భక్తిశ్రద్ధలతో మొహర్రం వేడుకలు

ABN , First Publish Date - 2022-08-09T05:30:00+05:30 IST

మొహర్రం వేడుకలను మండలంలోని ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మండలంలోని తుమ్మలచెరువు, తర్లుపాడు, పోతలపాడు, గొల్లపల్లిలో నిర్వహించారు. నెలపొడుపు మొదలుకొని పదిరోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో మొహర్రం వేడుకలు
పీర్లకు మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు


తర్లుపాడు, ఆగస్టు 9: మొహర్రం వేడుకలను మండలంలోని ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మండలంలోని తుమ్మలచెరువు, తర్లుపాడు, పోతలపాడు, గొల్లపల్లిలో నిర్వహించారు. నెలపొడుపు మొదలుకొని పదిరోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున తుమ్మలచెరువులో అంగరంగ వైభవంగా పెద్దషరిగెత్‌ కార్యక్రమం నిర్వహించారు. మొక్కులు తీర్చుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా నెల్లూరు, కర్నూలు, కడప, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తుమ్మలచెరువు గ్రామానికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఇక్కడికి ఎక్కువగా సంతానం లేనివారు, ధీర్ఘకాలిక వ్యాధుల బారినపడిన వారు మొక్కులు తీర్చుకునేందుకు వస్తుంటారు. తుమ్మలచెరువు అగ్ని గుండంలో అత్యధికంగా కొబ్బెరచిప్పలను వేస్తారు. దర్గాల కొలువుదీరన పీర్లకు పట్టువస్త్రాలు, వెండి గొడుగులు అలంకరించి అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద షరిగెత్‌ కార్యక్రమానికి సుమారు 50 వేల మంది భక్తులు పీర్లను దర్శించుకున్నట్లు ముజావర్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం పీర్లను మండలంలోని తుమ్మలచెరువు, తర్లుపాడు, పోతలపాడు, గొల్లపల్లి గ్రామాలలో సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించి నీళ్లల్లో ముంచుతారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పొదిలి, కొండెపి సీఐలు సుధాకర్‌బాబు, ఎం.శ్రీనివాస్‌లు తాడివారిపల్లి పొదిలి, దర్శి ఎస్‌ఐలు ముక్కంటి, శ్రీహరి,  రామకృష్ణల ఆధ్వర్యంలో 50 మంది కానిస్టేబుళ్లతో భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

గిద్దలూరు : మండలంలోని ముండ్లపాడు, తాళ్లపల్లి గ్రామాల్లో జరిగిన మొహర్రం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. తాళ్లపల్లిలో పీర్లను ఆయన దర్శించుకుని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. కార్యక్రమంలో  టీడీపీ మండల అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి షెక్షావలి, టీడీపీ నాయకులు హుస్సేన్‌ఖాన్‌, షేర్‌ఖాన్‌, నాగూర్‌, వెంకటేశ్వర్లు, కిరణ్‌గౌడ్‌, మౌలాలి పాల్గొన్నారు.

మార్కాపురం(వన్‌టౌన్‌) : మొహర్రం వేడుకలను పురష్కరించుకొని మార్కాపురం పట్టణంలో మంగళవారం ఉదయం పెద్ద షరగత్‌ సాయంత్రం షహాదత్‌ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద షరగత్‌ పురష్కరించుకొని గొర్లగెడ్డ తూర్పువీధి పీర్లు సలాలములు తెలుపుకున్నాయి. విజయటాకీస్‌,  ఆకులవారి వీధి, కాలువకట్ట, కొండారెడ్డి కాలనీ ప్రాంతాల పీర్లు కూడా వీధులలో ఉత్సవం నిర్వహించారు. రాత్రి ప్రత్యేకంగా అలంకరించిన చాందిరలలో గొర్లగడ్డ బాదుల్లా సాహెబ్‌, తూర్పువీధి చిన్నబాదుల్లా సాహెబ్‌ పీర్లకు ఘనంగా షహదత్‌ నిర్వహించారు. గుండ్లకమ్మ నదిఒడ్డన పీర్ల నాలుకలను నీళ్లల్లో ముంచి చొంగరొట్టె, పెరుగుబుత్తిలను భక్తులకు ప్రసాదంగా అందజేశారు. పీర్లను పెట్టెలలో భద్రపరిచారు.

 ఎర్రగొండపాలెం : మండలంలో మొహర్రం పండుగ సందర్భంగా పీర్ల పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. మొక్కులు ఉన్న భక్తులు కొత్తగా తయారు చేసిన పీర్లను చావిడివద్దకు చేర్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలనుంచి పీర్లచావిడిలో పూజలు అందుకొన్న పీర్లతో భక్తులు బయలుదేరి గ్రామంలో ఊరేగించారు. గురిజేపల్లి గ్రామంలో అన్ని సామాజక కలసి పీర్ల పండుగను ఘనంగా నిర్వహించారు. మండలంలో వీరభద్రాపురం, కొలుకుల, ఎర్రగొండపాలెం, గుర్రపుసాల, గంగుపల్లి గ్రామాల్లో మొహర్రం సంధర్బంగా పీర్ల పండుగను భక్తులు నిర్వహించారు.పీర్లను ఎత్తుకొన్న భక్తులు అగ్నిగుండంలో నిప్పులపై నడవడం ప్రత్యేక ఆకర్షణంగా ఉంటుంది. గ్రామంలో సాయంత్రం 6 గంటలకు వరకు పీర్లను గ్రామంలోప్రధర్శన చేసి గ్రామశివారులోని నీటిగుండంలో పీర్లను స్నానం చేయించారు. గురిజేపల్లి, కొలుకుల, వీరభద్రాపురం గ్రామాల్లో భక్తులు అధికంగా ఉండడంతో ఈ పండుగను ప్రత్యేకంగా బంధువులతో కలసి నిర్వహించారు.

రాచర్ల : ముస్లింలు అన్ని గ్రామాల్లో మొహర్రం పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మంగళవారం మొహరం షహదత్‌ సందర్భంగా అనుమలవీడు, ఆకవీడు గ్రామాలలో చావిడి నుంచి పీర్లను ఊరేగింపు నిర్వహించారు. అనుమలవీడులో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్‌రెడ్డి, పిడతల ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పిడతల అభిషేక్‌రెడ్డి, పల్నాటి మహబూబ్‌పీరా, శారద, గ్రామస్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-09T05:30:00+05:30 IST