మసకబారిన కళ్లకు ఆసరా

ABN , First Publish Date - 2022-07-04T05:00:07+05:30 IST

‘నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామానికి చెందిన పోకల రాజయ్యకు 65 ఏళ్లు. కొన్నేళ్లుగా కళ్లు సరిగ్గా కనబడటం లేదు. సర్జరీ చేయించుకునే స్థోమత లేదు. తన పనులు తాను చేసుకోవడమే కష్టంగా మారింది. ఇటీవల క్యాంపులో పరీక్ష చేసి, ఎల్వీప్రసాద్‌ ఆస్పత్రిలో ఉచితంగా సర్జరీ చేయించారు. ఇప్పుడు కళ్లు బాగా కనబడుతుండటంతో ఆయన ఎవరిపైనా ఆధారపడకుండా తన పనులు చేసుకుంటున్నారు.’

మసకబారిన కళ్లకు ఆసరా
విజయవంతంగా కంటి ఆపరేషన్‌ పూర్తిచేసుకున్న ఆనందరంలో వృద్ధులు

కంటి సమస్యలతో బాధపడే వృద్ధులకు బాసట

ఎల్వీప్రసాద్‌, పుష్పగిరి ఆస్పత్రుల సౌజన్యం, సొంత ఖర్చులతో క్యాటరాక్ట్‌ సర్జరీలు చేయిస్తున్న మంత్రి హరీశ్‌

నియోజకవర్గంలో 10వేల మందికి ఆపరేషన్లే లక్ష్యం


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జూలై 3: ‘నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామానికి చెందిన పోకల రాజయ్యకు 65 ఏళ్లు. కొన్నేళ్లుగా కళ్లు సరిగ్గా కనబడటం లేదు. సర్జరీ చేయించుకునే స్థోమత లేదు. తన పనులు తాను చేసుకోవడమే కష్టంగా మారింది. ఇటీవల క్యాంపులో పరీక్ష చేసి, ఎల్వీప్రసాద్‌ ఆస్పత్రిలో ఉచితంగా సర్జరీ చేయించారు. ఇప్పుడు కళ్లు బాగా కనబడుతుండటంతో ఆయన ఎవరిపైనా ఆధారపడకుండా  తన పనులు చేసుకుంటున్నారు.’

వృద్దాప్యం కంటి సమస్యలు కుంగదీస్తాయి. ఓవైపు శరీరం సహకరించక.. మరోవైపు కళ్లు సరిగా కనబడక వృద్ధులు కుమిలిపోతారు. కంటి వైద్యం, సర్జరీలు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో పేదలు మసకబారిన కళ్లతోనే నెట్టుకొస్తున్నారు. తప్పనిసరై పనులు చేసుకునే క్రమంలో ప్రమాదలకుగురై   మంచం పడుతున్నారు. ఇలాంటి వారి కష్టాలు తీర్చడానికి రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో హెల్త్‌ క్యాంపులు నిర్వహించి, అవసరమైతే సర్జరీ చేయిస్తున్నారు. 


3,246 మందికి పరీక్షలు 

జిల్లాలోని చిన్నకోడూరు, నంగునూరు, కొండపాక, చేర్యాల, నారాయణరావుపేట మండలాల పరిధిలో 36 గ్రామాలు, సిద్దిపేట పట్టణంలోని మూడువార్డుల్లో క్యాంపులు నిర్వహించారు. ఇప్పటివరకు 3,246 మందికి క్యాటరాక్ట్‌ పరీక్షలు చేశారు. 1,081 మందికి సర్జరీ అవసరమని గుర్తించారు. ఇందులో 115 మందికి సర్జరీకి ఆరోగ్యం సహకరించదని గుర్తించారు. అర్హులకు సిద్దిపేట ఎల్వీప్రసాద్‌ కంటి ఆస్పత్రి, హైదరాబాద్‌లోని పుష్పగిరి కంటి ఆస్పత్రి సౌజన్యంతో ఉచితంగా సర్జరీలను చేస్తున్నారు. ఇప్పటివరకు 280 మందికి క్యాటరాక్ట్‌ సర్జరీ చేశారు. ఈ వారంలో 661 మందికి సర్జరీలు పూర్తిచేయనున్నారు. రెండో కంటికి సర్జరీ కూడా సర్జరీ అవసరమైతే మొదటి కంటికి చికిత్స చేసిన అనంతరం 28 రోజుల తర్వాత చేస్తున్నారు. అనంతరం ఉచితంగా కళ్లద్దాలు, మదులు ఇస్తున్నారు. 


పైసా ఖర్చు లేకుండా..

క్యాటరాక్ట్‌ సర్జరీ కోసం ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.15 వేల నుంచి రూ.20వేల వరకు ఖర్చవుతుంది. చాలామంది డబ్బులు లేక సర్జరీకి, కంటిచూపునకు దూరమవుతున్నారు. దీంతో మంత్రి హరీశ్‌రావు పైలెట్‌ ప్రాజెక్టుగా సిద్దిపేట నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి, అర్హులందరికీ సర్జరీలు చేయించాలని నిర్ణయించారు. సర్జరీ అవసరమైన వారిని ఎల్వీ ప్రసాద్‌, పుష్పగిరి కంటి ఆస్పత్రులకు పంపిస్తున్నారు. ఆస్పత్రుల సహకారం, సొంతంగా ఖర్చులతో ఉచితంగా వైద్యం అందజేస్తున్నారు. 


అన్ని పనులు చేసుకుంటున్న : ఆరె మల్లవ్వ, మల్యాల

నాకు కొన్నేండ్లుగా కండ్లు కనిపించ లేదు. కొద్ది దినాలు మసకగా కనిపించి ఆ తరువాత మొత్తమే చూపు పోయింది. హరీశ్‌రావు సార్‌ ఉచితంగా ఆపరేషన్‌ చేయించిండు. ఇప్పుడు ఇంట్ల పని చేస్తున్నా. బాయికాడికి కూడా పోతున్న. 


కండ్లు మంచిగ కనిపిస్తున్నయ్‌ : నాయిని ఎల్లయ్య, గోనెపల్లి

సొంతూళ్లనే మస్కూరి పనిచేసేదాన్ని. కొన్ని దినాల కిందట కండ్లన్ని మసకబారాయి. రోడ్డు మీద పోతుంటే ముందర ఉన్నది కూడా కనిపించకపోయేది. దీంతో మస్కూరి పని నా భార్య చేస్తున్నది. ఊళ్లో క్యాంపుల పరీక్షలు చేసి, ఆపరేషన్‌ చేయించారు. ఇప్పుడు కండ్లు మంచిగ కనబడ్తున్నయ్‌. 

Updated Date - 2022-07-04T05:00:07+05:30 IST