రాబంధుల్లా..

ABN , First Publish Date - 2020-08-11T09:35:57+05:30 IST

రోనా కల్లోలం సృష్టిస్తుండగా.. దానిని కొందరు క్యాష్‌ చేసుకుంటున్నారు. కరోనాతో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలను ..

రాబంధుల్లా..

కరోనా మృతదేహాల తరలింపులో దోపిడీ

రూ.20 వేలు పైనే డిమాండ్‌ చేస్తోన్న వైనం

జీజీహెచ్‌లోని మహాప్రస్థానం వాహనాలు నిర్వీర్యం


గుంటూరు(సంగడిగుంట), ఆగస్టు 10: కరోనా కల్లోలం సృష్టిస్తుండగా.. దానిని కొందరు క్యాష్‌ చేసుకుంటున్నారు. కరోనాతో ఎవరైనా మరణిస్తే    వారి కుటుంబాలను తీవ్రంగా కలచి వేస్తోంది. అయితే కొందరు మాత్రం కనీస మానవత్వం లేకుండా దోపిడీనే పరమావధిగా ఆ మృతిని మార్చుకుంటున్నారు. చికిత్స కోసం వచ్చి వైద్యశాలలో మృతి చెందితే ఆ మృతదేహాన్ని తరలించాలంటే ఆయా కుటుంబాలకు పెనుభారంగా మారుతోంది. కుటుంబంలోని వ్యక్తి మృతితో మానసిక ఆందోళనతో ఉండే వారిపై కనికరం లేకుండా కొందరు రాబంధుల్లా వాలిపోతున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద వారం రోజులుగా ప్రారంభమైన ఈ దోపిడి సోమవారం పతాక స్థాయికి చేరింది. మహాప్రస్థానం కార్యక్రమం ద్వారా మృతదేహాలను జిల్లా పరిధిలో ఉచితంగా పంపాలి. ఈ కార్యక్రమం ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరుగుతున్నదీ లేనిదీ పర్యవేక్షించేందుకు ఆసుపత్రిలో ఒకరికి బాధ్యతలు అప్పగించారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన వారి దేహాలకు ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహించింది. పరీక్షలు ఆలస్యం కావడంతో జీజీహెచ్‌ మార్చురీలో పెద్దసంఖ్యలో మృతదేహాలు పేరుకుపోతున్నాయి.


ఇది అతి పెద్ద సమస్యకు దారితీస్తోంది. ఈ పరిస్థితుల్లో మృతుల కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు ముందుకు వస్తే అప్పగిస్తున్నారు. ఇదే అవకాశంగా కొందరు అధికారులు, రాబంధులు కలిసి మృతుల కుటుంబసభ్యులను పీల్చిపిప్పి చేస్తున్నారు.  జీజీహెచ్‌ నుంచి శ్మశానవాటికలకు మృతదేహాల తరలింపును వరంగా మార్చుకున్నారు. గుంటూరులోని ఏ శ్మశానవాటికకు అయినా మృతదేహాన్ని తరలించాలంటే రూ.20 వేలు డిమాండ్‌ చేస్తున్నారు.  సొంతంగా వాహనం సమకూర్చుకున్నా.. ఇతరులు ఎవరైనా ముందుకు వచ్చి మృతదేహాలను తరలిస్తామన్నా ఆ రాబంధులు అంగీకరించడంలేదు. వీరికి జీజీహెచ్‌లోని కొందరు సహకరిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక వారు అడిగినంత సమర్పించుకోవాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. 


సోమవారం శారదాకాలనీకి చెందిన సుశీల అనే మహిళ జీజీహెచ్‌లో మృతి చెందింది. కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు జీజీహెచ్‌ అధికారులు ఆమె మృతదేహాన్ని అప్పగించారు. సొంత వాహనంలో ఆమె మృతదేహాన్ని తరలించేందుకు కుటుంబసభ్యులు సిద్ధమయ్యారు. దీంతో రాబంధుల్లా అక్కడ వాలిన వారు వారి వాహనాన్ని అడ్డుకున్నారు. ఎవరికి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో చివరికి రూ.20 వేలు ఇచ్చి తీసుకు వెళ్ళారు.మరో ఎనిమిది మృతదేహాలను కూడా ఇలాగే సొమ్ములు సమర్పించుకుని తీసుకెళ్లారు. మహా ప్రస్థానం ప్రస్థావన రాకుండా ఉండేందుకు రాబంధులు వసూలు చేసిన సొమ్ములో 20 శాతం అధికారులు తీసుకుంటున్నట్లు వారి నాయకుడే బహిరంగంగా చెబుతున్నాడు. ఇప్పటికెనా అధికారులు మహాప్రస్థానం వాహనాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోకపోతే కరోనా మృతుల కుటుంబాలు గుల్లయిపోతాయి.

Updated Date - 2020-08-11T09:35:57+05:30 IST