Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

వజ్రోత్సవం

twitter-iconwatsapp-iconfb-icon
వజ్రోత్సవంజెండా వందనం చేస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ, కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

వైభవంగా స్వాతంత్య్ర సంబరాలు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి/ కలెక్టరేట్‌, ఆగస్టు 15)

స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ.. మువ్వన్నెల పతాకం మురిసింది. అజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా స్వాతంత్య్ర వేడుకలకు వేదికైన శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాల మైదానం పులకించింది. అణువణువునా స్వాతంత్య్ర స్ఫూర్తి పరిఢవిల్లింది. దేశభక్తిని చాటుతూ... సిక్కోలు కీర్తిని వర్ణిస్తూ సాగిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ప్రభుత్వ శాఖల ప్రకటనలు ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల కళాశాల క్రీడా మైదానంలో 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు అలరించాయి. పోలాకికి చెందిన కస్తూర్బా పాఠశాల విద్యార్థుల నృత్యప్రదర్శన ప్రథమ స్థానంలో నిలిచింది. శ్రీకాకుళంలోని టీపీఎం, ఆర్‌సీఎం లైలా పాఠశాలల విద్యార్థుల ప్రదర్శనలు ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించాయి. న్యూ టింపనీ విద్యార్థుల నృత్యప్రదర్శనకు కన్సోలేషన్‌ బహుమతి దక్కింది.  న్యూసెంట్రల్‌ స్కూల్‌, కల్లేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రఘుపాత్రుని శ్రీకాంత్‌ కళా బృందం నృత్యపదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఆకట్టుకున్న శకటాలు, స్టాల్స్‌ పదర్శనలు
ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు, స్టాల్స్‌ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి 13 శకటాలు ప్రదర్శించగా.. వైద్యఆరోగ్యశాఖకు ప్రథమ స్థానం దక్కింది. పౌరసరఫరాల శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ శకటాలు ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచాయి. రెడ్‌క్రాస్‌ ద్వారా అందించిన వైద్యసేవలు, రక్తసేకరణ ప్రదర్శనలు, అగ్నిప్రమాదాల నివారణ చర్యల ప్రదర్శనలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ, మత్స్యశాఖ, విద్యాశాఖ, ఉద్యానవనశాఖ, గిరిజన సహకార సంస్థ, విపత్తులు అగ్నిమాపక శాఖతో పాటు ఐ.సి.డి.ఎస్‌, విద్యుత్‌, సూక్ష్మనీటిపారుదలశాఖ, సర్వే అండ్‌ ల్యాండ్‌ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ ఆకట్టుకున్నాయి. విజేతలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ చేతులమీదుగా బహుమతులు అందజేశారు.  

సమరయోధుల కుటుంబ సభ్యులకు సత్కారం
స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను మంత్రి బొత్స సత్యనారాయణ సన్మానించారు. కోటబొమ్మాళి మండలం తిలారు గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు అప్పలరామయ్య భార్య అప్పలనరసమ్మ, చిట్యాలవలస, నిమ్మాడ గ్రామాలకు చెందిన కరుకోల రాజన్న భార్య జయలక్ష్మిలను ఘనంగా సత్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.

ప్రగతిపథంలో..
జిల్లా సమగ్రాభిృద్ధికి కట్టుబడి ఉన్నాం
జిల్లా ఇన్‌చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ప్రగతిపథంలో నడిపిస్తున్నామని  ఇన్‌చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో సోమవారం జాతీయ జెండాను మంత్రి బొత్స సత్యనారాయణ ఆవిష్కరించారు. ఆయనతో పాటు కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌, ఎస్పీ జీఆర్‌ రాధిక జెండా వందనం చేశారు. ముందుగా సాయుధ బలగాల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ  మాట్లాడుతూ.. ‘ప్రజలకు స్వచ్ఛమైన, అవినీతిరహిత పాలనను అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. రైతుభరోసా, పీఎం కిసాన్‌ పథకం కింద మూడు లక్షల మంది రైతులకు రూ.201 కోట్లు అందించాం. వంశధార నిర్వాసితులతో పాటు తితలీ బాధితులకు అదనపు పరిహారం అందించాం. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఫిషింగ్‌ హార్బర్‌, వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం. వంశధార ఫేజ్‌-2 రిజర్వాయర్‌ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. నారాయణపురం ఆనకట్ట, వంశధార కరకట్టల నిర్మాణంపై దృష్టి సారించాం. జిల్లాలో జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష కార్యక్రమాల నిర్వహణ చురుగ్గా జరుగుతోంది. నవరత్నాల్లో భాగంగా 83,456 మందికి ఇళ్ల పట్టాలు అందించాం. అమృత్‌ సరోవర్‌ పథకం కింద జిల్లాలో 75 చెరువుల అభివృద్ధితో పాటు వైఎస్‌ఆర్‌ జలకళ పథకం ద్వారా 246 బోర్లు ఉచితంగా వేశాం. జిల్లాలో రోడ్ల అభివృద్ధి, మరమ్మతులకు రూ.735 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. 51 రోడ్ల పనులకుగాను ప్రత్యేక మరమ్మతుల కింద  రూ.73కోట్లు మంజూరు చేశాం. 548 వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణానికి రూ.95కోట్లు వెచ్చించాం. ఉద్దానంలో తాగునీటి పథకానికి రూ.700 కోట్లతో పనులు చేపడుతున్నామ’ని తెలిపారు.  కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్‌, గొర్లె కిరణ్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, జేసీ విజయసునీత, డీఆర్డీఏ పీడీ శాంతిశ్రీ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.