గురుకులంలో కరోనా బెల్స్‌

ABN , First Publish Date - 2021-08-04T04:20:59+05:30 IST

వర్గల్‌ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో కరోనా పాజిటివ్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. మంగళవారం వైద్య సిబ్బంది నిర్వహించిన టెస్టుల్లో 9 మంది విద్యార్థినులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో తోటి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

గురుకులంలో కరోనా బెల్స్‌
వర్గల్‌లోని గురుకులు డిగ్రీ కళాశాల

వర్గల్‌ మహిళా డిగ్రీ కళాశాలలో 9 మందికి పాజిటివ్‌

కళాశాలలో ప్రత్యేక గదిలో ఐసోలేషన్‌ 

ఆందోళన చెందుతున్న విద్యార్థినులు


వర్గల్‌, అగస్టు 3 : వర్గల్‌ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో కరోనా పాజిటివ్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. మంగళవారం వైద్య సిబ్బంది నిర్వహించిన టెస్టుల్లో 9 మంది విద్యార్థినులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో తోటి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 

మూడు రోజుల కిత్రం ఒక విద్యార్థికి శరిరంలో రక్తం శాతం తగ్గడం, కరోనా పాజిటివ్‌ రావడంతో వైద్య సిబ్బంది సూచనల మేరకు గురుకుల టీచర్లు ఆమెను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో గురుకులంలో ఉన్న విద్యార్థులు అందరిలో అలజడి చోటు చేసుకున్నది. దీంతో కళాశాలలో సోమ, మంగళవారం రెండురోజుల పాటు వర్గల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందితో కరోనా నిర్ధారణ టెస్టులు(ర్యాపిడ్‌) చేయించారు. ఇక్కడ 9 కోర్సులకు సంబంధించి 848 మంది విద్యార్థులు చదువుతున్నారు. రెండు రోజుల పాటు 560 మంది విద్యార్థులకు టెస్టు నిర్వహించారు. సోమవారం నిర్వహించిన టెస్టుల్లో ఐదుగురికిర, మంగళవారం నిర్వహించిన టెస్టుల్లో నలుగురికి మొత్తంగా 9 మంది విద్యార్థినులకు పాజిటివ్‌ వచ్చింది. దీంతో కళాశాలలోనే ఒక ప్రత్యేక గదిని ఐసోలేషన్‌ కోసం ఏర్పాటు చేశారు. వారిని అందులో ఉంచి కావలసిన మందులు, బలమైన ఆహార పదర్థాలను అందజేస్తున్నారు. గురుకులంలో కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం జారీ చేసిన నియమనిబంధనలు నిర్వాహకులు పాటించకపోవడంతోనే విద్యార్థినులకు వైరస్‌ సోకిందని తల్లిదండ్రులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో శానిటైజ్‌ సరిగ్గా చేయకపోవడం, పిల్లల కోసం వచ్చే తల్లిదండ్రులకు ఎలాంటి శానిటైజర్‌ అందజేయకుండా పంపించడం తదితర వాటితో కరోనా వ్యాపించిందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.


కళాశాలలోనే ఐసోలేషన్‌లో విద్యార్థులు

మహాత్మ జ్యోతిబాపూలే గురుకులంలో  చదువుతున్న 9 మంది విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చింది. వారందరికీ కళాశాలలోనే ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి వైద్య సిబ్బంది సూచనల మేరకు కావలసిన మందులు, ఆరోగ్యాన్ని పెంపోందించే ఆహారం అందిస్తున్నమన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థికి ఎటువంటి ప్రమాదం లేదు. 

- వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్‌ 


Updated Date - 2021-08-04T04:20:59+05:30 IST