మండలానికో కొబ్బరి ఆధారిత పరిశ్రమ

ABN , First Publish Date - 2022-09-29T05:49:58+05:30 IST

ఫుడ్‌ ప్రోసెసింగ్‌ సొసైటీల ద్వారా మండలానికో కొబ్బరి ఆధారిత పరిశ్రమను నెలకొల్పి కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. జిల్లా స్థాయి ఫుడ్‌ ప్రోసెసింగ్‌ సొసైటీ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించారు.

మండలానికో కొబ్బరి ఆధారిత పరిశ్రమ
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

  • జిల్లా స్థాయి ఫుడ్‌ ప్రోసెసింగ్‌ సొసైటీ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ హిమాన్షు శుక్లా  ప్రకటన

అమలాపురం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఫుడ్‌ ప్రోసెసింగ్‌ సొసైటీల ద్వారా మండలానికో కొబ్బరి ఆధారిత పరిశ్రమను నెలకొల్పి కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. జిల్లా స్థాయి ఫుడ్‌ ప్రోసెసింగ్‌ సొసైటీ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఫుడ్‌ ప్రోసెసింగ్‌ సెక్టార్‌ అభివృద్ధికి ప్రభుత్వం నోడల్‌ ఏజన్సీ ఏర్పాటు చేసిందన్నారు. వ్యవసాయం, ఉద్యానవన, మార్కెటింగ్‌, పశుసంవర్థక, ఖాదీ శాఖలతో సహా అనుబంధ రంగాలకు బాధ్యత వహిస్తార న్నారు. ప్రధానంగా రైతుల ఆదాయ స్థాయిని మెరుగుపరిచి స్థిరీకరించడం, దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు ఆహార ప్రోసెసింగ్‌ రంగాన్ని ఆకర్షణీయంగా మార్చడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తామన్నారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఫుడ్‌ ప్రోసెసింగ్‌ పరిశ్రమ పోటీతత్వాన్ని పెంపొందించడం కోసం ఈ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఉత్పత్తి యూనిట్‌కు గరిష్ఠంగా రూ.10లక్షల వరకు సహాయం అందుతుంది. దీంతో పాటు మార్కెటింగ్‌, బ్రాండింగ్‌ చేయాలనుకుంటే 50శాతం సబ్సిడీతో సహాయం లభిస్తుందన్నారు. ఈ పథకాన్ని ఫుడ్‌ ప్రోసెసింగ్‌ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుందని, దీనికింద చిన్న చిన్న ఫుడ్‌ ప్రోసెసింగ్‌ పరిశ్రమలు, గొడౌన్లు, కోల్డ్‌ స్టోరేజ్‌, ప్యాకింగ్‌ కేంద్రాలు సహా వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధికి 35శాతం క్రెడిట్‌ లింక్డ్‌ క్యాపిటల్‌ సబ్సిడీ ద్వారా సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఫుడ్‌ ప్రోసెసింగ్‌ సొసైటీ జనరల్‌ మేనేజర్‌ కేజే మారుతి, నాబార్డు డీడీఎం డాక్టర్‌ వైఎస్‌ నాయుడు, డీఆర్డీఏ పీడీ శివశంకరప్రసాద్‌, మెప్మా పీడీ ప్రియంవద, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్‌ శివరామ్‌ ప్రసాద్‌, ఉద్యానవన శాఖ అధికారి మల్లికార్జునరావు, జేడీలు వై.ఆనందకుమారి, డాక్టర్‌ ఎ.జైపాల్‌, షేక్‌లాల్‌ మహ్మద్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

రైతు ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఫుడ్‌ ప్రోసెసింగ్‌ సొసైటీలను ఏర్పాటు చేసినట్టు కోనసీమ జిల్లాలో అమలాపురం రెవెన్యూ డివిజనకు రిసోర్స్‌పర్సనగా నియమితురాలైన చిత్రి రమ్య తెలిపారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, మెప్మా సంఘాలు ఈ తరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తే పూర్తిస్థాయిలో  సహకారం అందిస్తామన్నారు. రామచంద్రపురం డివిజనకు సంబంధించి రిసోర్స్‌పర్సనగా కొప్పన స్వామి నియమితులు కాగా పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన చేయూత అందిస్తామన్నారు. ఆయా డివిజన్లలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు రమ్య సెల్‌: 9154851969, కొప్పన స్వామి, సెల్‌: 9553734469 సంప్రదించాలి.


Updated Date - 2022-09-29T05:49:58+05:30 IST