్యాటరీలను అమ్మడానికి బళ్లారికి వెళ్తుండగా అనంతపురం-బళ్లారి ప్రధాన రహదారి అరవకూరు వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2020-06-04T10:02:14+05:30 IST