ప్రతీకాత్మక చిత్రం
టాయిలెట్ వల్ల సమస్య తలెత్తడమేంటీ.. అది కూడా కోర్టు వరకు వెళ్లడమేంటీ.. అని ఆశ్చర్యపోతున్నారా? కొన్నిసార్లు ఇలాగే ఊహించని ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. చిన్న చిన్న సమస్యలను కొందరు పెద్దవి చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన కూడా ఆ కోవకే చెందుతుంది. టాయిలెట్ ఫ్లషింగ్ శబ్ధాలు తమను ఇబ్బంది పెడుతున్నాయని, దీంతో తమకు నిద్రాభంగం కలుగుతోందని పక్కింటి వారిపై కోర్టులో కేసు వేశారు. రెండు దశాబ్దాల పాటూ సాగిన ఆ టాయిలెట్ ఫ్లషింగ్ కేసు అసలు విషయంలోకి వెళితే..
ఇటలీలో 19సంవత్సరాల క్రితం ఈ ఘటన జరిగింది. గల్ఫ్ ఆఫ్ పోయెట్స్‌లో రెండు కుటుంబాలు పక్క పక్కనే నివాసం ఉంటున్నాయి. అంతవరకూ ఏ సమస్య లేకున్నా.. మరుగుదొడ్డి వల్ల వారి మధ్య వివాదం మొదలైంది. ఒకరి ఇంట్లోని టాయిలెట్ గోడకు అవతల.. పక్కింటి వారి టాయిలెట్ ఉండడమే సమస్యకు కారణమైంది. టాయిలెట్ ప్లషింగ్ ట్యాంక్‌ను ఉపయోగించిన సమయంలో వచ్చే శబ్ధాలు.. గోడ అవతల పక్కింటి బెడ్‌రూంలో ఉన్న వారికి ఇబ్బంది కలిగించేవి. దీంతో రెండు కుటుంబాల మధ్య ఈ విషయమై గొడవలు జరిగేవి. చివరకు బాధితులు 2003లో కోర్టులో కేసు వేశారు. అయితే ఈ కేసుపై ఇటీవల కోర్టు తీర్పు ఇచ్చింది. బాధితులకు నష్టపరిహారం కింద సుమారు 10,000 యూరోలు(సుమారు రూ.8లక్షలు) నష్ట పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్త ఆ దేశంలో సంచలనం కలిగిస్తోంది.
ఇవి కూడా చదవండి